మొయినాబాద్, ఆగస్టు 19: అంతా డిజిటల్ మయమైంది. ఏ వస్తువు కొన్నా ఆన్లైన్లోనే లావాదేవీలు చేస్తున్నారు. డిజిటల్ సేవలు పట్టణం నుంచి పల్లెకూ పాకాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకూ నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఆన్లైన్లో పే చేస్తూ డిజిటల్ సేవలను ప్రోత్సహిస్తున్నారు. వ్యాపారం ఏదైనా సరే ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ వినియోగిస్తున్నారు.
కరోనాతో పెరిగిన ఆన్లైన్ లావాదేవీలు
కరోనా నేపథ్యంలో నోట్ల ద్వారా వైరస్ వస్తుందని, డబ్బులు ఒకరి నుంచి ఒకరు తీసుకోవాలంటే భయపడ్డారు. దీంతో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇచ్చారు. కరోనాకు ముందు 20 నుంచి 30 శాతం డిజిటల్ చెల్లింపులు చేస్తే, ప్రస్తుతం 60 నుంచి 75 శాతం చెల్లిస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు పెరిగాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో నగదు కోసం ఏటీఎంల వద్దకు పరుగులు పెట్టాల్సిన పని తప్పింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి, బ్యాంకు ఖాతాలో డబ్బులుంటే చాలు ఎక్కడికైనా వెళ్లి డిజిటల్ చెల్లింపులు చేసుకోవడానికి అవకాశం ఉంది. దూరంగా ఉన్న వ్యక్తులకు డబ్బులు కావాలి అంటే చాలు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంల ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. క్షణాల్లో ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాలోకి డబ్బులు వెంటనే చేరుతున్నాయి.
ఆన్లైన్ చెల్లింపులే ఎక్కువ
యువతంతా ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, కార్డు స్వైపింగ్‌తో డబ్బులు చెల్లిస్తున్నారు. ఆన్లైన్లో చెల్లిస్తే మాకు రిస్కు తగ్గుతుంది. బ్యాంకులకు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేయాల్సిన పని తప్పుతుంది. ఆన్లైన్లో చెల్లిస్తే చిల్లర సమస్య కూడా ఉండదు. డిజిటలైజేషన్ ద్వారా చాలా ఉపయోగాలుంటాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్తో నగదు వెంటనే వస్తున్నది.
బ్యాంకులకు జనాలు తగ్గారు
డిజిటల్ సేవలు విస్తరించిన తరువాత బ్యాంకులకు ప్రజల రద్దీ బాగా తగ్గింది. గతంలో కంటే 30 నుంచి 40 శాతం జనాలు ఆన్లైన్లోనే నగదు బదిలీ చేస్తున్నారు. కరెంట్ అకౌంట్ ఉన్న వ్యాపారులు కూడా ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్నారు. డిజిటలైజేషన్‌ను ప్రభుత్వం కూడా ప్రొత్సహిస్తున్నది. దీంతో వ్యాపారులకు బా్ంయకులకు వెళ్లే పనితో పాటు సమయం ఆదా అవుతున్నది.
స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..
స్మార్ట్ ఫోన్ సౌకర్యం ఉండి, కొంత అక్షర జ్ఞానం ఉన్న ప్రతిఒక్కరూ ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపుతున్నారు. 60 శాతం మంది ఆన్లైన్లో చెల్లిస్తున్నారు. డబ్బులు లెక్క పెట్టి ఇవ్వడం కంటే ఆన్‌లైన్‌తో సెకండ్లలోనే పని పూర్తవుతుంది. ఆన్లైన్లో పేమెంట్ చేయడంతో సమయం ఆదా అవుతుంది. ఆన్లైన్లో చెల్లిస్తే డబ్బులు ఖాతాలోనే జమవుతాయి. లెక్క పక్కాగా ఉంటుంది.