ఈ ఏడాది 32 రకాల బతుకమ్మ చీరలు
రంగారెడ్డి జిల్లాలో అర్హులైన ఆడపడుచులు 6.80 లక్షలు
ఇప్పటివరకు జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు 3 లక్షలు
కందుకూరు, మొయినాబాద్‌లో గోదాంలు
పోచంపల్లి, కోయిల్‌కొండ, సిరిసిల్ల, మహబూబ్‌నగర్ నుంచి చీరలు
ప్రతీ ఏటా చీరలకు రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
వికారాబాద్ జిల్లాలో 3,29,627 మంది లబ్ధిదారులు
18 ఏండ్లు నిండిన మహిళలందరికీ అందజేత
పోచంపల్లి, కోయిల్‌కొండ, సిరిసిల్ల, మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన బతుకమ్మ చీరలు
ఈ ఏడాది 32 రకాల డిజైన్లతో బతుకమ్మ చీరల తయారీ ఉమ్మడి జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు గోదాంలలో నిల్వ రంగారెడ్డి జిల్లాలో 6.80 లక్షల మంది, వికారాబాద్ జిల్లాలో 3,29,627 మంది అర్హులైన ఆడపడుచులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నది. ఆడబిడ్డలు సంతోషంగా పండుగ నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో సర్కారు కానుకగా ప్రతి ఏటా చీరలను పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు బతుకమ్మ చీరలు రావడంతో గోదాంలలో నిల్వ చేశారు. ఈ ఏడాది 32 రకాల డిజైన్లతో పోచంపల్లి, కోయిల్‌కొండ, సిరిసిల్ల, మహబూబ్‌నగర్‌లలో నేసిన చేనేత చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. నాణ్యతతో కూడిన ఈ చీరలను ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు కలిగి ఉండి, 18 ఏండ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు చీరను అందించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 6.80 లక్షల మంది అర్హులైన ఆడబిడ్డలు ఉండగా, వికారాబాద్ జిల్లాలో 3,29,627 మంది ఉన్నారు.
రంగారెడ్డి, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు అందజేస్తున్న సర్కారు చీరలు జిల్లాకు చేరుకున్నాయి. ఇప్పటికే జిల్లాకు 50 శాతం మేర చీరలు జిల్లాలోని ఆయా గోదాంలకు చేర్చారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీర పెట్టడం తెలంగాణ సాంప్రదాయం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్ ప్రతీ బతుకమ్మ పండుగకు కానుకగా చీరలు పంపిణీ చేస్తున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీర అందజేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నది. బతుకమ్మ పండుగకు వారం రోజుల ముందు నుంచి ఆధార్ కార్డు, ఆహార భద్రత కార్డు చూపిస్తే చీర అందజేస్తారు.
జిల్లాకు చేరిన 3 లక్షల చీరలు..
బతుకమ్మ పండుగకు పంపిణీ చేయనున్న చీరలు జిల్లాకు చేరుకుంటున్నాయి. ఇప్పటివరకు 3 లక్షల చీరలు తీసుకొచ్చారు. జిల్లాలోని కందుకూరు మండలంలోని కొత్తూరులో ఉన్న గోదాం, మొయినాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో బతుకమ్మ చీరలు నిల్వ ఉంచారు. జిల్లాలో అర్హులైన ఆడపడచులు 6.80 లక్షల మంది ఉన్నారు. ఇప్పటివరకు 50 శాతం మేర చీరలు జిల్లాకు చేరుకోగా, మిగతావి నాలుగైదు రోజుల్లో ఆయా గోదాంలకు చేరుకోనున్నాయి. మొయినాబాద్ గోదాం నుంచి చేవెళ్ల, షాద్‌నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు, కొత్తూరు గోదాం నుంచి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాలకు ఈ చీరలు పంపించనున్నారు. పోచంపల్లి, సిరిసిల్ల, కోయిలకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో తయారు చేసిన బతుకమ్మ చీరలు జిల్లాకు వస్తున్నాయి.
కమిటీల ద్వారా చీరల పంపిణీ
బతుకమ్మ చీరలకు సంబంధించి 200 రంగులు, 70 డిజైన్లు, యువతులు, మహిళల కోసం 6.3 సెం.మీటర్లు, వృద్ధుల కోసం 9 మీటర్ల చీరలను సిద్ధం చేశారు. ప్రతి చీరతోపాటు 80 సెం.మీటర్ల జాకెట్ పీస్ కూడా అందించనున్నారు. మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవోలతో కమిటీ, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ, రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. మున్సిపాలిటీల్లో అయితే బిల్ కలెక్టర్లు, రేషన్ డీలర్లు కమిటీల్లో ఉండనున్నారు.
బతుకమ్మ చీరల పంపణీకి ఏర్పాట్లు
వికారాబాద్, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ): జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడబిడ్డలకు దసరా కానుకగా అందించాలని సీఎం కేసీఆర్ ఐదేండ్ల క్రితం శ్రీకారం చుట్టారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలను ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నది. త్వరలోనే బతుకమ్మ పండుగ ఉన్న నేపధ్యంలో చీరల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ పౌసుమి బసు ఆదేశాలు జారీచేశారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా గోదాంలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని ఆదేశాలు జారీచేశారు. క్లస్టర్లు, గ్రామాల వారీగా ఎంపీడీవోలు ఇన్చార్జి అధికారులను నియమించనున్నారు.
3,29,627 మంది మహిళలు అర్హులు
ప్రస్తుతం జిల్లాలో రేషన్ కార్డుల ఆధారంగా 3,29,627 మంది మహిళలు అర్హులు. గతేడాది 3.16 లక్షల మందికి బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. పరిగి ఇండోర్ స్టేడియం, తాండూరు, వికారాబాద్ వ్యవసాయ గోదాంలలో స్టాక్ పాయింట్లు ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లోని గోదాంల ఇన్చార్జిలను కూడా నియమించారు. ముగ్గురు డిప్యూటీ తహసీల్దార్లను ప్రత్యేకంగా నియమించారు. ఈ మూడు ప్రాంతాల్లో బతుకమ్మ చీరలను భద్ర పర్చనున్నారు.
అంతా సిద్ధం..
ప్రతి ఏడాది దసరాకు రెండు నెలల ముందు నుంచే బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తారు. వారం రోజుల ముందే నిర్వహించే సద్దుల బతుకమ్మకు జిల్లాలో చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ మండలాల్లో వీటి పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబాలకు బతుకమ్మ చీరలు అందించనున్నారు. అక్టోబర్‌లో సద్దుల బతుకమ్మ పండుగ ఉండడంతో అంతుకుముందే మహిళలకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 18 మండలాల్లో మొత్తం 2,41,191 రేషన్ కార్డులు ఉండగా.. 588 రేషన్ షాపులు ఉన్నాయి. జిల్లాలో 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలు 3,29,627 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
నాలుగైదు రోజుల్లో మిగతా చీరలు
ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ పండుగకు అందించే చీరలు ఇప్పటివరకు జిల్లాకు 50 శాతం చేరుకున్నాయి. వీటిని జిల్లాలోని మొయినాబాద్‌లో మార్కెట్ కమిటీ గోదాం, కందుకూరు మండలంలోని కొత్తూరులోని గోదాంలో వీటిని నిల్వ ఉంచాం. మిగతా చీరలు కూడా నాలుగైదు రోజుల్లో జిల్లాకు రానున్నాయి. పూర్తిగా వచ్చిన తర్వాత ఆయా గోదాంల నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు బతుకమ్మ చీరలు చేరవేస్తాం.