ఊరంతా సందడిగా మారుతుంది.. పంచాయతీ భవనం విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది.. ఊరంతా మిఠాయిలు పంచుకొని వేడుక జరుపుకుంటుంది.. ఆ రోజు ఊరంతా జాతరను తలపిస్తుంది.. అది ఎప్పుడో తెలుసా..! ఆ ఊరిలో ఆడపిల్ల పుట్టినప్పుడు..! ఆ ఊరు ఆడ కూతురిని అంతగా ఆదరిస్తున్నది మరి! తల్లిదండ్రులకు ధీమా ఇస్తూ.. ఆడబిడ్డకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నది. ఇది ఎక్కడో కాదండోయ్.. మన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్పూర్లో జరుగుతున్న కార్యక్రమమిది. ఆడబిడ్డల సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నది ఈ గ్రామం.
కొండాపూర్, సెప్టెంబర్ 4: ఆ ఊరిలో ఆడపిల్ల పుడితే సంబురం అంబరాన్నంటుతుంది.. పంచాయతీ కార్యాలయం విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది. తల్లిదండ్రులను శుభాకాంక్షలతో ముంచెత్తుతుంది. ఊరంతా మిఠాయిలు పంచుకొని వేడుక చేసుకుంటుంది. తల్లిదండ్రులకు ధీమాను ఇస్తుంది. ఆడబిడ్డకు ఆర్థిక భద్రత అందిస్తుంది. ఇది ఎక్కడే కాదండోయ్.. మన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్పూర్లో జరుగుతున్న కార్యక్రమమిది. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న గ్రామమిది. అన్ని గ్రామాలు ఇలాగే చేయాలని ఆకాంక్షిస్తున్నది.
ఇలా మొదలైంది..
హరిదాస్పూర్లో సత్యవతి-నాగేశ్ దంపతులకు 2020 జనవరి1న మూడో సంతానంగా ఆడబిడ్డ పుట్టింది. అంతకు ముందు ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో ఆ కుటుంబం విచారం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి రోహిత్ కులకర్ణి, సర్పంచ్ షఫీ వారి ఇంటికెళ్లారు. ఆడబిడ్డ భారం కాదని, ఆ దంపతులకు ఆత్మైస్థెర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పాప పుట్టిన సందర్భంగా గ్రామంలో మిఠాయిలు పంచారు. ఊర్లోని వారందరూ పంచాయతీ వద్దకు చేరుకొని, సంబురాలు చేసుకున్నారు. ఆ దంపతులను ఘనంగా సన్మానించారు. వారి బిడ్డ చదువు, పెండ్లి కోసం పొదుపు చేయాలని నచ్చజెప్పి, సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఆ చిన్నారి వివరాలు నమోదు చేశారు. నెలకు రూ.వెయ్యి చొప్పున ఐదు నెలలు జమ చేసి, ఆ కుటుంబానికి ప్రోత్సాహాన్ని అందజేశారు. ఆ మొత్తాన్ని సర్పంచ్, కార్యదర్శి భరించారు. అప్పటి నుంచి గ్రామంలో ఆడపిల్ల పుడితే సంబురాలు చేసుకోవాలని, వారి కుటుంబానికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆ గ్రామం తీర్మానించింది. అప్పటి నుంచి గ్రామంలో ఆడబిడ్డ పుడితే పంచాయతీకి విద్యుద్దీపాలు పెట్టి, మిఠాయిలు పంచడం, ఆ బిడ్డ పేరిట సుకన్య సమృద్ధి యోజనలో నమోదు చేయించడం.. ఐదు నెలల పాలు ప్రోత్సాహం అందించడం చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 74మందికి చేశారు. త్వరలో మరో ఇద్దరు అమ్మాయిలకు తొట్టెల కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.
చాలా సంతోషంగా ఉంది..
నాకు ఆడపిల్ల పుట్టిందని తెలియగానే గ్రామస్తులందరూ నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నేను కూతురిని కన్నందుకు నన్ను మరిపింపజేశారు. మా గ్రామంలో ఏడాదిలో ఇప్పటి వరకు 10మంది అమ్మాయిలే పుట్టారు. నాకు కూతురు పుట్టినందుకు సర్పంచ్ ఎండీ షఫీ, పంచాయతీ పాలకవర్గం, మహిళలు, గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద మమ్మల్ని ఘనంగా సన్మానించారు. నాకు ఆడబిడ్డ పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది.
పది మంది ఆడపిల్లలు పుట్టినందుకు పండుగ..
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్పూర్ గ్రామం ఆడబిడ్డలు పుట్టగానే సంబురాలు చేసుకుంటున్నది. ఏడాదిలో 10 మంది అమ్మాయిలే పుట్టడంతో గ్రామం ఆనందంలో మునిగింది. పంచాయతీకి విద్యుద్దీపాలు పెట్టి, పండుగలా జరుపుకున్నది. తమ గ్రామంలో ఆడపిల్ల పుట్టిందని డప్పు చాటింపు వేసి మరీ చెప్పింది. ఈ పల్లెలో మొత్తం 816 మంది నివసిస్తుండగా, లింగ నిష్పత్తిలో అంతరం ఎక్కువగా ఉంది. ఇదే కొనసాగితే మనుగడకే ముప్పు వస్తుందని గ్రహించిన గ్రామ పెద్దలు, ఆడపిల్లు పుడితే, కన్న వారిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఏడాదిలో పుట్టిన 10మంది ఆడపిల్లలను కలుపుకుని వారితో పాటుగా 64మంది ఆడపిలలకు మొత్తం 74మంది ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం కింద వారి పేర్లు నమోదు చేయించడంతో పాటు ఒక్కోక్కరికి రూ.వెయ్యి చొప్పున తొలి ఐదు నెలల మొత్తన్ని వారి ఖాతాలో జమ చేశారు. సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు, ఏపీడీ ఎల్లయ్య, ఇతర అధికారులు కృష్ణకుమార్, వైద్యులు చక్రపాణి, జిల్లా జైలర్ శివలింగం తదితరులు ఇలా ఆడపిల్లలను ప్రోత్సహిస్తూ ఈ గ్రామం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నడానికి నిదర్శనం.
పదేండ్లలోపు ఆడపిల్లలకు ..
గ్రామంలో ఆడపిల్లు పుడితే, కన్న వారిని కూడా ప్రోత్సహించాలని నిర్ణయించాం. పదేండ్లలోపు 74 మంది ఆడపిల్లల పేరిట ‘సుకన్య సమృద్ధి యోజన పథకం’ కింద ఖాతా ఓపెన్ చేసి, వారి పేరిట ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పున జమ చేశాం. ఏడాదిలో 10మంది ఆడపిల్లలు పుట్టినందుకు గ్రామంలో సంబురాలు చేసుకున్నాం. పంచాయతీ కార్యాలయానికి విద్యుద్దీపాలతో అలంకరించి, పండుగలా జరుపుకొన్నాం. ఆడపిల్లల తల్లిదండ్రులను పంచాయతీ కార్యలయం వద్దకు పిలిపించి ఘనంగా సన్మానిస్తాం. మా గ్రామం ఆదర్శంగా నిలవడం చాలా సంతోషంగా ఉంది.