
సంగారెడ్డి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో మంగళవారం మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 51.2 సెం.మీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 1.9 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని చెరువులు, కుంటలు నిండాయి. జలాశయాల్లోకి వర్షం నీరు వచ్చి చేరుతున్నది. సింగూరు ప్రాజెక్టులోకి మంగళవారం ఎగువ నుంచి 4572 క్యూసెక్కుల వరద వచ్చింది. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తు తం నీటి మట్టం 21.738 టీఎంసీలకు చేరింది. నల్లవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. జహీరాబాద్‌లోని నారింజ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. జిల్లాలోని కల్హేర్ మండలంలో అత్యధికంగా 7.4 సెం.మీటర్ల వర్షం కురిసింది. గుమ్మడిదల మండలంలో 6.2 సెం.మీ, వట్పల్లిలో 4.4 సెం.మీ, నారాయణఖేడ్‌లో 3.5 సెం.మీ, న్యాల్కల్లో 3.2 సెం.మీ, కంగ్టిలో 3.1 సెం.మీ, సిర్గాపూర్‌లో 2.9 సెం.మీ, మనూరులో 2.4 సెం.మీ, హత్నూర మండలంలో 2.8 మీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో 1 నుంచి 1.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. సదాశివపేట, మొగుడంపల్లి మండలాల్లో వర్షం లేదు.
సిద్దిపేట జిల్లాలో 2.68 సె.మీ వర్షపాతం
సిద్దిపేట, ఆగస్టు 31: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సరాసరి 2.68 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. అత్యధికంగా దుబ్బాకలో 9.16 సె.మీ, సిద్దిపేట రూరల్‌లో 7.53 సె.మీ, చిన్నకోడూరులో 2.64 సె.మీ, బెజ్జంకిలో 0.51 సె.మీ, కోహెడలో 1.08 సె.మీ, హుస్నాబాద్‌లో 3.25 సె.మీ. అక్కన్నపేటలో 1.05 సె.మీ, నంగునూరులో 1.80 సె.మీ, సిద్దిపేట అర్బన్‌లో 0.88 సె.మీ, తొగుటలో 3.01 సె.మీ, మిరుదొడ్డిలో 8.26 సె.మీ, దౌల్తాబాద్‌లో 4.94 సె.మీ, రాయిపోల్‌లో 0.68 సె.మీ, వర్గల్లో 1.62 సె.మీ, ములుగులో 1.10 సె.మీ, మర్కూక్‌లో 4.23 సె.మీ, జగదేవ్‌పూర్‌లో 1.83 సె.మీ, గజ్వేల్‌లో 2.54 సె.మీ, కొండపాకలో 3.26 సె.మీ, కొమురవెల్లిలో 0.75 సె.మీ, చేర్యాలలో 0.67 సె.మీ, మద్దూరులో 1.02 సె.మీ, నారాయణరావుపేటలో 1.83 సె.మీ, ధూళిమిట్టలో 0.63 సె.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పొంగిపొర్లుతున్న పోచారం డ్యామ్
హవేళీఘనపూర్, ఆగస్టు 31 : రెండు రోజులులుగా కురుస్తున్న వర్షాలతో పోచారం డ్యామ్ పొంగిపొర్లుతున్నది. మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్ గతంలోనే నీరు నిండి నిండుకుండలా మారింది. దానికి తోడు ఇటీవల కురిసిన వర్షాలతో పోచారం మత్తడి మీదుగా నీరు పొంగిపొర్లుతున్నది. పచ్చని ప్రకృతి అందాలకు నెలవయిన డ్యామ్‌ను చూసేందుకు ప్రజ లు ఎంతో ఆసక్తి చూపుతారు. రెండు రోజులుగా కామారెడ్డి జిల్లా వాగుల నుంచి నీటి ఉధృతి పెరుగడంతో శుక్రవారం రాత్రి నుంచి పోచారం డ్యామ్ పొంగిపొర్లుతున్నది. మెదక్ జిల్లాతోపాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. కానీ ప్రస్తుతం నీరు ప్రవహిస్తున్నందున పర్యాటకులు ఈ ప్రాంతానికి రాకూడదని హవేళీఘనపూర్ ఎస్సై శేఖర్‌రెడ్డి సూచించారు. ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా ముందస్తుగా పోచా రం డ్యామ్ వద్దకు ఎవరూ వెళ్లకుండా తమ సిబ్బందిని కాపలా ఉంచినట్లు ఆయన తెలిపారు.
నిండుకుండలా వనదుర్గా ప్రాజెక్టు
పాపన్నపేట, ఆగస్టు 31: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వనదుర్గా ప్రాజెక్టు (ఘనపూర్ ఆనకట్ట) పొంగిపొర్లుతున్నది. ఎగువ ప్రాంతాలైన సంగారెడ్డి, పటాన్చెరు, జోగిపేట తదితర ప్రాం తాల్లో కురిసిన వర్షాలతో మంజీరా నదిలో చేరిన నీరు వనదుర్గాప్రాజెక్టుకు చేరుకుంటుంది. నాలుగు రోజుల క్రితం అంతంతమాత్రంగా ఉన్న ఆనకట్ట నీటి మట్టం ఏకంగా పెరిగి మంగళవారం సాయం త్రం పొంగిపొర్లుతున్నది. కొన్ని రోజులుగా ఫతేనహర్, మహబూబ్నహార్ కెనాల్ ద్వారా పాపన్నపేట, మెదక్, కొల్చారం, హవేళిఘణపూర్ మండలాల పరిధిలోని పంట పొలాలకు వదులుతుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.