e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home జిల్లాలు ఎత్తిపోతలతో సస్యశ్యామలం

ఎత్తిపోతలతో సస్యశ్యామలం

  • సంగారెడ్డికి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలు వరం
  • అభివృద్ధి పథంలో జిల్లా.. పథకాల అమలులో నూతన ఒరవడి
  • దేశానికి ఆదర్శంగా ‘దళితబంధు’ పథకం
  • సంగారెడ్డిలో త్వరలో మెడికల్‌ కాలేజీ ప్రారంభం
  • స్వాతంత్య్ర వేడుకల్లో మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి
  • సంగారెడ్డిలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

సంగారెడ్డి, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో సంగారెడ్డి జిల్లా రానున్న రోజుల్లో సస్యశ్యామలం కానుందని, జిల్లాలో బంగారు పంటలు పండి బతుకులు మారుతాయని శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి అన్నారు. 75వ స్వాతంత్య్ర వేడుకలు సంగారెడ్డిలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘దళితబంధు’ పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ధ్ది పథంలో పయనిస్తోందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచామన్నారు. సంగారెడ్డిలో ఆర్‌టీపీసీఆర్‌ సెంటర్‌, డయాగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డిలో త్వరలో మెడికల్‌ కాలేజీని ప్రభుత్వం ప్రారంభించనుందని ప్రొటెమ్‌ చైర్మన్‌ తెలిపారు.

నేటి నుంచి రుణమాఫీ…

పంట రుణమాఫీ పథకంలో భాగంగా ప్రభుత్వం సోమవారం నుంచి రూ.50వేల రుణాలను మాఫీ చేయనుందని ప్రొటెం చైర్మన్‌ తెలిపారు. జిల్లాలోని 29,064 మంది రైతులకు రూ.98.10 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని తెలిపారు. రైతుబందు పథకం ద్వారా వానకాలం సీజన్‌కు సంబంధించి 3,03,120 మంది రైతుల ఖాతాల్లో రూ.366.86 కోట్లు జమచేశామన్నారు. రైతుబీమా పథకంలో భాగంగా ఒక్కొక్కరి రూ.5 లక్షల చొప్పున బీమా సొమ్మును మరణించిన 1398 మంది రైతుల నామినీ ఖాతాల్లో రూ.69.90 కోట్లు జమ చేశామన్నారు. ఈ సీజన్‌లో రైతులు 6,86,260 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ ఆహారభద్రత పథకం ద్వారా రైతులకు రాయితీపై కంది, పెసర విత్తనాలను పంపిణీ చేశామన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధ్దికి కృషిచేస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 17,503 గొర్రెలను పంపిణీ చేశామన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 482 చెరువుల్లో రూ.2.83 కోట్లతో చేపలను పెంచి 14,975 టన్నుల ఉత్పత్తి సాధించామన్నారు. అందోలు, హస్నాబాద్‌, బగులంపల్లి ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టులో రొయ్యల పెంపకం చేపడుతున్నట్లు తెలిపారు. వందశాతం గ్రాంట్‌తో సంగారెడ్డి, చిదృప్ప గ్రామంలో రూ.30 లక్షలతో చేపల మార్కెట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఐఎఫ్‌డీ పథకం ద్వారా కోహీర్‌ మండలం గొటిగార్‌పల్లిలో రూ.10 లక్షలతో షిప్‌ ల్యాం డింగ్‌ సెంటర్‌, న్యాల్‌కల్‌ మండలం హుమ్నాపూర్‌లో మెండింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సాగునీటికి పెద్దపీట…

- Advertisement -

జిల్లాలో ఏడు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.26.19 కోట్లు మంజూరు చేసిందని మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి తెలిపారు. మంజీరా నదిపై నాలుగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.23.86 కోట్లు మంజూరు చేసిందన్నారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో నూతన చెరువుల నిర్మాణానికి రూ.32.09 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. రూ.24.15 కోట్లతో నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-19 ద్వారా సంగారెడ్డి జిల్లాలోని 17,527 ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు.

రూ.175.18 కోట్లతో గృహ నిర్మాణాలు

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తోందని మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 175.18 కోట్లతో 2355 ఇండ్లు నిర్మించామన్నారు. ఐడీఏ పాశమైలారం ఇండస్ట్రియల్‌ పార్కు నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.45 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. జిల్లాలోని రహదారుల మరమ్మతు పనులకు రూ.25.83 కోట్లు, 29 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.73.64 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలను కలిపే రహదారుల నిర్మాణ పనులు రూ.58.89 కోట్లతో పూర్తి చేశామన్నారు. జిల్లాలోని 295 వైకుంఠధామాలు, 113 రైతు వేదికలకు మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతుందన్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా జిల్లాలో 671 పరిశ్రమలకు అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. సుమా రు రూ.5587 కోట్ల పెట్టుబడితో 460 పరిశ్రమలు స్థాపించి 26,605 మందికి ఉపాధి కల్పించామన్నారు. సేవా రంగానికి సంబంధించి రూ.29.87కోట్ల రాయితీతో 101 యూనిట్లను ఏర్పాటు చేశామని, అన్ని మున్సిపాలిటీల్లో రూ.38.50 కోట్లతో వెజ్‌నాన్‌వెజ్‌ మార్కెట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.10.25 కోట్లతో మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్‌, జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, అదనపు ఎస్పీ సృజన, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, సంగారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement