
చెత్తకుప్పలు.. ముళ్ల పొదల్లో పారేసిన పసికందులకు సంగారెడ్డి మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆశ్రయం కల్పిస్తున్నది.. అభం.. శుభం.. తెలియని పసికూనలను సొంత బిడ్డల్లా సాకుతున్నది. ‘పసి బిడ్డలు భారమైతే.. ఎక్కడ పడితే అక్కడ పడేయకండి.. మా ఊయలలో వేయండి’.. అంటూ శిశుగృహం వద్ద ఊయల ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎనిమిది మంది చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తుండగా, మూడు నెలల్లో ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకుంది. ఆ వివరాలు మీ కోసం మధ్యపేజీలో..
సంగారెడ్డి, ఆగస్టు 18 : మానవత్వం మరిచి కొందరు మహిళలు అభం.. శుభం తెలియని పసికందులను చెత్తకుప్పలు, ముళ్లపొదల్లో పారేస్తున్నారు. మానవుడి సృష్టికి ఆదిమూలమైన మహిళామూర్తి కని పెంచాల్సిన బాధ్యతను మరిచి చెడు ఆలోచనలతో చెత్తకుండీలు, ముళ్లపొదలు, రోడ్డు పక్కన వదిలివేసి చేతులు దులుపుకుంటున్నారు. తల్లిదండ్రులకు భారంగా మారిన పసిపిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పి స్తూ ఆలనా పాలనా చూస్తూ అన్ని రకాలుగా ఆసరాగా నిలిచింది శిశుగృహ. పిల్లలను వదిలించుకున్న వారికి కనువిప్పు కలిగించేలా శిశుగృహ అధికారులు ఈ నెల 2వ తేదీన సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డులో గల కార్యాలయం ఎదుట ఊయలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి పసిబిడ్డలను వదిలివెళ్లిన సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి పిల్లలను చేరదీసి ఆరోగ్య పరీక్షలు చేయించి సంరక్షణ చేస్తున్నది. పుట్టిన గంటలోపు విడిచి వెళ్లిన చిన్నారులకు శిశుగృహ అధికారులు బారసాల చేసి నామకరణం చేస్తున్నారు. బిడ్డలను కన్న తల్లితండ్రులు చేసే విధంగా బారసాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెలల్లో శిశుగృహ సంరక్షణ కేంద్రం నుంచి ఐదు మంది చిన్నారులను దత్తత ఇచ్చారు. ఇద్దరు పాపలు, ముగ్గురు బాబులను ఐదు మంది దంపతు లు పెంపకానికి దత్తత తీసుకున్నారని అధికారులు తెలిపారు.
అనాథల చిన్నారులకు శిశుగృహ రక్షణగా నిలుస్తున్నది. శిశుగృహను మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి పద్మావతి సంరక్షణలో వారికి కావాల్సిన ఆటవస్తువులు, బట్టలు, వసతితోపాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రస్తుతం శిశుగృహలో 8మంది చిన్నారులు వసతి పొందుతూ పూర్తి ఆరోగ్య వంతులుగా ఉన్నారు. ఇటీవల ఇద్దరు పిల్లలను దత్తత ఇచ్చారు. పిల్లలు లేని తల్లితండ్రులు శిశుగృహ అధికారులను కలిసి దత్తత తీసుకుంటామని దరఖాస్తు చేసుకుంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపి రెండు మూడు సంవత్సరాల తర్వా త అవకాశం కల్పిస్తారు. దత్తత తీసుకున్న పిల్లల సంరక్షణకు తల్లితండ్రులు ఎలా చేస్తున్నారు అనే విషయాలను శిశుగృహ అధికారులు ఆరునెలలకోసారి పరిశీలిస్తారు. నాలుగు సార్లు సమగ్రంగా పరిశీలించిన అనంతరం సంరక్షణ బాధ్యత నివేదికను ఉన్నతాధికారులకు పంపించడంతో రెండేండ్ల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు దత్తత తీసుకున్న తల్లితండ్రులకు పూర్తి బాధ్యత అప్పగిస్తారు.
తల్లితండ్రుల సంరక్షణలో ఉన్న బిడ్డలకు ఘనంగా బారసాల నిర్వహించి ఇష్టమైన నామకరణం చేయడం ఆనవాయితీ. వదిలివేసిన, అనాథ పిల్లలను చేరదీసిన శిశుగృహ అధికారులు బారసాల చేసి నామకరణం చేస్తున్నారు. శిశుగృహ అధికారులు ఈ నెల 10న ఇద్ద రు చిన్నారులకు బారసాల చేసి నామకరణం చేశారు. జూలై 13వ తేదీన గుమ్మడిదల మం డలం దోమడుగు గ్రామంలో పుట్టిన గంటకే పసిగుడ్డును వదిలివేసిన పాపకు బారసాల చేసి మధులత అని పేరు పెట్టారు. నెల రోజుల కింద పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో రోడ్డు పక్కన చెత్తకుండీలో మూడు నెలలు నిండిన పాపను వదిలేసినట్లు సమాచారం రాగానే శిశుగృహ అధికారులు సంరక్షించి బారసాల చేసి నళిని అని నామకరణం చేశారు.
పుట్టింది ఆడపిల్ల అని తెలిసి కొందరు తల్లిదండ్రులు వదిలించుకుంటున్నారు. అలాంటి తల్లిదండ్రులకు కనువిప్పు కలుగాలని శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో పసిబిడ్డలను పారవేయకుండా ఊయల్లో వేయాలి. పెరిగి పెద్దయ్యాక దేశానికే ఆదర్శంగా తయారయ్యే అవకాశం ఉన్నది. కన్న తల్లితండ్రులకు ఆడపిల్ల పుట్టిందని భారంగా భావించి చెత్తకుప్పలు, ముళ్లపొదలు, రోడ్డు పక్కన వేయడం కన్న ఊయల్లో వేసి వారి భవిష్యత్‌ను కాపాడాలి. సమాజం పెరుగుదలకు మహిళనే మూలకారణం అనే విషయాన్ని మరిచి కొందరు పసిగుడ్డులను వదిలించుకుంటున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా పసిపాపలను వదిలించుకుంటున్న మహిళామణులు పిల్లల భవిష్యత్‌ను కాపాడాలి.
-పద్మావతి, జిల్లా శిశుసంక్షేమ, మహిళాభివృద్ధి అధికారి