
సంగారెడ్డి కలెక్టరేట్/ నారాయణఖేడ్/న్యాల్కల్/ అందోల్/ రాయికోడ్/ జహీరా బాద్/కల్హేర్/ కోహీర్, ఆగస్టు 15 : జిల్లావ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండలాలు, పట్టణాలు, గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, పోలీస్స్టేషన్లలో స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో నిర్వహించిన వేడుకలకు నిజామాబాద్ బెటాలియన్ ఎన్సీసీ అధికారి సుబేదార్ శేఖర్ హాజరై జెండా వందనం చేశారు. అనంతరం ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రవీణ మాట్లాడారు. అనంతరం ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ 1,2,3,4 విభాగాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్న కళాశాల విద్యార్థులకు ప్రిన్సిపాల్ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అందోల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జెండా ఎగరవేసి జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి వందనం సమర్పించారు. జహీరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీడీసీ కార్యాలయం వద్ద చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ అవిష్కరణ చేశారు. నారాయణఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించగా, మున్సిఫ్ కోర్టు వద్ద మెజిస్ట్రేట్ ఎస్.ప్రియాంక, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ చాందిబాయి చౌహాన్, మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్పర్సన్ రుబినాబేగం నజీబ్, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, డీఎస్పీ కార్యాలయం వద్ద డీఎస్పీ సత్యనారాయణరాజు, తహసీల్ కార్యాలయం వద్ద తహసీల్దార్ దశరథ్‌సింగ్ సహా ఆయా కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించి, అందరం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని గుర్తుచేశారు. జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు.