
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏడేండ్లలో అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని, అనేక రంగాల్లో దేశానికి రోల్‌మోడల్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో మంగళవారం కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. గీతం చైర్మన్ శ్రీభరత్, విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయని, ఈ విధానాన్ని దేశానికి పరిచయం చేసింది తెలంగాణ అన్నారు. మిషన్ భగీరథను దేశంలోని అనేక రాష్ర్టాలు స్ఫూర్తిగా తీసుకున్నాయని తెలిపారు. బ్యూరోక్రసీ ఆలోచనా విధానం మారాలని, ప్రజాప్రతినిధులను గెస్ట్ ఆర్టిస్టులుగా చూడవద్దని కోరారు. దళితబంధు విప్లవాత్మక పథకమన్నారు.విద్యార్థులు పబ్లిక్ పాలసీలపై అధ్యయనం చేసి మంచి, చెడులపై నివేదికలను తయారు చేయాలన్నారు. అపజయాలకు వెరవకుండా ముందుకు సాగాలని, కష్టపడితే విజయం సాధ్యమని మంత్రి సూచించారు.
పటాన్చెరు, ఆగస్టు 17 : సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఏడేండ్లలో అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో మంగళవారం కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, గీతం చైర్మన్ శ్రీభరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులు తెలంగాణలోని పథకాలతో పాటు ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న దళితబంధు పథకం గురించి ప్రశ్నలు సంధించారు. కేటీఆర్ ఎంతో ఓపికగా విద్యార్థులకు ఇంగ్లిష్, హిందీ, తెలుగులో సమాధానాలు ఇచ్చారు. గీతం వర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రారంభించడం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు పబ్లిక్ పాలసీలపై అధ్యయనం చేసి మంచి, చెడులపై నివేదికలను తయారు చేయాలని సూచించారు. విద్యార్థులు అపజయాలకు వెరవకుండా ముందుకు సాగాలని, కష్టపడితే విజయం సాధ్యమని మంత్రి సూచించారు. విద్యార్థులతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి
ఈశ్వర్, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలు అని హామీలు ఇచ్చారు. ఇప్పుడు నియామకాల పరిస్థితులు
ఎలా ఉన్నాయి.?
మంత్రి కేటీఆర్: అమెరికా అధ్యక్షుడు బైడన్, పీఎం మోదీ, సీఎం కేసీఆర్ ఎవరైనా సరే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కష్టసాధ్యం. ఏ ప్రభుత్వమైనా అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల సహకారంతోనే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. దేశంలో సగం జనాభా యువతనే. ఉద్యోగ కల్పనలో విశేషంగా ముందడుగు వేశాం. టీఎస్ ఐపాస్‌ను పటిష్టం చేయడంతో సింగిల్ విండోలో పరిశ్రమలకు అనుమతులు వస్తున్నాయి. సెల్ఫ్ సర్టిఫికెట్ ద్వారా ఎవరైనా పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టుకోవచ్చు. రుద్రారంలోనే ఒక యూనిట్ ముందుగా ప్రారంభించి తర్వాత అనుమతులు తీసుకోవచ్చు. ఉద్యో గ కల్పన కోసం ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దేశంలోనే బెస్ట్ పాలసీ టీఎస్ఐపాస్. అన్ని రకాల అనుమతులు ఒక దరఖాస్తుతోనే ఇస్తున్నాం. 15రోజుల్లో ఏదైనా శాఖ క్లియరెన్స్ ఇవ్వని పక్షంలో రోజుకు వెయ్యి రూపాయల జరిమానా సైతం విధిస్తున్నాం. ఏడేండ్ల కాలంలో రూ. 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 15లక్షల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించింది. స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తున్నాం. శిక్షణలను ముమ్మరం చేశాం. రాష్ట్రంలో 1.39 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95శాతం స్థానికులకే ఇస్తు న్నాం. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పిస్తున్నాం.
స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తున్నాం.
అవుదుంబర్, కొల్లాపూర్, మహారాష్ట్ర : పబ్లిక్ పాలసీ కోర్సు ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.? గ్రాస్‌రూట్ లెవల్లో దీని ఫలితాలు ఎలా ఉంటాయంటారు.?
