ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 9: ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయితేజ స్మారక కబడ్డీ పోటీలను శనివారం ప్రారంభించారు. అంతకు ముందు సాయితేజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సాయితేజ ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారుడని, ఆయన మరణం క్రీడారంగానికి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని, అతని తల్లికి త్వరలోనే ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేస్తున్నదని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ తెలిపారు.
క్రీడాకారులు క్రమశిక్షణతో మెలిగి ఆటలో మరింత ప్రావీణ్యం సాధించాలన్నారు. మొదటి సారి డైట్ కళాశాల మైదానంలో అంతర్రాష్ట్ర కబడ్డి పోటీలు నిర్వహిస్తుందన్నందుకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 30జట్లు పోటీలకు తరలివచ్చాయి. మూడు రోజుల పాటు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాట్లపై మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్, వైస్చైర్మన్జహీర్ రంజానీ, తెలంగాణ కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి ఉషిరెడ్డి, కోశాధికారి బాబన్న,మాజీ ఎంపీ గోడం నగేష్, ఫ్లోర్‌లీడర్ బండారి సతీష్, జిల్లా కబడ్డి సంఘం అధ్యక్షకార్యదర్శులు సాయిని రవికుమార్, హరిచరణ్, దయానంద్‌రెడ్డి, భూమన్న పాల్గొన్నారు.