ఆర్మూర్, జనవరి 13 : ఆర్మూర్ ప్రాంతంలోని మూడు ఎత్తిపోతల పనులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను గురువారం విడుదల చేసింది. ఆర్మూర్ మండలంలోని సుర్భిర్యాల్, ఫత్తేపూర్ లిఫ్టులకు, బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ ఎత్తిపోతల పనులను చేపట్టేందుకు రూ. 150 కోట్లను స్టేట్ ప్లాన్ ఫండ్స్ నుంచి మంజూరు చేసింది. దీంతో ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రాంత రైతులు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం, మంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
బాల్కొండ, జనవరి 13 : బాల్కొండతోపాటు చిట్టాపూర్, శ్రీరాంపూర్ గ్రామాల్లో సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి చిత్రపటానికి రైతులు, గ్రామాభివృద్ధి కమిటీ నాయకులు గురువారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్తో పాటు మరో రెండు గ్రామాలకు మంజూరు చేసిన లిఫ్టులతో సాగు నీటికి ఢోకా ఉండదని అన్నారు. ఎత్తిపోతల ద్వారా చిట్టాపూర్‌లో 1,952, బాల్కొండలో 1,240, శ్రీరాంపూర్‌లో 3,474 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు దాసరి లావణ్యావెంకటేశ్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, వేల్పూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ వేంపల్లి పెద్ద బాల్‌రాజ్, నాయకులు ఆకుల నరేందర్, సయ్యద్ మజారుద్దీన్, రైతులు పాల్గొన్నారు.