సంగారెడ్డి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ)/ న్యాల్కల్/ పుల్కల్ రూరల్/ పాపన్నపేట : మంజీర నది ఉప్పొంగి ప్రవహిస్తోన్నది. భారీ వర్షాలతో ఎగువన మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుండడంతో శనివారం మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. మంజీర ఉధృతికి జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లోకి మంజీర జలాలు వచ్చాయి. వందలాది ఎకరాల్లో పంటలు జలమయమయ్యాయి. పలు గ్రామాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సింగూరు ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో మంజీర బ్యాక్‌వాటర్ గ్రామాల్లోకి వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంజీర ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సింగూరు ప్రాజెక్టు ఎగువ భాగంలో ఉన్న ధనేగావ్ ప్రాజెక్టు నుంచి శుక్ర, శనివారాల్లో నీటిని విడుదల చేశారు. మరీ ముఖ్యంగా శనివారం ఉదయం నుంచి సుమారు 86,858 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరడంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై దిగవకు సింగూరు ప్రాజెక్టు ఐదుగేట్లు ఎత్తి దిగవకు 55,281 క్యూసెక్కుల నీటిని వదిలారు. మంజీర నదిలోకి వరద కొనసాగుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. రైతులు, మత్స్యకారులు, గొర్రెకాపర్లు ఎవరూ మంజీర నదివైపు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
‘మంజీర’ మహోగ్రరూపం..
‘మంజీర’ మహోగ్రరూపం దాల్చింది. 11 రోజులుగా విరామం లేకుండా మంజీర వరద వనదుర్గా ప్రాజెక్టు మీదుగా పరవళ్లు తొక్కుతున్నది. ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో భారీగా వర్షాలు కురువడంతో పెద్దఎత్తున వరద సింగూరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రతిరోజూ సుమారు 50వేల నుంచి 75వేల క్యూసెక్కుల నీటిని సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు వదులుతున్నారు. మూడు నుంచి ఐదు గేట్లను, రెండు మీటర్లపైకి ఎత్తడంతో వనదుర్గా ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. వనదుర్గా ప్రాజెక్టు పై నుంచి సుమారు 5ఫీట్ల ఎత్తుతో ‘మంజీర’ కిందకు పరవళ్లు తొక్కుతూ, ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఎదుట నుంచి నిజాంసాగర్ వైపు పరుగులు తీస్తున్నది.
వరదతో వందల ఎకరాల్లో నీటమునిగిన పంటలు..
మహారాష్ట్ర నుంచి భారీగా వరద వచ్చి చేరటంతో సింగూరు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ మంజీర పరీవాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల్లోని పంటలు నీటమునిగాయి. పలు గ్రామాలకు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్‌నగర్, చీకుర్తి, అమీరాబాద్, చాల్కి, రాఘవపూర్, కాకిజన్వాడ, గ్రామ శివారులోని పంటపొలాల్లోకి సింగూరు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వచ్చి చేరింది. దీంతో సుమారు 600 ఎకరాల్లో పత్తి, కంది, సోయాబీన్ పంటలు నీటమునిగి రైతులకు నష్టం వాటిల్లింది. చీకుర్తి గ్రామ సమీపం నుంచి సింగూరు బ్యాక్‌వాటర్ ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. రాఘవపూర్ శివరులోని గంగామాత ఆలయం చుట్టూ వరదనీరు చేరింది. మునిపల్లి మండలంలోని గార్లపల్లి, మక్తక్యాసారం, కల్లపల్లి బేలూరు గ్రామాల్లోకి సింగూరు బ్యాక్‌వాటర్ వచ్చాయి. మూడు గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. నాగల్గిద్ద మండలం గోండెగావ్, కారముంగి, గౌడ్గావ్ జన్వాడ, గూడురు, తోర్నాల గ్రామాల్లో పంటపొలాల్లోకి సింగూరు బ్యాక్‌వాటర్ వచ్చి చేరాయి. నాగల్గిద్ద మండలంలో సుమారు 11,000 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మనూరు మండలం బోరం, పుల్కుర్తి, రాయిపల్లి గ్రామాల్లోకి సింగూరు బ్యాక్‌వాటర్ రావటంతో 12000 ఎకరాల్లో పత్తి, కంది, సోయాబీన్ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. అందోల్ మండలంలోని పోతిరెడ్డిపల్లి, అక్సాన్‌పల్లి, అందోల్, సంగుపేట, సాయిబాన్‌పేట, అల్మాయిపేట, కొండారెడ్డిపల్లి, పోసాన్పేట గ్రామాల్లో పంట పొలాల్లోకి మంజీర వరద వచ్చి చేరడంతో 1860 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. హత్నూర మండలంలోని బోర్పల్లి, పల్పనూరు, కాసాల, రెడ్డిఖానపూర్, హత్నూర, నవాబుపేట, పన్యాల, చిక్మద్దూరు, లింగపూర్ గ్రామ శివారులోని పంటపొలాల్లోకి మంజీర వచ్చి చేరడంతో 200 ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి.