శంకర్పల్లి, ఆగస్టు 27 : గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఎంపీడీవో సత్తయ్య మండలంలోని మహరాజ్‌పేట్, పిల్లిగుండ్ల, చందిప్ప తదితర గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. పాఠశాలల్లో బెంచీలు, నీటి ట్యాంకులను శుభ్రపరుస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, భౌతిక దూరం పాటించే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు.
షాబాద్, ఆగస్టు 27 : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో పంచాయతీ సిబ్బంది పాఠశాలలను పరిశుభ్రం చేస్తున్నారు. శుక్రవారం మండల పరిధిలోని పంచాయతీల్లో కార్యదర్శులు, సర్పంచుల ఆధ్వర్యంలో సిబ్బందితో పాఠశాలలను శుభ్రం చేయించారు. పాఠశాలల ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించారు. పాఠశాలలను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచనున్నట్లు మండల విద్యాధికారి శంకర్‌రాథోడ్ తెలిపారు.
నందిగామ, ఆగస్టు 27 : పాఠశాలల్లో శానిటైజేషన్ పనులు సర్పంచ్‌లు పంచాయతీ సిబ్బందితో ముమ్మరంగా చేపడుతున్నారు. పాఠశాలల ఆవరణలల్లో పిచ్చి మొక్కలు తొలగించి, పెరుకుపోయిన మట్టి, చెత్తకుప్పలను తొలగించి, తరగతి గదులను శుభ్రం చేయిస్తున్నారు.
షాద్‌నగర్‌టౌన్ ఆగస్టు 27 : పాఠశాలలతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కౌన్సిలర్ జూపల్లి కౌసల్య మున్సిపల్ కార్మికులకు సూచించారు. 27వ వార్డులోని పాఠశాలలను శుక్రవారం ఎంఈవో శంకర్రాథోడ్తో కలిసి శుభ్రం చేయించడంతో పాటు పరిసరాలలోని పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సర్కార్ చర్యలు తీసుకుంటున్నదన్నారు.
చేవెళ్ల,ఆగస్టు 27 : మండల పరిధిలోని మల్కాపూర్‌లో పాఠశాలలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను ఎంఈవో అక్బర్ తనిఖీ చేశారు. చెత్తాచెదారం తొలగించి, తరగతి గదులను శుభ్రం చేసి, పాఠశాల గదుల్లో రసాయన మందును పిచికారీ చేసి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కొవిడ్ నిబందనలు పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
చేవెళ్లటౌన్, ఆగస్టు 27 : రెండు రోజుల్లో పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో పారిశుధ్య పనులు పూర్తి చేయాలని అధికారులకు ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీడీవో హరీశ్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్కూల్ శానిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకటో తేదీ నుంచి ఏఎన్ఎంలు పాఠశాలలో ఉంటూ కరోనా లక్షణాలున్న విద్యార్థులను గుర్తించి వారికి వైద్యం అందించే విధంగా చూడాలని సూచించారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించే విధంగా విద్యుత్ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో అక్బర్, ఎంపీవో విఠలేశ్వర్, విద్యుత్ అధికారులు ఉన్నారు.
కొందుర్గు, ఆగస్టు 27 : జిల్లెడు చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి కుమార్, ఏఈవో సీతారామ్ పాల్గొన్నారు.
శంకర్పల్లి రూరల్, ఆగస్టు 27 : మండలంలోని మహారాజ్‌పేట, పిల్లిగుండ్ల , అంతప్పగూడ , మాసాన్నిగూడ గ్రామాల్లోని పాఠశాలలను శుభ్రపరిచారు. కార్యక్రమంలో పాఠశాలల, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తూరు రూరల్, ఆగస్టు 27 : మండల పరిధిలోని గూడూరు, మక్తగూడ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనులను చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ, ఎంపీడీవో జ్యోతి హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, ఎంపీడీవో పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలల్లో వంటగది, మరుగుదొడ్లు, తరగతి గదుల్లో మరమ్మతులు ఉంటే తక్షణమే నిర్వహించాలని ఎంపీపీ అధికారులకు తెలియజేశారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్‌ను ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో కిష్టయ్య, సర్పంచ్‌లు సత్తయ్య, రాజు, కార్యదర్శులు పాల్గొన్నారు.