
దేశవ్యాప్తంగా 400
కళాశాలలతో పోటీపడి ఎంపిక
గ్రీన్ చాంపియన్ అవార్డును అందజేస్తున్న అదనపు కలెక్టర్ రాజర్షి షా
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 13: సంగారెడ్డి జిల్లా కందిలోని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల డిస్ట్రిక్ట్ గ్రీన్ చాంపియన్ అవార్డుకు ఎంపికైంది. ఇందుకు గానూ మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ దేశవ్యాప్తంగా 400 కళాశాలల్లో సర్వే చేసింది. కళాశాలల్లో స్వచ్ఛత, వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, పచ్చదనం, పరిశుభ్రత వంటి వివిధ సామాజిక, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్నది. అన్ని అంశాల్లో కంది వ్యవసాయ కళాశాల డిస్ట్రిక్ట్ గ్రీన్ చాంపియన్ అవార్డు సాధించింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌కు శుక్రవారం సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా రాజర్షి షా మాట్లాడుతూ కళాశాలలోని స్వచ్ఛతా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని, జిల్లాలోని మిగతా ఉన్నత విద్యా కళాశాలల విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి కళాశాల ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. అవార్డుకు ఎంపికైనందుకు ప్రిన్సిపాల్‌ను అభినందించారు. అంతకుముందు నిర్వహించిన స్వచ్ఛత వెబినార్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి డీన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డాక్టర్ సీమ, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫేర్స్ డాక్టర్ జే సత్యనారాయణ, ఏవో డాక్టర్ వైద్యనాథ్, డీఆర్డీఏ శ్రీనివాసరావు, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీనివాస్ కుమార్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పీ రమేశ్, డాక్టర్ ఏ అనిల్‌కుమార్, జిల్లాలోని అన్ని ఉన్నత విద్యా కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.