
యుద్ధ సమయంలో తీసే ఫొటోలు అనిర్వచనీయం
ప్రొటెం స్పీకర్ భూపాల్‌రెడ్డి
కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
కలెక్టర్ , ఎస్పీ హాజరు
రవి గాంచని చోటును సైతం దృశ్యీకరణ
శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి
పాల్గొన్న కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ, ప్రజాప్రతినిధులు
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 19 : వంద మాటలకన్నా.. ఒక ఫొటో గొప్పదని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవాన్ని గురువారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొటెం చైర్మన్ జిల్లా కలెక్టర్‌తో కలిసి చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్లందరికీ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారు తీసిన ఒక్క ఫొటో వంద మాటలకు సమాధానం చెబుతుందన్నారు. రవి గాంచని చోట కవి గాంచెను అన్న రీతిలో ఫొటోగ్రాఫర్లు తీసిన చిత్రాలు ఉంటాయన్నారు.
ఎన్నో కష్టాలకు ఎదుర్కొంటూ యుద్ధ సమయంలో సైతం ఫొటోలు తీసి కండ్లకు కట్టినట్టు చూపిస్తారని, వారి సేవలను ఎప్పటికీ మరువలేమన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సంగారెడ్డిలోని కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్లతో పోటీ తత్వం సహజంగా ఉంటుందని, అయితే ఆ పోటీల్లోనూ మానవత్వం చాటే విధంగా చిత్రాలు తీసి బతుకులు బాగుపడేలా ఉండాలని సూచించారు. గతంలో తీసిన అనేక ఫొటోల ద్వారా స్పందన వచ్చి బాధితుల బతుకులు బాగుపడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమాజంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు తమ దృష్టికి తీసుకురావడం సంతోషకరమన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ రమణ్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఈస్ట్‌మాన్ కలర్ అంటేనే ఓ గొప్ప విషయమని, ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ఫొటోగ్రఫీ వచ్చినందున పోటీతత్వం పెరిగిందన్నారు. ఫొటోగ్రాఫర్లు తీసిన చిత్రాలతో వారి కష్టం కనబడుతుందన్నారు. అనంతరం ఫొటో జర్నలిస్టులను శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ రమణ కుమార్‌లను సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సత్యనారాయణ, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, జిల్లా పౌర సంబంధాల అధికారి విజయలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.