
జాడలేని ఎంపీ లాడ్స్
2017-18 నుంచి నిధులు ఇవ్వని కేంద్రం
నిధుల కోసం మెదక్, జహీరాబాద్ ఎంపీల ఎదురుచూపులు
రూ.15 కోట్లు బకాయిలు.. అభివృద్ధిపైన ప్రభావం
కేంద్రం తీరుపై ఎంపీల ఆవేదన
ఎంపీలాడ్స్ నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంతో అభివృద్ధి పైన ప్రభావం చూపుతున్నది. మెదక్, జహీరాబాద్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌కు రావాల్సిన ఎంపీలాడ్స్ నిధుల కోసం ఏండ్లుగా నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరు ఎంపీలకు సంబంధించి దాదాపు రూ.15 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉంది. దీంతో వారు అభివృద్ధి పనులు చేయడానికి ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వం రెండేండ్లుగా మొత్తంగా ఎంపీలకు ఎంపీలాడ్స్ నిధులు మంజూరు చేయలేదు. కేంద్రం తీరుతో తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడే పరిస్థితి నెలకొందని, ఇది సరికాదని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలకు మేము నిధులు ఇస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడి బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఎమ్మెల్యేలకు సీడీపీ నిధులు మంజూరు చేస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మొదట ఏడాదికి రూ.1.75 కోట్ల నిధులు ఇవ్వగా, ఆ తర్వాత రూ.3 కోట్లకు పెంచారు. తాజాగా ప్రతి ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల సీడీపీ నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయిస్తోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలకు ఆమేరకు ప్రతిపాదనలు పంపడం ప్రారంభమైంది. ఆ నిధులతో అభివృద్ధి పనుల చేపడతారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎంపీలకు ఇవ్వాల్సిన రూ.5 కోట్ల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం (ఎంపీలాడ్స్) నిధులు మాత్రం ఇవ్వడం లేదు. మెదక్, జహీరాబాద్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌కు రావాల్సిన ఎంపీలాడ్స్ నిధుల కోసం ఏండ్లుగా నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
రూ.15 కోట్ల నిధులు పెండింగ్…
మెదక్, జహీరాబాద్ ఎంపీలకు మొత్తం ఎంపీ లాడ్స్ బకాయిలు రూ. 15 కోట్ల వరకు రావాల్సి ఉంది. దీంతో పాటు కేంద్ర ప్రభు త్వం రెండేండ్లుగా మొత్తంగా ఎంపీలకు ఎంపీలాడ్స్ నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఎంపీలు తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
రెండు విడతలుగా…
కేంద్ర ప్రభుత్వం ఎంపీలాడ్స్ నిధులను రెండు విడతలుగా విడుదల చేస్తుంది. గత లోక్‌సభ (16వ లోక్‌సభ)కు సంబంధించి మెదక్ ఎంపీగా టీఆర్ఎస్ నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ టీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్ల ఎంపీలాడ్స్ నిధులు ఇద్దరు ఎంపీలకు రావాల్సి ఉంది. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి రూ.5 కోట్ల నిధులు రావాల్సి ఉండగా, మొదటి విడతగా అప్పటి కేంద్ర ప్రభుత్వం రూ.2.50 కోట్ల ఎంపీలాడ్స్ నిధులను విడుదల చేసింది. జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్‌కు సైతం మొదటి విడతగా రూ.2.50 కోట్లు నిధులు విడుదల చేసింది. కాగా, రెండో విడత రావాల్సిన మరో రూ.2.50 కోట్ల నిధులు ఇద్దరు ఎంపీలకు రాలేదు. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం 201 8-19వ ఆర్థిక సంవత్సరానికి ఇద్దరు ఎంపీలకు రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.10 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులు విడుదల రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆ తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరానికి మెదక్, జహీరాబాద్ ఎంపీలు ఇద్దరికి రూ. 5 కోట్ల చొప్పున రూ.10 కోట్ల ఎంపీలాడ్స్ నిధులు విడుదల కావాల్సి ఉండగా విడుదల కాలేదు. 17వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్, 2019లో జరిగాయి. 2019 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. జహీరాబాద్ ఎంపీగా రెండోమారు బీబీ పాటిల్ ఎన్నికయ్యారు. ఇద్దరు ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర ప్రభు త్వం నుంచి ఎంపీలాడ్స్ విడుదల చేయలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెదక్, జహీరాబాద్ ఎంపీలు ఇద్దరికి రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.10 కోట్ల ఎంపీలాడ్స్ నిధులు రావాలి. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇద్దరు ఎంపీలకు రూ.10 కోట్ల ఎంపీలాడ్స్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇద్దరు ఎంపీలకు ఎంపీలాడ్స్ నిధులు మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు ఎంపీలాడ్స్ నిధులు సరిగ్గా ఇవ్వకపోవడంతో అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతున్నది.
ఎంపీలాడ్స్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పనులు
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం(ఎంపీలాడ్స్) నిధులతో ఎంపీలు తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు. మెదక్, జహీరాబాద్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ తమ ఎంపీలాడ్స్ నిధులతో తమ నియోజకవర్గ పరిధిలో ఇది వరకు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. చేపట్టిన పనులకు వెంటవెంటనే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించారు. ఎంపీలాడ్స్ నిధులను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాల కల్పనకు ఖర్చు చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాలకు రహదారులు, సీసీరోడ్లు, అకాల వర్షాలతో కొట్టుకుపోయిన రహదారులకు మరమ్మతు, మురికికాల్వల నిర్మాణం, మరమ్మతు పనులు చేపట్టవచ్చు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, టాయిలెట్ల నిర్మాణం చేపట్టవచ్చు. పీహెచ్‌సీతో పాటు ఇతర భవనాల నిర్మాణానికి ఎంపీలాడ్స్ నిధులు ఖర్చుచేయవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే ఎంపీలాడ్స్ నిధులు మంజూరు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.
నిధులు రావాల్సి ఉంది…
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఎంపీలాడ్స్ నిధులు ఇంకా విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం ఎంపీలకు ఎంపీలాడ్స్ కింద రూ.5 కోట్ల నిధులు విడుదల చేస్తుంది. గత ఆర్థిక సంవత్సరం, ప్రసుత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంపీలాడ్స్ నిధులు విడుదల కావాల్సి ఉంది. నిధుల విడుదలపై ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే పార్లమెంట్ సభ్యుల నుంచి ప్రతిపాదనలను తీసుకుని పనులు చేపడతాం.
-మనోహర్, సీపీవో
కేంద్ర ప్రభుత్వ తీరు సరికాదు..
కేంద్ర ప్రభుత్వ తీరు సక్రమంగా లేదు. పార్లమెంట్ సభ్యులకు ఏటా మంజూరు చేయాల్సిన ఎం పీలాడ్స్ నిధులను సరిగ్గా ఇవ్వడం లేదు. గత లోక్‌సభలో 2017-18 నుంచి 2019-20 వరకు రావాల్సిన ఎంపీలాడ్స్ నిధులు ఇవ్వలేదు. కొత్తగా ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద ప్రభుత్వం ఎంపీలాడ్స్ నిధులు విడుదల చేయలేదు. ఏటా రూ.5 కోట్ల నిధులు ఎంపీలకు విధిగా ఇవ్వాలి. ఈ నిధులతో తమ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలను ఎంపీలు చేడతారు. నిధులు రాకపోవడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతున్నది.