
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 14: జిల్లాలో మూడు వారాలుగా వర్షాలు లేక పంటలకు గడ్డు పరిస్థితులు వచ్చాయి. వర్షాభావ పరిస్థితులు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పత్తి పంట సాగు చేశారు. ఇప్పటికే 3.93 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండిస్తున్నారు. పత్తితో పాటు మొక్కజొన్న, పెసర, మినుము, సోయాబీన్ వంటి వర్షాధార పంటలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. వరుసగా మూడు వారాల పాటు వర్షాలు కురవక పోవడంతో ఆయా పంటలపై ప్రభావం చూపుతున్నది. దీంతో మొక్కలు వడలిపో యి, శాఖీయ పెరుగుదల నిలిచిపోతున్నట్టు గుర్తించామని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సూచనల మేరకు వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంటల తీరును పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పంటలపై తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నదని స్పష్టం చేశారు. వారు గమనించిన పలు అంశాలు ఈ విధంగా ఉన్నాయి. వివిధ పంటలకు సంబంధించిన మొక్కలు వడలిపోయి, శాఖీయ పెరుగుదల నిలిచిపోతున్నట్టు గుర్తించారు. పెసర, మినుము, సోయాబీన్ పంటల్లో పూతదశ నిలిచిపోయి, పూత రాలిపోవడం జరుగుతున్నది. పత్తి పంటపై తీవ్ర నీటి ప్రభావం ఏర్పడింది. పత్తి పంటలో శాఖీయ పెరుగుదల నిలిచిపోయి మొక్కలు వదలిపోవడం రైతులకు కష్టంగా మారింది. దీంతో పత్తి పం టపై రసం పీల్చే పురుగులు పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక వంటి వాటి బెడద ఎక్కువైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పలు జాగ్రత్తలు, మెళుకువలు సూచిస్తున్నారు. మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ వంటి పంటలు సాగుచేస్తున్న రైతులకు నీటి వనరులు అందుబాటులో ఉంటే, ఒకటి లేదా రెండు తడులు ఇచ్చి ఆయా పంటలను కాపాడుకోవచ్చు. పంట చేనులో కలుపు మొక్కలు లేకుండా అంతరకృషి పద్ధ్దతులను పాటించాలి. మల్చింగ్ వంటి పద్ధ్దతులను పాటించి నేలలో నీటి తేమను ఆవిరి రూపంలో వృథా కాకుండా నివారించుకోవాలి. నత్రజని అంటే 2శాతం యూరియా, సూక్ష్మ పోషకాలు అంటే జింక్, ఐరన్, బోరాన్, మలిబ్దినం వంటి వాటిని తగినంత నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయడం ద్వారా మొక్కలను 20 నుంచి 25 రోజుల వరకు కాపాడుకోవచ్చు. ఇతర ఎరువుల వాడకాన్ని మోతాదుకు తగ్గించి వాడడం లేదా మెట్ట భూముల్లో వేయకపోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. మెట్ట వాతావరణ పరిస్థితిలో పంటల్లో తేమ శాతం తగ్గి పోషక విలువలు కోల్పోతాయి. ఈ నేపథ్యంలో ఆయా పైర్లకు పోషకాలు అందించాలి. పొటాషియం నైట్రేట్ (13-0-45)ను లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఈవిధంగా చేయడం ద్వారా మొక్కలకు కావాల్సిన పోషకాలు అందుతాయని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.