
సంగారెడ్డి, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. జిల్లాలో భారీ వర్షాలకు తోడు ఎగువన కర్ణాటక నుంచి మంజీరా నదిలోకి భారీగా వరద వస్తుండడంతో నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. జిల్లాలో ఏకైక సాగునీటి ప్రాజెక్టు సింగూరు నిండుకుండలా మారడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.197 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు పూరిస్థాయిలో నిండింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తివేసి దిగువకు వరదను వదిలారు. సోమవారం ఒకగేటు తెరవగా.. మంగళవారం సింగూరు ప్రాజెక్టులోని మూడు గేట్లు ఎత్తారు. నాలుగు గేట్ల ద్వారా 45,476 క్యూసెక్కుల వరదను దిగువకు వదిలారు. సంగారెడ్డి మండలం కల్పగూరులోని మంజీరా రిజర్వాయర్ నిండింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1.50 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీనికి తోడు ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు నుంచి వరద వస్తుండడంతో మంజీరా రిజర్వాయర్ మూడు గేట్లు ఎత్తివేసి వరదను దిగువకు వదులుతున్నారు. మంజీరా రిజర్వాయర్ నుంచి 40వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. గతేడాది సైతం జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు, మంజీరా రిజర్వాయర్ పూర్తిగా నిండాయి. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండిన నేపథ్యంలో ఆయకట్టుకు రెండు కాల్వల ద్వారా నీరు ఇవ్వనున్నారు. దీనికితోడు పుల్కల్, చౌటకూరు మండలాల్లోని చెరువులను నింపేందుకు నీటిపారుదలశాఖ అధికారులు సిద్ధవుతున్నారు. మంజీరా రిజర్వాయర్ పూర్తిగా నిండడంతో సంగారెడ్డి పరిసర ప్రాంతాలకు రాబోయే ఏడాదిపాటు తాగునీటి కొరత ఉండదని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్‌లోని నారింజ ప్రాజెక్టు నిండింది. కల్హేర్ మండలంలోని నల్లవాగు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు కుంటలు అలుగుపారుతున్నాయి. మంగళవారం జిల్లాలో 2.9 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం సరాసరి 78.2 సెం.మీటర్ల వర్షం కురిసింది. కంగ్టి మండలంలో అత్యధికంగా 5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 3140 చెరువులు ఉండగా, వీటిలో 531 వందశాతం నీటితో నిండాయి. 68 చెరువులు పూర్తి నిండి అలుగు పారుతున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలోని 12 చెరువులు, జహీరాబాద్‌లో 17, నారాయణఖేడ్‌లో 18, దౌల్తాబాద్‌లో 21 చెరువులు అలుగు పారుతున్నాయి. జిల్లాలోని 1103 చెరువులు 75 శాతం నీటితో నిండగా, 1161 చెరువుల్లోకి 50 శాతం నీళ్లు వచ్చాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంజీరా పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు, పశువుల కాపర్లు సైతం మంజీరా నది పరిసర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పంటలు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని రైతులకు వ్యవసాయశాఖ సైతం సూచనలు చేసింది.