
జాబ్ కార్డుల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 21: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు 1,32,822 కొత్త జాబ్ కార్డులు మంజూరు అయ్యాయని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత జాబ్ కార్డులను ఆయా మండలాలకు పంపిస్తున్నామని వెల్లడించారు. మండల అభివృద్ధి అధికారులు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి పంచాయతీ కార్యదర్శుల ద్వారా వేజ్ సీకర్స్‌కు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. వేజ్ సీకర్స్ జాబ్ కార్డులో నమోదైన సభ్యుల స్టాంపు సైజ్ ఫొటో లు పంచాయతీ కార్యదర్శికి అందజేసి జాబ్ కార్డు పొందాలని సూచించారు. జాబ్ కార్డు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా జాబ్ కార్డ్స్‌ను వేజ్ సీకర్స్‌కు మాత్రమే ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వరాదని సూచించారు. సంబంధిత ఎంపీడీవోల పర్యవేక్షణలో జాబ్ కార్డ్స్ పంపిణీ చేయాల్సిన బాధ్యత ఆయా పంచాయతీ కార్యదర్శి, ఉపాధిహామీ అదనపు ప్రోగ్రామింగ్ అధికారిదని వివరించారు. జాబ్ కార్డు పొందడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే 7095507030 నెంబర్‌పై సంప్రదించాలని ఆయన కోరారు.