
చట్టం కింద కేసు నమోదు
కోహీర్, ఆగస్టు 13: మైనర్ బాలికకు వివాహం చేసిన కేసులో ఐదుగురిని రిమాండ్కు తరలించామని డీఎస్పీ శంకర్రాజు వెల్లడించారు. శుక్రవారం కోహీర్ పోలీస్స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. డీఎస్పీ శంకర్రాజు కథనం ప్రకారం.. ఝరాసంగం మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన సమ్మయ్య 10నెలల కిందట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక(15)ను వివాహం చేసుకున్నాడు. సమ్మయ్యతోపాటు వివాహానికి సహకరించిన తమ్ముడు నర్సింహులు, స్నేహితుడు సంగమేశ్వర్గౌడ్, బాలిక తల్లి, పెద్దమ్మపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 15 ఏండ్ల కిందట సమ్మయ్య ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలుగకపోవడంతో వారి మధ్య గొడవలు జరగగా.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మరో పెండ్లి చేసుకోవాలని తన బంధువు చెప్పడంతో బాలికకు మాయమాటలు చెప్పి 10నెలల కిందట వివాహం చేసుకున్నాడు. శారీరకంగా చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శంకర్రాజు వెల్లడించారు. సమావేశంలో ఎస్సై చల్లా రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.