
సంగారెడ్డి జిల్లాలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పదిరోజుల వ్యవధిలో ఐదు మర్డర్లు జరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఆస్తి కోసం ఒకచోట.. డబ్బులు తిరిగి ఇవ్వనందుకు మరోచోట.. ఇతరత్రా కారణాలతో ఇంకోచోట హత్యలు జరిగాయి. సంగారెడ్డి జిల్లాకేంద్ర పరిధిలోనే మూడు హత్యలు జరగగా, ఈ పరిణామాలు హడలెత్తిస్తున్నాయి. సమస్యలేమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, మరీ హత్య చేసే దాకా వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
కంది, ఆగస్టు 10 : సంగారెడ్డి జిల్లాలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పది రోజుల వ్యవధిలోనే నాలుగు సంఘటనల్లో ఐదు హత్యలు జరిగాయి. ఆస్తి కోసం, డబ్బులు తిరిగి ఇవ్వనందుకు, ఇతరత్రా కారణాలు మర్డర్లకు దారి తీస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలోనే మూడు హత్యలు జరిగాయి. గత నెల 30న సంగారెడ్డి పట్టణం రాజంపేటకు చెందిన నాగమణి కూతురు పెండ్లికి అడ్డుగా ఉన్నాడని సొంత మనుమడైన ఏడాదిన్నర వయస్సున్న యశ్వంత్‌ను చెరువులో పడేసి చంపేసింది. గత నెల 31న ఫసల్వాది గ్రామ శివారులో మాజిద్ అనే వ్యాపారిని డబ్బుల విషయంలో ముగ్గురు నిందితులు అతి కిరాతకంగా కొడవలి, కత్తులతో హతమార్చారు. వీరిని నాలుగు రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఆగస్టు 6న సంగారెడ్డి పట్టణానికి చెందిన జోత్స్న అనే మహిళ పిల్లలు అనారోగ్య సమస్యలు బాగుపడవనే మనోవేదనతో ఇద్దరు పిల్లలైన దేవాన్ష్, రుద్రాన్ష్‌ను చున్నీతో ఉరివేసి చంపి, ఆ తర్వాత ఆమె చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అదే రోజు సదాశివపేట పట్టణంలో పాపయ్య(68) అనే వృద్ధుడిని అతడి పాతకక్షలతో బీరప్ప అనే నిందితుడు హత్య చేశాడు. తాజాగా ఈ నెల 9న సాయంత్రం ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. అతని హత్యకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సొంత అల్లుడే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తుండగా, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
సంగారెడ్డి పట్టణం కింది బజార్‌కు చెందిన బ్యాగరి ఆగమయ్య(65) స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతడికి భార్య బ్యాగరి సువర్ణ, ఇద్దరు కూతుళ్లు లక్ష్మి, ప్రవళిక ఉన్నారు. పెద్ద కూతురు లక్ష్మిని కోహీర్ మండలానికి చెందిన యాదగిరితో గతంలో పెండ్లి చేయగా, యాదిగిరి ఇల్లరికం వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. యాదగిరికి ఇద్దరు కూతుళ్లు. ప్రస్తుతం పెద్ద అమ్మాయి డిగ్రీ చదువుతుండగా, చిన్న అమ్మాయి పదో తరగతిలో ఉంది. 15 నెలల క్రితం యాదగిరి భార్య లక్ష్మి అనారోగ్యంతో చనిపోయింది. యాదగిరి తన ఇద్దరు కూతుళ్లు, అత్త, మామలతో కలిసి సంగారెడ్డిలో ఉంటూ ఓ రైస్‌మిల్‌లో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆగమయ్యకు సంగారెడ్డి పట్టణ శివారులో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ భూమికి మంచి రేటు పలుకుతుండగా, ఆ భూమి అమ్మాలని యాదగిరి పలుమార్లు ఆగమయ్యపై ఒత్తిడి చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగినట్లు సమాచారం. సోమవారం ఆగమయ్యను అతని పత్తి చేనులో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మంగళవారం సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. తన భర్త హత్యకు అల్లుడు యాదగిరే కారణమని మృతుడి భార్య సువర్ణ ఆరోపిస్తున్నది. ప్రస్తుతం యాదగిరి పరారీలో ఉన్నాడు. పోలీసులు కూడా ఆ కోణంలోనే కేసును నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ వెల్లడించారు.
మొన్నటి వరకు కరోనాతో అల్లాడిన జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే కరోనా దెబ్బకి చాలా మంది బతుకులు ఆర్థికంగా కుదేలైపోయాయి. ఇదిలా ఉంటే కరోనా తెచ్చిన తంటాలను నుంచి ప్రజలు బయటపడుతున్నారనుకుంటున్న తరుణంలో సంగారెడ్డి జిల్లాలో వరుస హత్యలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక్కడ మర్డర్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతున్నది. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒకరు, దొంగతనాలను చేయొద్దని మందలించాడని మరొకరు ఏకంగా హత్యలే చేశారు. పిల్లల ఆరోగ్య సమస్యలతో తల్లడిల్లిన తల్లి సొంత కొడుకులనే కడతేర్చిన సంఘటన మరొకటి. ఆస్తి పంపకాలు జరపాలని మరొకరు.. ఇలా హత్యలకు పాల్పడుతున్నారు. కూతురు పెండ్లికి అడ్డుగా ఉన్నాడని ఏడాదిన్నర పసిబిడ్డను సొంత అమ్మమ్మే చెరువులో పడేసి చంపేసింది. ఈ వరుస సంఘటనలతో ఇక్కడి ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. అయితే ఏమైనా సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ, మరీ హత్య చేసే దాకా తీసుకురావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.