
ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు శాతం
జూనియర్ కళాశాలల్లోనూ అదే క్రమం
నాల్గో రోజూ సంగారెడ్డి జిల్లాలో 42శాతం.. సిద్దిపేటలో 40శాతం.. మెదక్లో 34.64శాతం హాజరు
ప్రత్యక్ష తరగతులకు పెరుగుతున్న ఆదరణ
కళకళలాడుతున్న విద్యాసంస్థలు
కొవిడ్ నిబంధనలు అమలు
సంగారెడ్డి/సిద్దిపేట అర్బన్/మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 4 : ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకూ విద్యార్థుల హాజరు శాతం పెరుగుతున్నది. ప్రత్యక్ష బోధనకు ఆదరణ లభిస్తున్నది. పాఠశాలల్లో మరింత హాజరు పెంచేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తున్నది. రోజు వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. నాల్గో రోజూ సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 42 శాతం విద్యార్థులు హాజరు కాగా, ప్రైవేట్ పాఠశాలల్లో 15శాతం నమోదైనట్లు విద్యాశాఖ తెలిపింది. సంగారెడ్డిలో మొత్తం 1715 పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలు 1394, ప్రైవేట్ పాఠశాలలు 438 కొనసాగుతున్నాయి. పాఠశాలల్లో హాజరు పెంచేందుకు రోజు వారీగా ప్రణాళికల ప్రకారం విద్యాశాఖ అధికారులు సందర్శిస్తూ హాజరు శాతంపై పర్యవేక్షిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి విద్యార్థుల హాజరు విధానాన్ని పరిశీలిస్తే ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం ఎక్కువగా నమోదవుతున్నది. ప్రత్యక్ష తరగతులకు హాజరు శాతం పెరుగుతుండడంతో విద్యాసంస్థలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.
మెదక్ జిల్లాలో ఇలా..
మెదక్ జిల్లాలో తొలిరోజు 23.6 శాతం విద్యార్థులు తరగతులకు హాజరు కాగా, రెండో రోజూ గురువారం 27.5 శాతం, మూడో రోజు 31.6 శాతం, నాల్గో రోజు శనివారం 34.64శాతం హాజరు నమోదైంది. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు 1014 ఉండగా, మొత్తం 96,071 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు 108 ఉండగా ఇం దులో 71 పాఠశాలలు మాత్రమే తెరుచుకున్నాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ..
మెదక్ జిల్లాలో16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 22 ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 5,490మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 3,258 మంది విద్యార్థులు చదువుతున్నారు. తొలిరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 24శాతం, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 32 శాతం విద్యార్థులు హాజరయ్యారు. రెండో రోజూ ప్రభు త్వ జూనియర్ కళాశాలల్లో 24శా తం, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 32శాతం, మూడో రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 29 శాతం, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 36 శాతం హాజరయ్యారు. నాల్గో రోజూ శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 31శాతం, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 37 శాతం విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు హాజరయ్యారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 4: కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర తర్వాత పాఠశాలలు నాలుగు రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. అయితే రోజురోజుకూ ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ విద్యార్థుల హాజరుశాతం పెరుగుతున్నది. మొదటి రోజు తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరైనా క్రమంగా విద్యార్థులు హాజరు శాతం పెరుగుతూ ఉంది.
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఉన్న 1192 పాఠశాలల్లో మొత్తం 1,43,481 మంది విద్యార్థులు చదువుతున్నా రు. అందులో మొదటిరోజు 49,360(34.4శాతం), రెండో రోజు 51,653(36 శాతం),మూడోరోజు 55,063 (38.3 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు.శనివారం 990 ప్రభుత్వ పాఠశాలల్లో 81,689 మంది విద్యార్థులకు గానూ 39,598 మంది విద్యార్థులు హాజరు కాగా, హాజరు శాతం 46గా నమోదైంది. 202 ప్రైవేటు పాఠశాలల్లోని 57,512 మంది విద్యార్థులకు గానూ 17,729 మంది విద్యార్థులు హాజరు కాగా, 31హాజరు శాతం నమోదైంది. మొత్తంగా నాల్గోరోజు 40శాతం విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ విద్యార్థుల హాజరుశాతం క్రమంగా పెరుగుతున్నది. మొదటిరోజు 25 హాజ రు శాతం ఉండగా, శనివారం నాటికి 35 శాతానికి చేరింది.