ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం షాద్‌నగర్ పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం తరహాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి సాయం, సాగు నీరు, రైతు బీమా వంటి పథకాలను అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,04,070 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశామన్నారు. కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, రైతు బంధు వంటి ఎన్నో పథకాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేసున్నదన్నారు.
షాద్‌నగర్, ఆగస్టు 19 : కాళేశ్వరం ప్రాజెక్ట్ తరహాలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం షాద్‌నగర్‌లోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొంత ప్రాంతానికి పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగు నీరు అందుతుందని చెప్పారు. రైతు సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి సహాయం, సాగు నీరు, రైతు బీమా వంటి పథకాలను అమలుచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా 8,04,070 మందికి సుమారు రూ.6 వేల కోట్ల నిధులను లబ్ధిదారులకు చెక్కుల ద్వారా అందజేశామని వివరించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో తాజాగా 353 మందికి రూ.3.53 కోట్ల చెక్కులను అందజేశామని వివరించారు.
ఒక్క పూట అన్నం పెడితేనే సంతోషపడే మనం సీఎం కేసీఆర్ చేస్తున్న సహాయానికి రుణపడి ఉండాలన్నారు. కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, రైతు బంధు వంటి పథకాలు ఆదర్శనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చమురు ధరలను పెంచుతూ పోతున్నదని, ఫలితంగా అన్ని రంగాలపై ఆర్థిక భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వంట గ్యాస్ ధరను పెంచి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరును ప్రజలు గ్రహించాలని, సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని మంత్రి సబితారెడ్డి ప్రజలను కోరారు.
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను కొనసాగిస్తుంటే ప్రతిపక్ష పార్టీల నేతలు అర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. మన ప్రాంతం అభివృద్ధి చెందేందుకు సహకరించాలే తప్ప, అడ్డుకునేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం ఎక్కడా విస్మరించలేదన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.
రూ.1.88 కోట్లతో గ్రంథాలయ భవనం
షాద్‌నగర్‌లో రూ.1.88 కోట్ల నిధులను వెచ్చించి నూతనంగా గ్రంథాలయ భవనాన్ని అత్యాధునికంగా నిర్మిస్తున్నామని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, రాష్ట్ర మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఏడాది కాలంలో భవనం పాఠకులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. నూతన భవనం నిర్మాణం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్.నటరాజన్, గ్రంథాలయ సంస్థల జిల్లా చైర్మన్ పాండురంగారెడ్డి, స్థానిక చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, కౌన్సిలర్లు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.