
పటాన్చెరు, ఆగస్టు 9: ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులతో అన్నారు. సోమవారం పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ 22 సమీక్షా సమావేశం జీఎమ్మార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్ల అధికారులు సమస్యలను జోనల్ కమిషనర్ రవికిరణ్ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ మూడు డివిజన్లలో అధికారులు నిద్రమత్తు వీడాలని సూచించారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణం గా పారిశుధ్య సమస్య తీవ్రమవుతున్నదన్నారు. అభివృద్ధి పనులు మందకొడిగా కొనసాగుతున్నాయన్నారు. విద్యుత్ సమస్యలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు డివిజన్ల పరిధిలో విద్యుత్ స్తంభాల నిర్వహణ సరిగ్గాలేదని చెప్పారు. కొన్ని శాఖల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది విధులకు రావడం లేదని మండిపడ్డారు. వీరి కారణంగా స్థానిక ప్రజాప్రతినిధులకు చెడ్డపేరు వస్తున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నదన్నారు. అంతర్జాతీయ సంస్థలు పటాన్చెరులో ఉన్నప్పుడు ఆ స్థాయి మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందన్నారు. అధికారులు సమగ్ర వివరాలతో రావాలని కోరారు. మిషన్ భగీరథ నీరు బండ్లగూడలో రావడంలేదని పటాన్చెరు కార్పొరేటర్ అన్నారు. డివిజన్లో సిబ్బందిని పెంచాలని కోరారు. గంజాయి మహమ్మారి బారిన పడి యువత నేరాలకు పాల్పడుతున్నారని, పోలీసు, ఎక్సైజ్ శాఖలు కఠినంగా వ్యవహరించాలని కోరారు. స్పందించిన జోనల్ కమిషనర్ ఎమ్మెల్యే, కార్పొరేటర్లు సూచించిన పనులు తక్షణమే చేపడుతామన్నారు. జవాబుదారీతనం పెంచుతామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి, పుష్పానగేశ్, మెట్టుకుమార్‌యాదవ్, ఉప కమిషనర్ బాలయ్య, సీఐ వేణుగోపాల్‌రెడ్డి, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ, హెచ్ఎండబ్ల్యుఎస్ అధికారులు పాల్గొన్నారు.
జిన్నారం, ఆగస్టు 9: అన్నదాతకు అండగా సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. జిన్నారం గ్రామానికి చెందిన రైతు డప్పు నర్సింహులు మృతిచెందడంతో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పటాన్చెరులో రూ. 5 లక్షల విలువైన రైతు బీమా చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు కొండంత ధీమాగా రైతు బీమా ఉందన్నారు. దేశంలోనే ప్రథమంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులను ఆదుకోవడానికి రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. రైతులకు ఉచిత కరెంట్‌ను కూడా అందజేస్తున్నారని గుర్తు చేశారు. గుంట భూమి ఉన్న రైతుకు రైతు బీమా, రైతుబంధు వర్తిస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా భూములు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, ఉప సర్పంచ్ సంజీవ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాయికోటి రాజేశ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, నిఖిల్, జీవన్ పాల్గొన్నారు.