వృత్తి ఆర్టీసీ డ్రైవర్.. ప్రవృత్తి జానపద కళాకారుడు
జానపద గేయాల రచనతోపాటు గానంలో దిట్ట..
తన పాటలతో గిరిజనుల్లో మూఢనమ్మకాలను పారదోలిన పెంటోజీ
ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న కళాకారుడు
ప్రభుత్వం ప్రోత్సహిస్తే తానా సభల్లో పాడాలన్నది పెంటోజీ కోరిక
రేపు ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం
ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 20 : వృత్తి ఆర్టీసీ డ్రైవరైనా కళపై అతడికి ఉన్న ఆసక్తి కళాకారుడిగా ఎదిగేలా చేసింది. ఆల్ ఇండియా రేడియోలో గీతాలు ఆలపిస్తూ… దూరదర్శన్‌లో ప్రదర్శనలిస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో పాటలకు పురుడుపోశాడు. తన పాటలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించి ఉద్యమంలో పాల్గొనేలా చైతన్యం తీసుకొచ్చాడు. ఆయన పాటలకు మంత్రి హరీశ్‌రావు కితాబునిచ్చారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో పాటు మునుగోడు, దేవరకొండ, తదితర నియోజకవర్గాల్లో పల్లె జనాన్ని ఆకట్టుకునేలా కాలికి గజ్జెకట్టి పాటలు ఆలపించిన కళాకారుడు పెంటోజీ అంటే తెలియని వారుండరు. నిరక్షరాస్యత, భ్రూణహత్యలు, శిశువిక్రయాలపై తన పాటలతో గిరిజనులకు అవగాహన కల్పించారు. నల్లగొండ జిల్లా, దేవరకొండలో అతిపేద కుటుంబంలో డబ్బికార్ ఎల్లోజి జమునాబాయిలకు 1964లో జన్మించిన పెంటోజీ… చిన్నతనం నుంచే జానపద పాటలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. తండ్రి ఎల్లోజీతో కలిసి తమ కులవృత్తి(కటిక) చేసుకుంటూ కళాకారుడిగా రాణించాడు. తండ్రి మృతి చెందడంతో కుటుంబ బాధ్యత తనపై పడడంతో డ్రైవర్‌గా పని చేస్తూ వీలున్నప్పుడు పాటలు పాడేందుకు వెళ్లేవాడు. అనంతరం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా చేరిన తరువాత, తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలను పల్లెపల్లెనా వినిపించాడు. తన చిన్నతనంలోనే పెంటోజీ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. దూరదర్శన్‌లో వ్యవసాయ పనులపై సలహాలు, సూచనలు అందించే సమయంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ పాటగా పెంటోజీ ఆలపించిన ఆవులమంద కాడ అనే పాట వస్తూ ఉంటుంది. 30గీతాల రాసినప్పటికీ ఆర్థిక స్థోమతలేక పుస్తక రూపంలోకి వెలువరించలేకపోయాడు. ఈ నెల 22న ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే తానా సభల్లో పాడుతానని డబ్బికార్ పెంటోజీ చెబుతున్నాడు.
చిన్నతనం నుంచే ఆసక్తి..
పెంటోజీ చిన్నతనంలోనే అతడి తండ్రి మృతి చెందాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. కటిక వృత్తిలో కొనసాగుతూ చదువుకునేవాడు. గ్రామాలకు వెళ్లి మేకలు, గొర్రెలు తీసుకొచ్చే సమయంలో పశువుల కాపరులు పాడే పాటలు, గీతాలు వినడం వల్ల జానపదాలపై పెంటోజీ ఆసక్తిని పెంచుకున్నాడు. 5వ తరగతి నుంచి పాఠశాలలో జానపదగీతాలు ఆలపించడంతో పాటు కళాప్రదర్శనలు ఇచ్చేవాడు. ఆ తర్వాత పలు ప్రైవేటు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 1995లో ఆల్ఇండియా రేడియోలో పాడటం వల్ల జానపద కళాకారుడిగా గుర్తింపు లభించింది. హుజూర్నగర్ మండలంలో జరిగిన జాతీయ నాటక పోటీలకు హాజరై పలువురిచే ప్రశంసలు అందుకున్నాడు. పెంటోజీ జానపద గేయాలను విని ముగ్ధులైన నారాయణరెడ్డి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రశంసించారు. జానపద గీతాలు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టాయి.
ఆర్టీసీలో తనదైన రీతిలో కళాజాత..
కరోనా సందర్భంగా సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ అధికారుల సహకారంతో నియోజకవర్గంతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో ఊరూరా తిరుగుతూ ఆర్టీసీ ప్రయోజనాలపై ప్రజలకు పాటలు, ఆటల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను గ్రామాల్లో నడుపాలన్న ఆదేశాలతో అధికారుల సహకారంతో ప్రతి గ్రామంలో పెంటోజీ కాలికి గజ్జెకట్టి ఆట ఆడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు అండగా ఉండటం కోసం కుటుంబపెద్దను కోల్పోయిన కుటుంబానికి ఆయన గుర్తుగా పాటలను పాడి వారికి సీడీల రూపంలో అందజేస్తున్నారు.