
నంగునూరు, ఆగస్టు 31 : భారీ వర్షాలతో నంగునూరు – బస్వాపూర్ రోడ్డు మార్గంలో కల్వర్టు, గట్లమల్యాల – ఖాత దారిలో సీతారాంపల్లి దగ్గర రోడ్డు దెబ్బతిన్నది. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో మంగళవారం ఎస్ఈ వసంత్‌నాయక్, ఈఈ సుదర్శన్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ వెంకటేశం, ఏఈ శ్రీకాంత్‌లు, మాజీ ఏఎంసీ ఎడ్ల సోంరెడ్డి, వైస్ ఎంపీపీ రేణుకావేణుగోపాల్చారి, సర్పంచ్ మమతాజైపాల్రెడ్డి, ఉప సర్పంచ్ ప్రకాశ్‌రెడ్డి, వార్డు సభ్యులు తిరుపతి, సత్తయ్యతో కలిసి దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు.
రోడ్ల మరమ్మతులు చేపట్టాలి : ఎంపీపీ లక్ష్మి
అక్కన్నపేట, ఆగస్టు 31: మండలవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చే యాలని ఎంపీపీ మాలోతు లక్ష్మి అన్నారు. మండలంలోని రేగొండ, మల్‌చెర్వుతండా, మసిరెడ్డితండా, ధర్మారం, పో తారం(జే), గండిపల్లి, మైసమ్మవాగు, కేశనాయక్‌తండా, కట్కూరు గ్రామాల్లో జడ్పీటీసీ భూక్య మంగ, పంచాయతీరాజ్ డీఈ సదాశివరెడ్డితో కలిసి దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. వారివెంట పీఆర్ఏఈ స్నేహా, మాజీ జడ్పీటీసీ బీలునాయక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.
తగ్గని వరద.. దెబ్బతిన్న బ్రిడ్జిలు
కోహెడ, ఆగస్ట్టు 31 : మోయతుమ్మెద, ఎల్లమ్మవాగుతోపాటు మండలంలోని అన్ని చెరువులు ఆలుగు పారుతున్నాయి. బస్వాపూర్ బ్రిడ్జితోపాటు తంగళ్లపల్లి పిల్లివాగు, ఇందుర్తి బ్రిడ్జిలపై రాకపోకలు మంగళవారం కొనసాగలేదు. వరికోలు బ్రిడ్జి వద్ద అప్రోచ్ రోడ్డు ఘోరంగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. తంగళ్లపల్లి పిల్లివాగుపై ఉన్న బ్రిడ్జికి రెండు వైపులా కోత పడింది. కూరెల్ల, కోహెడతోపాటు పలు గ్రామాల్లో చిన్నచిన్న వంతెనలు ధ్వంస మయ్యాయి. బస్వాపూర్ బ్రిడ్జిపై నిలిచిన సిమెంట్ లారీని సర్పంచ్ సత్తయ్య ఆధ్వర్యంలో బయటకు తీశారు. ద్వీపం లా మారిన కోహెడ ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఇదిలా ఉండగా శనిగరం, సింగరాయ పలు చెరువుల వద్ద పడుతున్న మతళ్లను ప్రజలు వెళ్లి ఆసక్తిగా చూశారు. మత్స్యకారులు చేపలు పడుతూ.. అక్కడే విక్రయిస్తున్నారు.
పెద్దమసాన్పల్లిలో తెగిన కట్టు కాలువ
తొగుట, ఆగస్టు 31 : మండలంలోని పెద్దమసాన్పల్లి లో పెద్దచెరువులోకి నీళ్లు వెళ్లడానికి నిర్మించిన కట్టు కాలువ తెగింది. దీంతో పొలాల్లోకి నీళ్లు వెళ్లడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కట్ట తెగిపోవడంతో పెద్ద చెరువులోకి వెళ్లాల్సిన నీళ్లు ఎల్లారెడ్డిపేట బొలక్క చెరువులోకి వెళ్లాయి.