రాష్ట్ర ప్రభుత్వ కృషితో పరిశ్రమల ఏర్పాటుతో మెదక్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం అతిపెద్ద పారిశ్రామిక వాడలతో ఉపాధి కేంద్రంగా మారుతున్నది. ఈ మండలంలోని కొండాపూర్‌లో మరో అతిపెద్ద పారిశ్రామికవాడ ఏర్పాటు కాబోతున్నది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నది.ఇప్పటికే భూసేకరణ పూర్తిచేసి రైతులకు పరిహారం చెల్లించారు. ఇప్పటికే కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, కూచారం గ్రామాల్లో పారిశ్రామిక వాడలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. స్థానికులతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారు, ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఉపాధి పొందుతున్నారు. కొండాపూర్‌లో 191 ఎకరాల్లో ఏర్పాటు చేసే మరో పారిశ్రామికవాడతో కొత్తగా వేలాది మందికి ఉపాధి లభించనున్నది.
మనోహరాబాద్, అక్టోబర్ 4 : మెతుకు సీమ మెదక్ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం అతిపెద్ద పారిశ్రామిక వాడలతో ఉపాధి కేంద్రంగా మారుతున్నది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కృషితో మండలంలో మరో అతిపెద్ద పారిశ్రామికవాడ ఏర్పాటు కాబోతున్నది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఐఐసీ ) ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలం కొండాపూర్‌లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. కొండాపూర్ సమీపంలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయనుండడంపై సమీప గ్రామాల ప్రజ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటు భవిష్యత్ తరాలకు ఉపాధి లభిస్తుందని వారు సంతోషం వ్యక్త చేస్తున్నారు. టీఎస్ఐఐసీ, రెవెన్యూ అధికారులు ఆ దిశగా పనులు వేగిరం చేశారు. రైతుల నుంచి భూములు సేకరించి నష్ట పరిహారం సైతం చెల్లించారు.
కొండాపూర్‌లో 191 ఎకరాల్లో..
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొండాపూర్‌లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 210 ఎకరాలు భూమి అవసరమని టీఎస్ఐఐసీ ప్రతిపాదించింది. దీంతో రెవెన్యూ అధికారులు కొండాపూర్ రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి భూసేకరణ చేపట్టారు. కొండాపూర్ గ్రామ శివారులోని 129, 132 సర్వే నెంబర్లో గల 191 ఎకరాల 16 గుంటల భూమిని రైతుల నుంచి సేకరించారు. ఇది వరకే 91 మంది రైతులకు ఎకరానికి రూ. 10.50 లక్షల చొప్పున పూర్తి పరిహారం చెల్లించారు. కాగా, నూతనంగా నిర్మించే పారిశ్రామికవాడలోకి వెళ్లేందేందుకు కొండాపూర్ గ్రామం నుంచి 1.4 కిలోమీటర్ల మేర 100 ఫీట్ల రోడ్డును నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
మరో అతిపెద్ద పారిశ్రామిక వాడ..
మనోహరాబాద్ మండలం కొండాపూర్‌లో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక వాడ మరో అతిపెద్దగా నిలువనుంది. ఇప్పటికే కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, కూచారం గ్రామా ల్లో పారిశ్రామిక వాడలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ముప్పిరెడ్డిపల్లి, కాళ్లకల్ గ్రామాల్లోని సర్వే నెంబర్ 342, 354లలో 750 ఎకరాల్లో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఇండ్రస్ట్ట్రియల్ పార్కును ఏర్పాటు చేశారు. కూచారంలోని 148వ సర్వే నెంబర్లో 82 ఎకరాల 20 గుంటల్లో మరో పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా పారిశ్రామిక వాడ్లలో వివిధ రకాల ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలను నడిపిస్తున్నారు. దీంతో స్థానికులు, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఉపాధి పొందుతున్నారు. కొండాపూర్‌లో 191 ఎకరాల్లో నిర్మించే మరో పారిశ్రామిక వాడతో కొత్తగా వేలాది మందికి ఉపాధి లభించనుంది.
మనోహరాబాద్ మండలం కొండాపూర్‌లో 210 ఎకరాల భూమి అవసరం ఉందని టీఎస్ఐఐసీ తెలిపింది. దీంతో గ్రామస్తులతో చర్చించి 191 ఎకరాల 16 గుంటల స్థలాన్ని సేకరించాం. 91 మంది లబ్ధిదారులకు పూర్తి నష్ట పరిహారం చెల్లిం చాం. సేకరించిన భూమిని టీఎస్ఐఐసీకి అప్పగించాం.
-శ్యాంప్రకాశ్, తూప్రాన్ ఆర్డీవో