ఫాంహౌజ్‌లతో మారుతున్న పూడూరు వాసుల జీవన విధానం
పూడూరు, ఆగస్టు 20 : గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన వాతావరణం ఉంటుందని హైదరాబాద్ నగరవాసులు భూములు కొనుగోలు చేసి ఫాంహౌజ్‌లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నగరవాసులు ఆదివారం లేదా ఇతర సెలవు దినాలు వస్తే కుటుంబ సభ్యులతో కలిసి ఫాంహౌజ్‌లకు వచ్చి రోజంతా సరదాగా గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. కొన్ని సంవత్సరాల కిందటి వరకు నగర శివారు ప్రాంతాల్ల్లోనే ఫాంహౌజ్‌లు అధికంగా కనిపించేవి. ప్రస్తుతం అక్కడ భూముల ధరలు పెరగడంతో దూరం ఎక్కువైనా సరే ఫాంహౌజ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం నగరానికి 60 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో నగరవాసులు భూములు కొనుగోలు చేసి ఫాంహౌజ్‌లు నిర్మించి పలు రకాల పండ్ల తోటలను పెంచుతున్నారు. రోజు రోజుకూ నగరవాసులు ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడంతో హైవే రోడ్డు ప్రాంతంలో రెండు నుంచి రెండున్నర కోట్లకు ఎకరం భూమి విక్రయాలు జరుగగా, హైదరాబాద్ హైవే రోడ్డు నుంచి సబ్ రోడ్డుకు కిలో మీటర్ మేరకు ఉన్న భూములకు కోటి రూపాయల వరకు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో భూములకు అధిక ధరలు పలుకడంతో కొందరు రైతులు భూములు విక్రయించి పలు వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుతం పూడూరు మండల పరిధిలో అంగడి చిట్టంపల్లి, చన్గోముల్, కడ్మూర్, కుత్బుల్లాపూర్, మేడిపల్లి కలాన్, కంకల్, సోమన్గుర్తి, పెద్ద ఉమ్మెంతాల్, రాకంచర్ల, పూడూరు, కొత్తపల్లి, బాకాపూర్, మీర్జాపూర్, గొంగుపల్లి, ఎన్కెపల్లి, కండ్లపల్లి తదితర గ్రామాల్లో కలిసి మండల పరిధిలో సుమారుగా150 ఫాంహౌజ్‌ల వరకు ఉంటాయి. గ్రామీణ ప్రాంత యువకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు చూపించడంతో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆదివారం రోజు అనంతగిరి దేవాలయం, కోట్‌పల్లి ప్రాజెక్టు, దామగుండం అటవీ ప్రాంతాలను చూసేందుకు అధిక సంఖ్యలో యువతీయువకులు రావడం వల్ల రోడ్డు మార్గంలో స్థానిక యువకులు స్వయం కృషితో తినుబండారాలు, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. కొందరు యువకులు ఫాంహౌజ్‌లలో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
రోడ్డుకు ఉన్న భూమి అమ్మి మరోచోట కొనుగోలు చేశా
గ్రామానికి వచ్చే రోడ్డు మార్గంలో మా పెద్దలు సంపాదించిన భూమిని విక్రయించి మరో చోట ఎకరం భూమి కొనుగోలు చేశాను. ఒక ఎకరం భూమికి రూ.కోటీ10లక్షలు వచ్చాయి. గ్రామంలోనే మరో చోట రూ.40లక్షలకు ఎకరం కొనుగోలు చేశాను. మిగతా డబ్బులతో బ్యాంగిల్ స్టోర్ వ్యాపారం చేస్తున్నా. భూములకు అధిక ధరలు రావడంతో భూమి విక్రయించిన, మరో చోట కొనుగోలుతో పాటు వ్యాపారం చేసుకునే అవకాశం కలిగింది. ఈ ప్రాంతాల్లో నగరవాసులు ఫాంహౌజ్‌లు నిర్మించడంతో స్థానికులకు ఉపాధి దొరుకుతున్నది.
-ఎండి.ఖదీర్, అంగడి చిట్టంపల్లి గ్రామం, పూడూరు మండలం