మంత్రి కేటీఆర్: నేను రాజకీయాల్లో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. నిజమైన నాయకుడు ప్రజల సమస్యల్లోంచి వస్తాడు. వాస్తవ ప్రపంచం వేరుగా ఉంటుంది. మనం చదివే చదువుకు, బయట ప్రపంచానికి వ్యత్యాసం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బిల్ పాస్ చేస్తే దానిలోని సమగ్ర సమాచారం ఎంపీలకు ఉండదు. వాస్తవ సమాచారం తెలుసుకుంటేనే దాని మంచిచెడు అర్థం అవుతుంది. ఒకప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీయే తాను ఒక్క రూపాయి ఢిల్లీలో రిలీజ్ చేస్తే 16 పైసలు మాత్రమే లబ్ధ్దిదారుడికి చేరుతుందని, 84పైసలు మధ్యలోనే అవినీతికి గురవుతున్నాయని వాపోయారు. మా పాలసీలో భాగంగా రైతుబంధు పథకాన్ని తీసుకుని వచ్చాం. నేరుగా సొమ్మంతా లబ్ధ్దిదారుడి బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతున్నది. పూర్తిగా పారదర్శకమైన కేటాయింపు ఇది. రైతులకు అప్పులు చేసే దుస్థితి తప్పింది. రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయి. ధాన్యాగారాలు నిండేలా పాడిపంటలు పండుతున్నాయి. దీన్ని చూసే కేంద్రం కూడా రైతులకు నేరుగా నిధులను బ్యాంక్‌లో వేస్తున్నది. కల్యాణలక్ష్మిలో కూడా నేరుగా రూ. లక్షకు పైగా నగదు పెళ్లికూతురు తల్లి బ్యాంక్ అకౌంట్‌కు చేరేలా చేశాం. దీంతో అవినీతి అనేదే లేకుండా పోయింది. పైగా 18ఏండ్లు దాటిన అమ్మాయిలకే పెండ్లిలు చేస్తున్నారు. బాల్యవివాహాలు, త్వరగా గర్భం దాల్చే పరిస్థితులు దాదాపుగా తగ్గిపోయాయి. పురుటి మరణాలు ఆగిపోయాయి. డెలివరీలకు దవాఖానలకు వస్తున్నారు. కేసీఆర్ కిట్‌ను అందజేసి తల్లీబిడ్డల సంరక్షణ కల్పించాం. ఒక పథకంతో ఎన్నో లాభాలు సమాజానికి కలుగుతున్నాయి. మేం చేస్తున్న పనులతో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతున్నది.
వినయ, మహారాష్ట్ర: సర్.. మీలాంటి నాయకుల అవసరం ప్రస్తుతం ఉంది. ప్రభుత్వ పాలసీ అమలులో మీరు
ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు?
మంత్రి కేటీఆర్ : మా కుటుంబ నేపథ్యంలో పలువురు అధికారుల పనితీరును ప్రత్యక్షంగా నేను చూశాను. నా వ్యాఖ్యలు బ్యూరోక్రసీలో ఉన్న మీనా వంటి సీనియర్ అధికారులను బాధిస్తే క్షమించాలి. బ్యూరోక్రాట్లు ప్రజాప్రతినిధులను నిరక్షరాస్యులుగా, విషయం తెలియని వ్యక్తులుగా భావిస్తారు. ఐదేండ్లు ఉండే గెస్టు ఆర్టిస్టులుగా భావిస్తారు. విజన్ ఉన్న నాయకుల ప్రతిపాదనలను కూడా వ్యతిరేకిస్తారు. నేను 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలో పాలసీలపై ఎలాంటి అవగాహన లేదు. అధికారులు విడమర్చి చెప్పేవారు కాదు. నా నియోజకవర్గంలోని ఒక నాయకుడు ఫోన్‌చేసి నీళ్ల ట్యాంకర్ పంపాలని కోరాడు. ఇప్పటికీ ప్రజలు సోషల్ మీడియా ద్వారా పీఎం, సీఎం, మంత్రులను ఏదైనా అడుగుతున్నారు. ఐదంచెల వ్యవస్థ ఉన్న ఎవరు ఏమేరకు పనిచేస్తారు