
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తున్నది. ఏటా ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై నీటి వనరుల్లో చేప పిల్లలను వదులుతుండడంతో మన పల్లెలు, పట్టణాల్లో పుష్కలంగా చేపలు అందుబాటులో ఉంటున్నాయి. చేపల పెంపకంతో ఎన్నో కుటుంబాలకు ఉపాధి లభించి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. ఈసారి విస్తారంగా వర్షాలు కురవడంతో చెరువులు, చెక్‌డ్యామ్‌లు, జలాశయాలు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి జలాల్లో చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేడు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, కోమటి చెరువుల్లో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగతా చోట్ల ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపపిల్లలతో పాటు వాటికి కావాల్సిన దాణా, వలలు, చేపల నిల్వల బాక్సులు ప్రభుత్వమే వందశాతం సబ్సిడీపై అందిస్తున్నది.
సంగారెడ్డి, సెప్టెంబర్ 7: ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. నీటి లభ్యత ఉన్న కుంటలు, చెరువులు, శాశ్వత నీటివనరులు, ప్రాజెక్టుల్లో ఉచితంగా చేపపిల్లలను వదిలి ఉపాధి కల్పిస్తున్నది. ఏటా కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తూ మత్స్యకారులకు ఉపాధి చూపుతున్నది. ఈ ఏడాది నీటి వనరుల్లో చేప పిల్లలను వదలటానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టులో చేపపిల్లలను స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వదులుతారు. 33శాతం నీటి నిల్వ విస్తీర్ణం కలిగిన చెరువులు, కుంటలను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేపపిల్లలను పెంచి విక్రయించటానికి మత్స్యకారులకు అవకాశం కల్పించింది. సంగారెడ్డి జిల్లాలో 189 మత్స్య సహకార సొసైటీల్లో 9,830 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ ఏడాది జిల్లాలో 3.53 కోట్ల చేపపిల్లలు వదిలేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3.70 కోట్లను ఖర్చు చేయనున్నది. చేపపిల్లలు, దాణా, వలలు, చేపల నిల్వకు బాక్సులు ప్రభుత్వమే వందశాతం సబ్సిడీపై అందిస్తున్నది. దీంతో చేపల వేట సాగిస్తున్న వారికి ఉపాధి లభిస్తున్నది.
అక్రమాలకు చెక్…
కొందరు బడా వ్యాపారులు కాంట్రాక్టర్ల పేరుతో మత్స్యకారులను మోసం చేసేవారు. వారి అక్రమాలకు ప్రభుత్వం చెక్‌పెట్టింది. చేపపిల్లల సంరక్షణ నుంచి పెద్దగైన తర్వాత అమ్ముకునే వరకు మత్స్యకారులకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. దీంతో కాంట్రాక్టర్ల బాధ నుంచి విముక్తి లభించింది. గత పాలకుల హయాంలో గ్రామాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు చెరువులను లీజు పేరుతో తీసుకుని సొమ్ము చేసుకునేవారు. తెలంగాణ ఏర్పడ తర్వాత చేపపిల్లల పెంపకం, చేపలు అమ్మడం లాంటి అన్ని పనులు స్థానిక మత్స్యకారులకు అప్పగించింది. చేపపిల్లలు సకాలంలో సరఫరా చేయని కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా కాంట్రాక్టర్లు బ్రీడర్ విత్తనాలను ఒకటి,రెండు చెరువుల్లో పెంచి వాటి పెరుగుదలను గమనించాల్సి ఉంటుంది. అనంతరం వాటి సహాయంతో విత్తును ఉత్పత్తి చేయించి పంపిణీ చేయాలి. నాణ్యతలేని చేపపిల్లలను చెరువుల్లో వదిలి చేతుల దులుపుకోకుండా మేలు రకం చేపపిల్లలను వదిలితే ఉపాధితో పాటు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని మత్స్యకారులు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 3.53 కోట్ల చేపపిల్లలు
సంగారెడ్డి జిల్లాలోని 2 ప్రాజెక్టులు సింగూరు, నల్లవాగుతో పాటు 54 శాశ్వత నీటి వనరులు, 1520 చెరువులు, కుంటల్లో ఈసారి 3.53 కోట్ల చేప పిల్లలను వదిలి మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులు, శాశ్వత నీటి వనరుల్లో పెద్ద సైజు చేపపిల్లలు 1.34 కోట్లు, చెరువులు, కుంటల్లో చిన్న సైజు 2.19 కోట్ల పిల్లలను వదిలేందుకు సిద్ధం చేశారు. పెద్ద సైజులో 80నుంచి100 ఎం.ఎంలో చిన్నవి 35నుంచి 40 ఎం.ఎం సైజులో ఉంటాయి. ప్రాజెక్టుల్లో కట్ల 40శాతం, రవటా 50శాతం, మరిగే 10శాతం పిల్లలను వదులుతారు. చెరువులు, కుంటల్లో బొచ్చే 35శాతం, రవటా 35శాతం, బంగారుతీగ 30శాతం పిల్లలను వదిలేందుకు అధికారులు అందుబాటులో ఉంచారు.
