
కల్హేర్, ఆగస్టు 10 : సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కడ్పల్ గ్రామ శివారులో పొలంలో కట్టేసి ఉన్న లేగదూడపై చిరుత దాడి చేసి చంపి తిన్నది. డివిజన్ అటవీ శాఖ రేంజ్ అధికారి దేవీలాల్ వివరాల ప్రకారం.. కడ్పల్ గ్రామానికి చెందిన గురుప్రసాద్ పోతురెడ్డికుంట వద్ద తన పొలంలో సోమవారం సాయంత్రం బర్రె, లేగదూడ, ఆవును కట్టేసి వచ్చాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా, లేగదూడపై చిరుత దాడి చేసి తిన్న ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే అతడు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీశాఖ అధికారులు, పశు వైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేశారు. రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని అటవీ అధికారులు చెప్పారు. అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరించడం వాస్తవమేనని, అటవీ ప్రాంతంలోని పంట పొలాల వద్ద పశువులను ఉంచొద్దని రైతులకు దేవీలాల్ సూచించారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు భయాందోళనకు గురికావొద్దన్నారు. కొన్ని రోజుల క్రితం ఖానాపూర్(కే) గ్రామ శివారులోని చింతల్గడి ప్రాం తంలో చిరుత కనిపించిందని గొర్రెకాపరులు సమాచారం ఇచ్చారని, అప్పుడు ఘటనా స్థలానికి వెళ్లి, పరిశీలించి, చిరుత ఉన్నట్లు గుర్తించామన్నారు. అధికారుల వెంట సిర్గాపూర్ జడ్పీటీసీ రాఘవరెడ్డి, రైతులు ఉన్నారు.
రామాయంపేట, ఆగస్టు 10 : మండలంలోని దంతెపల్లి అటవీ ప్రాంతంలో మళ్లీ చిరుత సంచారం చేస్తున్నది. దంతెపల్లి పంచాయతీ పరిధి సుభాష్ గిరిజన తండాకు చెందిన అలావత్ ప్రకాశ్‌కు చెందిన రెండు మేకలు పదిరోజుల క్రితం కనిపించకుండాపోయాయి. మేకల కోసం రైతు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభిందచలేదు. మంగళవారం అతడు మేకలను మేత కోసం అటవీ పాంతానికి తీసుకెళ్లగా, రెండు మేకల కళేబరాలు కనిపించాయి. మేకలను చిరుత దాడి చంపిందని తెలిపాడు. సంబంధిత అధికారులు చిరుతను పట్టుకోవాలని కోరారు. రూ.15వేల నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు.