
పటాన్చెరు,ఆగస్టు 16: విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్‌లో కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో భాగంగా నిర్వహించిన మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ (ఎంపీపీ) విద్యార్థుల ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సరిహద్దులపై అఫ్ఘనిస్థాన్ పరిణామాలు ప్రభావం చూపవన్నారు. మనదేశ సరిహద్దుల్లో గట్టి రక్షణ ఉంటుందన్నారు. కేంద్రంలో ఇన్నేండ్లు పాలించిన ప్రభుత్వాలు కశ్మీర్‌ను ఆశించిన మేర అభివృద్ధి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారం లభించడం లేదని కొందరు కశ్మీర్ యువత అసంతృప్తితో తుపాకులు పట్టారన్నారు. కొద్దిరోజులుగా కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న చర్యలపై కశ్మీరులకు సంతృప్తి లేదన్నారు. ఎనిమిది నెలల పాటు తనను హౌజ్ అరెస్టు చేసి బయటి ప్రపంచానికి దూరంగా పెట్టారని ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.కశ్మీరీలపై దురాభిప్రాయాలు సరైనవి కావన్నారు. యువత తాము ఎంచుకున్న రంగంలో శక్తివంచన లేకుండా కష్టపడితే మంచిస్థానానికి చేరుకోవచ్చిన ఆయన తెలిపారు. జీవితంలో ఎన్నో చాలెంజ్‌లు వస్తాయని, వాటిని దీటుగా ఎదుర్కోవాలని సూచించారు. కొత్త తరం రాజకీయాల్లోకి ప్రవేశించి సమస్యలకు పరిష్కారాలు వెతకాలని కోరారు. ప్రజల గొంతుగా నిలబడాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మహారాష్ట్ర ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. పాలసీ తయారీ, జాతి నిర్మాణంపై ఓవైసీ విద్యార్థులకు వివరించారు. పార్లమెంట్లో అర్ధవంతమైన చర్యలు జరగుడం లేదని ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. సభను ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో చర్చలు జరగడం లేదని, దీని కారణంగా లోపభూయిష్టమైన బిల్లులు చట్టరూపం దాలుస్తున్నాయని చెప్పారు. ఇలాంటి బిల్లులను కోర్టులు సరిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. విపక్షాలన్నీ ఒకరకంగా బీజేపీ ఉచ్చులో పడ్డాయనిపిస్తున్నదన్నారు. రాజ్యసభలో ఒక విధంగా, లోక్‌సభలో మరోరకంగా వ్యవహరించి అధికార పార్టీ తన పబ్బం గడుపుతున్నదన్నారు. చర్చలే జరగకపోతే సమాధానం ఇచ్చే అవకాశమే ఉండట్లేదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వ్యక్తలు సమాధానాలు ఇచ్చారు. గీతం అధ్యక్షుడు శ్రీభరత్, గీతం చాన్స్‌లర్ వీఎస్ చౌహాన్, వైస్ చాన్స్‌లర్ ప్రొ.శివరామకృష్ణ, ప్రొ. వీసీ శివప్రసాద్ పాల్గొన్నారు.