ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాలు పెంచడం ఆనందంగా ఉన్నది. ఇక నుంచి మరింత బాధ్యతగా పనిచేస్తాం. ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పకడ్బందీగా పంపిణీ చేస్తున్నాం. మా సేవలను గుర్తించి మరోసారి జీతాలు పెంచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-కవిత, అంగన్వాడీ టీచర్, ఇబ్రహీంపట్నం
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణ సర్కార్ మరోసారి జీతాలు పెంచింది. ఈ మేరకు అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బందికి సైతం 30 శాతం పీఆర్సీని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రధాన కేంద్రాల టీచర్లకు 13,650, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రూ.7800 జీతం రానున్నది. పెరిగిన జీతాలు జూలై 1 నుంచి అమలు కానున్నది. కరోనా కష్టకాలంలోనూ అలుపెరగకుండా ఇంటింటికీ తిరిగి పౌష్ట్టికాహారం అందజేసిన అంగన్వాడీలకు మరోసారి జీతాలు పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న తమకు ప్రభుత్వం అండగా నిలువడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడిజిల్లాలో మొత్తం 2,706 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1380 టీచర్లు, 220 మినీ అంగన్వాడీ టీచర్లు, 1365 మంది సహాయకులు ఉన్నారు. అలాగే వికారాబాద్‌లో 939 ప్రధాన కేంద్రాల టీచర్లు, 131 మినీ కేంద్రాల టీచర్లు, 885 హెల్పర్స్ ఉన్నారు.
రంగారెడ్డి, ఆగస్టు 19, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను కూడా పెంచింది. ఇందులోభాగంగా గతంలో చాలా తక్కువ వేతనాలతో జీవనం సాగించిన అంగన్వాడీలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి వేతనాలను పెంచి అంగన్వాడీ టీచర్లకు, సహాయకులకు తగిన గౌరవమిచ్చింది. 30 శాతం పీఆర్సీని అంగన్వాడీలకు కూడా అమలుచేస్తామని ఇచ్చిన హామీ మేరకు బుధవారం అంగన్వాడీల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పెంచిన జీతాలు జూలై ఒకటో తేది నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న అంగన్వాడీలకు సముచిత వేతనం అందించేందుకు నిర్ణయించడంతో జిల్లాలోని అంగన్వాడీ టీచర్లతోపాటు సహాయకులు, మినీ అంగన్వాడీ టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1600 అంగన్వాడీ కేంద్రాలున్నాయి.
30 శాతం జీతాలు పెంపు
అంగన్వాడీ, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకుల జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ టీచర్లకు రూ.13,650లకు, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రూ.7800లకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి అంగన్వాడీల వేతనాలను పెంచింది. జిల్లాలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు కలిపి 1,25,792 మంది ఉండగా, వీరిలో గర్భిణులు 14,897, బాలింతలు 13,022, చిన్నారులు(6 నెలల నుంచి ఏడాది) 14,777, ఏడాది నుంచి మూడేండ్ల పిల్లలు 52,173 మంది, మూడేండ్ల నుంచి ఆరేండ్ల పిల్లలు 30,923 మంది ఉన్నారు. 1145 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. వీరందరికీ కరోనా దృష్ట్యా ఆరు నెలలుగా నేరుగా ఇంటివద్దకు వెళ్లి బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం, మురుకులను పంపిణీ చేస్తున్నారు.
అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మరోసారి వేతనాలు పెంపు
వికారాబాద్, ఆగస్టు 19 : టీఆర్ఎస్ ప్రభుత్వం గత 7 సంవత్సరాల్లో అంగన్వాడీల వేతనాలను మూడు సార్లు పెంచింది. వికారాబాద్ జిల్లాలో 5 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో అంగన్వాడీ కేంద్రాలు 1,106 ఉండగా, అంగన్వాడీ టీచర్లు 939 మంది, 131 మంది మినీ అంగన్వాడీ టీచర్లు, 885 మంది సహాయకులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే అంగన్వాడీ టీచర్లకు 30 శాతం జీతాలు పెంచుతూ జీవోను జారీ చేసింది. దీంతో వారు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
పనికి తగ్గ వేతనం మంచి పరిణామం : దేవి, అంగన్వాడీ టీచర్, షాబాద్
ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచడం సంతోషంగా ఉంది. పనికి తగిన వేతనం అందించడం మంచి పరిణామం. గతంలో కొద్దిపాటి వేతనాలతో ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం కేసీఆర్ అంగన్వాడీ టీచర్ల సేవలను గుర్తించి వేతనాలు పెంచడం హర్షణీయం. సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
వేతనాల పెంపు హర్షణీయం
ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు 30శాతం వేతనాలు పెంచడం హర్షణీయం. ఇంతకు ముందు రూ.10,500 ఉన్న వేతనాన్ని ప్రస్తుతం రూ.13,650కి పెంచడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం : పద్మ, అంగన్వాడీ టీచర్, ఇబ్రహీంపట్నం
గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అంగన్వాడీలను పట్టించుకున్న పాపానపోలేదు. వేతనాలు పెంచిన ఘనత సీం కేసీఆర్‌కే దక్కింది. యావత్తు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
గతంలో ఇబ్బందులకు గురయ్యాం
గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అంగన్వాడీల సమస్యలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తిగా పరిష్కారానికి నోచుకున్నాయి. గతంలో సరైన వేతనాలు లేక ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీ సమస్యలు తెలుసుకుని వేతనాలు పెంచడం సంతోషించదగ్గ విషయం.