వ్యవసాయానికి సాంకేతికత జోడిస్తే అద్భుత ఫలితాలు ఆవిష్కృతమవుతాయని నిరూపిస్తున్నారు ప్రొ. జయశంకర్ అ్రగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ప్రత్యేకంగా కొత్తూరు మండలంలోని గూడూరును దత్తత తీసుకొని అక్కడి రైతులకు పంటల సాగులో మెళకువలు నేర్పుతున్నారు. ప్రతి మంగళవారం గ్రామంలో పర్యటించి సాయిల్ టెస్టులు, ఆధునిక యంత్రాల వినియోగం, పంటల్లో చీడపీడల నివారణ, మోతాదులో ఎరువుల వాడకం తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఇక్కడి రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అంతేకాకుండా మహిళా రైతులకు స్వయం ఉపాధిపై శిక్షణ ఇస్తున్నారు.
కొత్తూరు, ఆగస్టు 25: దేశంలో రైతులు మూస పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. దీనివల్ల వ్యవసాయ రంగంపై యువత అంతగా ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయానికి సాంకేతికత, ఆధునిక పద్ధతులను జోడిస్తే అద్భుత ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. ఈ విషయాన్ని పొలాల వద్దకే వెళ్లి రైతులకు వివరిస్తే ఎలా ఉంటుంది? వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు ? ఏం చేస్తే బాగుంటుంది లాంటి విషయాలను వివరించడానికి ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ బృందం నడుంకట్టింది. కొత్తూరు మండలంలోని గూడూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నది. ప్రతి మంగళవారం గ్రామంలో పర్యటించి వారికి కావాల్సిన సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నది.
పంట వేయడానికి ముందుగానే పొలాల్లోని మట్టి నమూనాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు సేకరించారు. వాటిని పరీక్షించి గ్రామంలోని 400 మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందజేశారు. ఈ కార్డుల్లో భూమిలోని పోషకాలకు సంబంధించిన అన్ని విషయాలు పొందుపర్చారు. సాయిల్ హెల్త్ కార్డుల ఆధారంగా ఏ పంట వేయాలి. ఏయే ఎరువులు వాడాలి అని రైతులకు వివరించి, పంటలు సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నారు.
ప్రొ.జయశంకర్ యూనివర్సిటీలో పరీక్షించిన నూతన వంగడాలను గూడూరులోని రైతులకు ఉచితంగా అందజేస్తున్నారు. ముఖ్యంగా వరి, కంది, మొక్కజొన్న కొత్త వెరైటీల కిట్లను రైతులకిచ్చి సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఆయా పంటలు వేసినప్పుడు ఆ రైతు సాయిర్ హెల్త్ కార్డును పరిశీలించి, వాటికి అవసరమైన పోషకాలను కూడా ఉచితంగా అందిస్తున్నారు. దీంతో రైతులు నూతన వంగడాలతో నాణ్యమైన అధిక దిగుబడులను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నూతన వంగడాలతో పండించిన పంటల నుంచి అవసరమైన వాటిని మరో పంటకు వంగడాలుగా ఉపయోగించుకుంటున్నారు.
వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధిపై గూడూరు మహిళా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకం, వర్మీ కంపోస్టు, చిరు ధాన్యాల సాగు, చిరుధాన్యాలతో బిస్కెట్ల తయారీ, తేనె, నర్సరీ, హైడ్రో ఫోనిక్స్, కూరగాయల సాగు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
ఐసీఏఆర్- ఎస్సీ సబ్‌ప్లాన్ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి రైతులకు వివరిస్తున్నారు. అధిక దిగుబడులు సాధించేలా, వ్యవసాయాన్ని పరిశ్రమగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అనుబంధ పరిశ్రమలపై శిక్షణ ఇస్తున్నారు.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. వాటికి అనుగుణంగా రైతులు యాంత్రీకరణపై మొగ్గుచూపేలా ప్రోత్సహిస్తున్నారు. కూలీల కొరత ఎక్కువగా ఉంటున్నందున యంత్రాల ద్వారా సాగు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రైతు యాంత్రీకరణ వైపు మొగ్గుచూపక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. వరిలో డ్రమ్ సీడర్, కోత యంత్రాలు, మొక్కజొన్న విత్తనాలు విత్తే యంత్రాలు, అంతర సేద్యం చేయదగిన కోత, నూర్పిడి యంత్రాలు, పత్తి తీసిన తర్వాత పత్తి కట్టెలను ముక్కలు చేసే యంత్రాల గురించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.
ప్రొ.జయశంకర్ విశ్వవిద్యాలయం వారు మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం అదృష్టం. పోయిన ఏడాది వరి విత్తనాల కిట్టు ఉచితంగా ఇచ్చారు. దానితో సాగు చేస్తే నాకు మంచి దిగుబడి వచ్చింది. శాస్త్రవేత్తలు మా ఊరి రైతులకు అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. మా భూముల మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్షలు చేశారు. ఇప్పుడు మా భూమిలో ఏ పంట వేయాలో మాకు తెలిసొచ్చింది. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నాం.
గూడూరులో ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారే ఉన్నారు. వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రతి శనివారం మా ఊరికి వస్తారు. ప్రతి వారం ఏదో ఒక కొత్త విషయంతో వస్తారు. సాంకేతిక విషయాలు ఎన్నో చెప్తున్నారు. వారు మా గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత వ్యవసాయం చేసే విధానం మారి పోయింది.
ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గూడూరును మూడేండ్లకోసం దత్తత తీసుకున్నది. మేం చేసే ప్రతి కార్యక్రమంలో రైతులు మమేకమవుతున్నారు. వారి సహకారం వల్లే మేము ఇదంతా చేయగలుగుతున్నాం. వారికి కావాల్సిన టెక్నికల్ సపోర్టును అందించి అధిక దిగుబడులు వచ్చేలా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా వారిని యూనివర్సిటీకి తీసుకెళ్లి చాలా అంశాల్లో శిక్షణ ఇస్తున్నాం.