వందశాతం రాయితీతో చేపపిల్లలు
ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో ఉచితంగా చేపపిల్లలు వదులుతున్నది. మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నది. నాణ్యమైన చేపపిల్లలను గుర్తించి శాస్త్రీయ పద్ధ్దతుల్లో చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేశాం. భారీ వర్షాలకు సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులతో పాటు చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. లక్ష్యం మేరకు చేప పిల్లలను నీటి వనరుల్లో వదలటానికి ప్రణాళిక సిద్ధం చేశాం.
సిద్దిపేట, సెప్టెంబర్ 7 : సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, కోమటి చెరువుల్లో ఉచిత చేప పిల్లలను బుధవారం మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వదలను న్నారు.
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను నీటి వనరుల్లో వదులుతుండటంతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నది. చేపలు అమ్ముకోవటానికి బైక్‌లు, ఆటోలు, వలలు, తెప్పలను సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 2020-21 సంవత్సరానికి 5 జలాశయాలు, 1,352 చెరువులు, కుంటల్లో 3.72 కోట్ల చేప పిల్లలను ప్రభు త్వం ఉచితంగా వదిలింది. 3 రిజర్వాయర్లలో 11.71 లక్షల రొయ్య పిల్లలను వదిలారు. జిల్లా లో 2020-21లో 17,628 టన్నుల చేపలు, 116టన్నుల రొయ్యల దిగుబడి వచ్చింది. విస్తార వర్షాలకు నీటి వనరులు పుష్కలంగా ఉం డటంతో చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2021-22 సంవత్సరానికి 236 డిపార్టుమెంట్ చెరువులు, 1236 కుంట ల్లో 4.19 కోట్ల చేప పిల్లలను, మూడు రిజర్వాయర్లలో 12.94లక్షల రొయ్య పిల్లలను వదిలేందుకుఅధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
మెదక్ జిల్లాలో 5.33 కోట్ల చేప పిల్లలు
మెదక్, సెప్టెంబర్ 7 : మెదక్ జిల్లాలో 5.33 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో వదిలేందుకు అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. తద్వారా 15,700 కుటుంబాలకు ఉపాధి లభించనున్నది. తెలంగాణలో మొదటిసారిగా రొయ్యల పెంపకంపై దృష్టిసారించి 2016 అక్టోబర్‌లో మెదక్ జిల్లా పోచారం ప్రాజెక్టులో 6.20 లక్షల రొయ్య పిల్లలను వదిలారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,962 ద్విచక్రవాహనాలు, 155 లగేజీ ఆటోలు, 24 సంచార చేపల అమ్మకం వాహనాలు, 672 యూనిట్ల చేపల కిట్లతో పాటు ఇతర సామగ్రిని సబ్సిడీపై ప్రభుత్వం మత్స్యకారులకు అందజేసింది. జిల్లాలో 270 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 15,700 మంది సభ్యులు ఉన్నారు. 2021-22 సంవత్సరంలో 1,636 చెరువుల్లో 5.33 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.