
మహారాష్ట్ర, కర్ణాటకకు సరిహద్దున ఉన్న జహీరాబాద్ కేంద్రంగా రేషన్ అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుండగా.. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పలు జిల్లాల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి వ్యాపారులు జహీరాబాద్‌లోని గోదాములు, వ్యవసాయ క్షేత్రాల్లో నిల్వచేస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్లో మన బియ్యానికి డిమాండ్ ఉంది. అక్కడ మంచి ధర పలుకుతుండడంతో వ్యాపారులు లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 2300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడడం విశేషం. శని, ఆదివారాల్లో అధికారులు ఉండరని అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా లారీల్లో సరిహద్దు దాటిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల కాలంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకుంటున్నారు. వ్యాపారులు గ్రామాల్లో కూలీలను ఏర్పాటు చేసి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. పలుచోట్ల రేషన్ డీలర్లు నేరుగా లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరించి వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
జహీరాబాద్, ఆగస్టు 14 : పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతుండడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. బియ్యం అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు, పౌరసరఫరాల అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పేదల ఆకలి తీర్చటానికి రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా, ఇటీవల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది.
కొందరు వ్యాపారులు, డీలర్లు పేదల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. గుజరాత్, మహారాష్ట్రలో మన బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. అక్కడ మంచి ధర పలుకుతుండడంతో వ్యాపారులు టన్నుల కొద్ది తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పలు జిల్లాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని జహీరాబాద్ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాలు, గోదాముల్లో నిల్వచేసి లారీల్లో సరిహద్దు దాటిస్తున్నారు.
నాలుగు రోజుల్లో జహీరాబాద్‌లో పౌర సరఫరాలు, పోలీసు శాఖ అధికారులు దాడులు చేసి 2300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. జహీరాబాద్, కర్ణాటకకు చెందిన బియ్యం వ్యాపారులు దందా సాగిస్తున్నారు. వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లా లో కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని చిన్న చిన్న వాహనాల్లో జహీరాబాద్‌లోని గోదాములకు తరలిస్తున్నారు. ఇక్కడ భారీగా నిల్వచేసి లారీల ద్వారా శని, ఆదివారాల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆ రోజుల్లో అధికారులు, పోలీసులు ఉండరనే అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసింది. పోలీసు, పౌరసరఫరాశాఖ అధికారులకు ఎప్పటికప్పుడు దాడులు చేసి పట్టుకుంటున్నారు.
ప్రభుత్వం పేదల కడుపు నింపడానికి ఒక్కో వ్యక్తికి ఆరు కిలోలు రూపాయి చొప్పున బియ్యం అందిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా నిరుపేదలకు ఉపాధి కోల్పోయి బియ్యం కొనలేని స్థితిలో ఉండడంతో 10 కిలోలు ఉచితంగా సరఫరా చేస్తున్నది. ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే అందిస్తుండడంతో ఇతర ఖర్చుల కోసం కొందరు వీటిని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మరి కొందరేమో దొడ్డు బియ్యం తినలేక అమ్ముకుంటున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
గ్రామాల్లో కొందరు ఇంటింటికీ తిరుగుతూ రేషన్ బియ్యం సేకరిస్తున్నారు. రేషన్ బియ్యం పంపిణీ చేసే సమయంలో వ్యాపారులు కొంతమంది కూలీలను నియమించుకొని ఇంటింటికీ తిరిగి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రేషన్ డీలర్లే లబ్ధ్దిదారులకు డబ్బులు ఇచ్చి బియ్యం తీసుకుంటున్నారు. గ్రామాల్లో కిలో బియ్యం రూ.10 నుంచి రూ. 14 చొప్పున బహిరంగంగానే కొనుగోలు చేసి ఆటోల్లో తరలించి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గ్రామాలు,పట్టణాలో కొనుగోలు చేసిన బియ్యాన్ని వ్యాపారులు నిల్వ చేసి రూ. 15 నుంచి 16 వరకు అమ్ముకుంటున్నారు. కొందరు వ్యాపారులు నేరుగా లారీల్లో మహారాష్ట్ర, గుజరాత్‌కు తరలిస్తున్నారు. అక్కడ దొడ్డు బియ్యం రూ. 20 నుంచి రూ.30 వరకు ధర పలుకుతున్నది. దీంతో వారికి బియ్యం రవాణాతో మంచి ఆదాయం సమకూరుతున్నది.
గ్రామాలు, పట్టణాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని అనుమానం రాకుండా వ్యాపారులు గోనె సంచుల్లో కాకుండా ప్లాస్టిక్ సంచుల్లో నింపుతున్నారు. ఒక్కో బ్యాగుల్లో 25 నుంచి 50 కిలోలు నింపుతున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్నప్పుడు తనిఖీ చేసే అధికారులు పరిశీలించినప్పుడు గుర్తించడం కష్టం. సంచుల్లోని బియ్యం బయటకు తీసి పరిశీలిస్తే తప్పా గుర్తుపట్టడం కష్టం. రేషన్ బియ్యం తరలించే సమయంలో వ్యాపారులు ఎవరూ ఉండారు. కేవలం లారీ డ్రైవర్, క్లీనర్, కూలీలే ఉంటారు. కొందరు బియ్యం వ్యాపారులు రేషన్ బియ్యాన్ని మిల్లులకు తరలించి, మిల్లింగ్, రీసైక్లింగ్ చేసిన తర్వాత నేరుగా బహిరంగ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు.
దాశివపేట, ఆగస్టు 14 : అక్రమంగా రవాణా చేస్తున్న 600 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదాశివపేట సీఐ సంతోష్‌కుమార్ వివరాల ప్రకారం.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో ఆగి ఉన్న రెండు లారీలను పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 600 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎంహెచ్ 46 ఎఫ్ 4255, జీజే 25 యు, 9195 నంబర్ గల లారీల్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు తరలిస్తున్నట్టు గుర్తించారు. లారీలను సదాశివపేట పోలీస్ స్టేషన్‌కు తరలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) శివారులోని పొలంలో నిల్వచేసిన 210 రేషన్ బియ్యాన్ని ఈనెల 8న పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ నెల 11న జహీరాబాద్ మం డలం చిరాగ్పల్లి శివారులోని మాడ్గి చౌరస్తా వద్ద 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అదేరోజు బుధేరా వద్ద లారీలో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. తాజాగా శనివారం జహీరాబాద్ మండలం సత్వార్ శివారులో కోహినూర్ దాబా హోటల్ వద్ద రేషన్ బియ్యంతో ఉన్న మూడు లారీలను చిరాగ్పల్లి పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో డీఎస్పీ శంకర్రాజు, చిరాగ్పల్లి ఎస్సై కాశీనాథ్ దాడి చేసి మూడు లారీల్లో 900 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు శఫియొద్దీన్, శ్రీనివాస్ పంచనామా చేసి పౌరసరఫరాల గోదాముకు బియ్యాన్ని తరలించారు.