అనే విషయంలో అవగాహన ఉండట్లేదు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేందుకు తెచ్చిన పాలసీలకు బ్యూరోక్రాట్ల సహకారం ఎంతో అవసరం. మిషన్ భగీరథతో ప్రతి గడపకూ తాగునీరు అందించే ప్రతిపాదన తీసుకుని వచ్చినప్పుడు, హరితహారంలో 230కోట్ల మొక్కలను నాటేందుకు నిర్ణయించినప్పుడు కష్టసాధ్యమన్న వారున్నారు. సహకరించిన అధికారులున్నారు. ఒక పథకం ద్వారా నిధులు ఖర్చు చేస్తే, ఆ నిధులు తిరిగి రెట్టింపు లాభంతో మనకే వస్తాయని గుర్తించాలి. మన ఆలోచనలు బాగున్నాయని గుర్తించిన బ్యూరోక్రాట్లు మనకు సహకరిస్తారు. మన ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు కూడా సరిగ్గా స్పందించవు. నీటి ప్రాజెక్టులు వంటి వాటికి అనేక రకాల అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించేందుకు బ్యూరోక్రాట్లు, అనేక వ్యవస్థలు సహకరించాల్సి ఉంటుంది.శ్రీభరత్, గీతం అధ్యక్షుడు: విజయాలను, వైఫల్యాలను ఎలా స్వీకరిస్తారు.?
మంత్రి కేటీఆర్: జీవితంలో విజయాలు, వైఫల్యాలు రెండు ఎదురవుతాయి. రెండింటినీ సమానంగానే స్వీకరిస్తాను. ప్రజల కోసం పనిచేస్తున్నాం. వారి కలలను నిజం చేసేందుకు పాలసీలు రూపొందిస్తున్నాం. వారి అభివృద్ధి కోసం సవాళ్లను ఎదుర్కొంటూ పనిచేస్తున్నాం. మంచి ప్రాజెక్టులు తెలంగాణకు తీసుకుని రావాలని కోరుకుంటాం. అన్ని వనరులున్నా తెలంగాణకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కేంద్రం కేటాయించదు. జనాభా కంట్రోల్ చేయాలనే ఆలోచనకు దక్షిణ భారతదేశంలో ఆదరణ ఉంది. యూపీ వంటి రాష్ర్టాలకు అధిక జనాభా, ఎంపీ సీట్లు 80 ఉండటంతో పెద్ద ప్రాజెక్టులు దక్కేలా చేస్తున్నది. మేకిన్ ఇండియా అంటూనే డిఫెన్స్ కంపెనీలకు అనుకూలమైన హైదరాబాద్, బెంగళూర్లను వదిలి బుందేల్‌ఖండ్‌కు కేంద్రం ప్రాజెక్టులు ఇవ్వడం మాకు నిరాశ కల్గించే విషయాలు. రాజకీయ కారణాలు, సమీకరణలు అనేక సమస్యలను ప్రభావితం చేస్తున్నాయి.
రాసన్, ముంబై: వాతావరణ మార్పుల ప్రభావం, పట్టణాలపై దాని తీవ్రత ఎంతగా ఉంటుంది..?
కేటీఆర్ : ఐదువేల ఏండ్ల క్రితం పర్యావరణం వేరు. ఇప్పుడున్న పర్యావరణం వేరు. పర్యావరణ పరిరక్షణకు అందరం శ్రమించాల్సి ఉంది. రూరల్ ప్రాంతాల నుంచి వలసలు అధికం కావడంతో పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పట్టణాలు, నగరాలపై ఒత్తిడి పెరిగింది. ప్లాస్టిక్ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే దానికి ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు నిషేధం విజయవంతం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తెచ్చినా, దానిని నిలువరించే సాంకేతికత, వనరులు మన వద్ద ఉండాలి. అనేక రంగాలను డిజిటలైజ్ చేస్తామని చట్టాలు తెచ్చినా, వాటిని అమలు చేసేంత వనరులు మన వద్ద లేవని గుర్తించాలి. సాధ్యాసాధ్యాలను బట్టే పథకాలు, చట్టాలు అమలవుతాయి.