
గంటలు, రోజుల వ్యవధిలోనే కేసుల పరిష్కారం
ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన నిందితుల పట్టివేత
మూడు నెలల్లో 7 హత్యలు, 2 దొంగతనాల కేసుల పరిష్కారం
కంది, ఆగస్టు 22 : కేసుల పరిష్కారంలో సంగారెడ్డి సబ్ డివిజన్ పోలీసులు శభాష్ అనిపించుకుంటున్నారు. సంగారెడ్డి పట్టణంతో పాటు సంగారెడ్డి మం డలం, సదాశివపేట ప్రాంతాల్లో ఇటీవల వరుసగా హత్యలు, దొంగతనాలు జరిగాయి. ఈ నేరాలు ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. అయినా గంటలు, రోజుల్లో నిందితులను పట్టుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో మూడు హత్యలు, బైక్ దొంగల నిందితులను తక్కువ సమయంలో పట్టుకున్నారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు హత్యలు, ఒక దొంగతనం జరిగాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రోజుల వ్యవధిలోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సదాశివపేట పరిధిలో ఒక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించారు.
సంగారెడ్డి పట్టణంలో 3 హత్యలు, ఒక దొంగతనం…
సంగారెడ్డి పట్టణ పరిధిలో జూలై 30న రాజంపేటకు చెందిన యశ్వంత్ అనే ఏడాదిన్నర పిల్లాడిని సొంత అమ్మమ్మే చెరువులో పడేసి చంపేసింది. ఈ కేసును సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టణ పోలీసులు 12 గంటల్లోనే ఛేదించి ప్రధాన నిందితురాలైన నాగమణితో పాటు మరో నిందితుడు జనార్దన్‌ను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఆగస్టు 16న సంగారెడ్డిలోని శాంతినగర్‌కు చెందిన జోత్స్న తన ఇద్దరు కుమారులైన రుద్రాన్ష్, దేవాన్ష్‌లను ఇంట్లో ఉరేసి చంపేసి ఆపై ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ఈ కేసులో జోత్స్న మానసిక పరిస్థితి బాగాలేనందుకు ఆమె మానసిన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ఆగస్టు 9న సంగారెడ్డిలోని కిందిబజార్కు చెందిన ఆగమయ్య (65) తన పంటపొలంలో హత్యకు గురయ్యాడు. డాగ్‌స్కాడ్, క్లూస్‌టీమ్ ఆధారంగా నిందితుడు యాదగిరిని 24 గంటల్లో పట్టుకుని జైలుకు పంపించారు. ఆగస్టు 5న సంగారెడ్డి విజయనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన టీవీఎస్ ద్విచక్రవాహనం పోయిందని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదు రోజుల్లోనే నిందితుడు వడ్ల నర్సింహులును పట్టుకున్నారు. ఇతడి వద్ద నుంచి మొత్తం 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించి పట్టణ సీఐ రమేశ్‌తో పాటు ఎస్సైలు, ఇతర సిబ్బందిని డీఎస్పీ బాలాజీ ప్రత్యేకంగా అభినందించారు.
సంగారెడ్డి రూరల్‌లో మూడు హత్యలు, ఒక దొంగతనం జూన్ 25న కంది మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన సాయిలు (48) తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. అనుమానితులుగా భావించి విచారించిన పోలీసులు.. హత్యకు గల నిందితులైన మణమ్మ, ప్రవీణ్, పవన్‌ను ఆరు గంటల్లోనే పట్టుకున్నారు. ఈ కేసులో హత్య చేసింది మృతుని సొంత వదిన, కొడుకు, మరో వ్యక్తి ఉండడం గమన్హారం. జూలై 30న సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులో మాజిద్ అనే వ్యాపారి దారుణంగా హత్యకు గురయ్యాడు. డబ్బుల తిరిగి ఇవ్వనందునే మాజిద్‌ను హత్య చేసిన హమీద్, ఇమ్రాన్, తబ్రేజ్‌ను సాంకేతిక త ఆధారంగా పట్టుకుని 5 రోజుల్లో కేసును క్లోజ్ చేశారు. జూన్ 15న జమ్జమ్ దాబాలో రూ.10 లక్షలు చోరీ జరిగింది. సీసీ ఫుటేజీ ఆధారంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన అమీర్ ఖాన్‌ను రూరల్ పోలీసులు మూడు రోజుల్లోనే పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.6 లక్షలు రికవరీ చేశారు. ఆగస్టు 18న కందికి చెందిన శ్రీధర్ అలియాస్ శివ (32) స్నేహితులతో కలిసి ఇంటి నుంచి వెళ్లి హత్యకు గురయ్యాడు. హత్యకు కారణమైన నిందితులు కుమ్మరి రాజు, మురళిని సాంకేతిక ఆధారంగా ఒక్క రోజులో పట్టుకున్నారు. ఈ కేసుల ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సంగారెడ్డి రూరల్ సీఐ శివలింగం, ఎస్సై సుభాశ్, ఇతర సిబ్బందిని డీఎస్పీ బాలాజీ ప్రత్యేకంగా అభినందించారు. పై రెండు కేసుల్లో బాగా పనిచేసిన వారికి రివార్డు కోసం జిల్లా ఎస్పీకి డీఎస్పీ సిఫార్సు చేశారు.
సదాశివపేటలో ఒక హత్య…
సదాశివపేట పట్టణంలోని లక్ష్మీనగర్‌లో జూన్ 6న పెద్దగొల్ల పాపయ్య (65) హత్య చేయబడ్డాడు. ఈ కేసులో సాంకేతిక ఆధారంగా సదాశివపేట సీఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో 24 గంటల్లోనే నిందితుడైన పెద్దగొల్ల బీరప్పను పట్టుకుని రిమాండ్‌కు పంపించారు. నేరం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వాటిని అతి తక్కువ సమయంలో ఛేదిస్తుండడంతో ప్రజల్లో పోలీసులపై మంచి అభిప్రాయం ఏర్పడుతున్నది.
ప్రత్యేక శ్రద్ధతో కేసుల పరిష్కారం…
సంగారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో ఈ మధ్య కాలం లో వరుస హత్యలు, దొంగతనాలు జరిగాయి. ఈ కేసులను సవాలుగా తీసుకుని ఛేదించాం. మా బృందం రేయింబవళ్లు కష్టించి నిందితులను గంటలు, రోజుల వ్యవధిలోనే పట్టుకుంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కేసులు పరిష్కరిస్తున్నాం. ఎవరైనా రౌడీయిజం చేసినా, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినా,ఎలాంటి వేధింపులకు గురిచేసినా మాకు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నేరాల నియంత్రణకు రాత్రింబవళ్లు పోలీసులు శ్రమిస్తున్నారు.