
జహీరాబాద్, ఆగస్టు 8 : జహీరాబాద్లో గుట్టచప్పుడు కాకుండా గంజాయి అమ్మకాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. గంజాయి స్మగ్లర్లు ఆంధ్రలోని మన్యం ప్రాంతం, ఒడిశానుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి కర్ణాటక, మహారాష్ర్టలకు తరలించడంతో పాటు ప్యాకెట్లు చేసి జహీరాబాద్ పట్టణంలో అమ్మకాలు చేస్తున్న ట్లు పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. గిరిజన తండాలు, మంజీరా నది సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారని సమాచారం. జహీరాబాద్ డివిజన్లో ఉన్న మారుమూల గిరిజన తండాలు, గ్రామాల్లో యధేచ్ఛగా గంజాయి సాగవుతున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ హమాలీ కాలనీలో గంజాయిని ప్యాకెట్లు చేసి యువతకు అమ్మకాలు చేస్తున్న ముఠాను శనివారం రాత్రి పట్టణ ఎస్సై శ్రీకాంత్ అరెస్టు చేయడంతో చర్చనీయాంశంగా మారుతోంది. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు ఆంధ్రలోని మన్యం, ఒడిశా ప్రాంతానికి కారులో వెళ్లి గంజాయి రాత్రి సమయంలో తీసుకొచ్చి రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతంలో నిల్వ చేసి అవసరం మేరకు అమ్మకాలు చేస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి.
జహీరాబాద్ పట్టణంలో గంజాయి స్మగ్లర్లు మత్తుకు అలవాటు పడిన కొందరు యువకులను టార్గెట్ చేస్తూ దందాను కొనసాగిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో మాత్రమే దొరికే గంజాయి నిల్వలు పెద్ద పెద్ద పట్టణాలకు తరలిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి యువతకు విక్రయిస్తున్నారు.
గంజాయి స్మగ్లర్లు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న నిరుపేదలైన అమాయకులకు ఆశ చూపుతూ గంజాయి దందా ఉచ్చులోకి దింపుతున్నారు. ఒక వేళ పోలీసులకు దొరికినా తమ పేరు బయటకు రాకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. కొందరు యువకులకు ద్విచక్ర వాహనాలను అం దించి గంజాయి సరఫరా చేస్తున్నారని తెలిసింది. చిన్న చిన్న బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లు పెట్టి తరలించి అమ్మకాలు చేస్తున్నారని పోలీసుల విచారణలో బయటకు వచ్చింది. ఎండు గంజాయిని పొడిగా మార్చి చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో నింపుతూ ఎవరికి ఎంత కావాలంటే అంతా అందజేస్తున్నారని సమాచారం. జాతీయ రహదారి పై దాబాలు, కిరాణా షాపుల వద్ద ఆపుకొని వాహనదారులు విశ్రాంతి తీసుకుంటారు. అలసటను తీర్చుకునేందుకు గంజాయి మత్తులోకి దింపుతున్నారని తెలిసింది. మత్తులోనే దూర ప్రాంతాలకు వాహనాలను నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. పోలీసు శాఖ అధికారులు వీటిపై నిఘా సారిస్తే కొంత మేరకైన గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలకు అడ్డుకట్ట పడే ఆవకాశం ఉంది. గంజాయి స్మగ్లర్లు సిగరెట్లలో గంజాయిని నింపి అమ్మకాలు చేస్తున్నారు.
హమాలీ కాలనికి చెందిన హమీద్ అహ్మద్(25), ఎండీ. రసూల్(24)లను గంజాయి ప్యాకెట్లు అమ్ముతుంగా పట్టణ ఎస్సై శ్రీకాంత్ అరెస్టు చేశారు. గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకోని వివరాలను పట్టణ సీఐ రాజశేఖర్ వివరించారు. వీరి వెంట ఎవరున్నారో సమాచారం సేకరిస్తున్నారు. గం జాయి సరఫరా చేస్తున్న ముఠా కోసం గాలిస్తున్నారు.
జహీరాబాద్ పట్టణంతో పాటు జాతీ య రహదారి పై ఉన్న దాబాల వద్ద గంజాయి నివారణ కోసం నిఘా ఏర్పాటు చేశాం. గంజాయిని అమ్మకాలు చేసినా, అక్రమంగా తరలిస్తున్నా చట్టరీత్యా చర్యలు తీసుకుం టాం. గంజాయి అమ్మినా, సాగు చేసినా జహీరాబాద్ పట్టణ ఎస్సై 9490617038 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉం చుతాం. గంజాయి స్మగ్లర్లు యువతకు అమ్మకాలు చేస్తున్నారనే సమాచారం ఉంది. వారిపై నిఘా ఏర్పాటు చేశాం.
-శ్రీకాంత్, ఎస్సై. జహీరాబాద్