అభివృద్ధిలో దూసుకెళ్తున్న కేసారం గ్రామం
ప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు
పొలాల వద్దకు వెళ్లేందుకు ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం
గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం
నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ
అందుబాటులోకి వైకుంఠధామం, డంపింగ్ యార్డు
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు
చేవెళ్లటౌన్, ఆగస్టు 20 : కేసారం గ్రామం అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. చేవెళ్ల పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామం నూతన పంచాయతీగా ఏర్పడింది. రూ.50లక్షల ప్రభుత్వ నిధులతో సర్పంచ్ రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశారు. గ్రామ జనాభా 890 మంది ఉండగా, 750 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో రోడ్లపై మురుగు నీరు, ఊరు పక్కనే పెంటకుప్పలు ఉండటంతో ఈగలు, దోమలతో గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యేవారు. ‘పల్లె ప్రగతి’తో సరిసరాలన్నీ శుభ్రంగా మారాయి. 90 శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. వివిధ రకాల మొక్కలతో పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరంగా ఉన్నది. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. స్నానాల గదులతో పాటు ఇతర సదుపాయాలు కల్పించారు. పంచాయతీ నిధులతో టాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్‌తో నిత్యం ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తునారు. రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు ఫార్మేషన్ రోడ్డు నిర్మించారు. గ్రామ రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు ట్యాంకర్‌తో నీళ్లు పోస్తూ సంరక్షిస్తున్నారు.
మరింత అభివృద్ధి చేస్తాం..
‘పల్లె ప్రగతి’ గ్రామం అభివృద్ధి చెందుతున్నది. పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. గ్రామంలో 90 శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించాం. పల్లె ప్రకృతి వనం నిర్మాణంతో గ్రామానికి ప్రత్యేక అందం వచ్చింది. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశాం. మిగిలిన పనులను త్వరలో పూర్తి చేస్తాం.
పల్లెంతా పరిశుభ్రం..
నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. ప్రతి వీధిలో మురుగు కాల్వలు నిర్మించాం. గ్రామం పక్కన ఉన్న పెంటకుప్పలను తొలిగించాం. పారిశుధ్య నిర్వహణ పక్కాగా జరుగుతుండటంతో పల్లెంతా పరిశుభ్రంగా మారింది. వైకుంఠధామం నిర్మాణం పూర్తై అందుబాటులోకి వచ్చింది. వివిధ రకాల మొక్కలతో పల్లె ప్రకృతి వనం నిర్మించాం.