పండ్ల తోటల సాగుకు భారీగా రాయితీ
డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే రూ.1.6 లక్షల రాయితీ
కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు
పందిరి సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టి
రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న అధికారులు
ఉద్యానవన రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందజేస్తున్నది. పండ్ల తోటలు, కూరగాయల సాగు, పూల తోటల సాగు, పాలీహౌస్ ద్వారా పంటల సాగు, ఇతర ఉద్యానవన వాణిజ్య పంటలను సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడంతో పాటు విత్తనాలు, మొక్కలను రాయితీలో అందజేస్తున్నది. పంటల సాగుపై అవగాహన పెంచడమే కాకుండా ప్రత్యేక పంటల సాగు, మార్కెట్లో పంట డిమాండ్ వంటి అంశాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిన్నది. సర్కారు అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు మరింత లాభపడాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ అధికారులు అన్ని వర్గాల రైతులను కోరుతున్నారు.
-షాద్నగర్, సెప్టెంబర్ 2
34,468 రైతులు, 68,198 ఎకరాల్లో సాగు
రంగారెడ్డి జిల్లాలోని అన్ని వర్గాల రైతులు ఉద్యానవన పంటలను సాగుచేస్తున్నారు. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండడంతో రైతులు ఉద్యానవన పంటలను సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పండ్ల తోటలతో పెంపకంతో పాటు కూరగాయలు, ఇతర వాణిజ్య ఉద్యానవన పంటల సాగు ప్రతియేటా పెరుగుతున్నది. సరూర్నగర్, శేరిలింగంపల్లి మండలాలు మినహా మిగతా 23 మండలాల 34,468 రైతులు 68,198 ఎకరాల్లో పండ్ల, పూల తోటలు, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలు సాగుచేస్తున్నారు. 29,279 ఎకరాల్లో పండ్ల తోటలు, 17,772 ఎకరాల్లో కూరగాయల పంటలు, 4082 ఎకరాల్లో పూలతోటలు, 443 ఎకరాల్లో ఇతర ప్రత్యేక ఉద్యానవన పంటలు, 242 ఎకరాల్లో పాలీహౌప్ ఉద్యానవన పంటలు, 763 ఎకరాల్లో పందిరి సాగు, 40 ఎకరాల్లో ఔషధ మొక్కలను సాగుచేస్తున్నారు. ఉద్యానవన పంటల సాగులో రైతులను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీ పథకాలను ప్రవేశపెట్టింది.
పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహం
పండ్ల తోటను సాగుచేసే రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రాయితీలను కల్పిస్తూ రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నది. పండ్ల తోటల విస్తరణ పథకంలో భాగంగా 40 శాతం రాయితీతో మూడు ఏండ్ల పాటు బొప్పాయి సాగు, సస్యరక్షకు ప్రతి యేటా ఆర్థిక సాయం చేస్తున్నది. బొప్పాయి మొక్కలకు రెండేండ్ల పాటు పథకాన్ని వర్తిస్తున్నారు. ఉద్యానవన శాఖ నియమావళి ప్రకారం హెక్టార్లో మామిడి తోట సాగు చేస్తే ప్రతి యేట రూ.13,120, జామ తోటకు రూ. 23,465, బొప్పాయి తోటకు రూ. 30 వేలు, ఆరటి తోటకు రూ. 40,985, సీతాఫలం రూ.33,920, అంజీర రూ.26,560, డ్రాగన్ ఫ్రూట్ రూ. 1.60 లక్షలు, ఉసిరి రూ. 25 వేలు, నేరేడు రూ. 30 వేలు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఉసిరి, నేరేడు వంటి పండ్ల చెట్లను తమ పొలాలకు గెట్లపై సాగుచేసుకుంటే లాభంగా ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.
రాయితీపై కూరగాయల నారు, పనిముట్లు
ఉద్యానవన రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పండ్ల తోటల విస్తరణ పథకంతో పాటు కూరగాయలు, వాణిజ్య పంటల రైతులను మరింత ప్రోత్సహించేందుకు సర్కారు చేయూతను అందిస్తున్నది.
రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిమెట్లలోని నర్సరీలో సాగుచేసిన వంకాయ, టమాట, పచ్చి మిర్చి వంటి నారును అందిస్తున్నారు.
రూ.1500 డీడీని రైతు చెల్లిస్తే 8 వేల టమాట మొక్కలు లేదా వంకాయ మొక్కలు, రూ. 1280 డీడీ చెల్లిస్తే 6400 పచ్చి మిర్చి మొక్కలను అందజేస్తారు. రూ. 500 లను రవాణా ఖర్చులుగా రైతుకు చెల్లిస్తారు.
మిర్చి, టమాట, వంకాయ పంటలను సాగుచేసే రైతులకు రూ. వెయ్యి ప్రోత్సాహంగా అందిస్తున్నారు.
కలుపు నివారించేందుకు రూ. 32 వేల విలువ చేసే మల్చింగ్ కవర్ను 50 శాతం రాయితీతో సరఫరా చేస్తున్నారు. ఒక్కొ రైతు 5 ఎకరాల వరకు పొందవచ్చు.
నీటి సమస్యను అధిగమించేందుకు ఫాం పాండ్ నిర్మాణానికి రూ. 75 వేలను రాయితీగా అందిస్తున్నారు.
అర ఎకరం విస్తీర్ణంలో పాలీహౌస్ను నిర్మించుకునే రైతుకు 50 శాతం రాయితీతో నిధులు మంజూరు చేస్తారు. మీటర్ నిర్మాణానికి రూ.890 ప్రభుత్వం చెల్లిస్తుంది.
అర ఎకరంలో నెట్ హౌస్ నిర్మించుకునేందుకు రైతుకు 50 శాతం రాయితీతో నిధులు మంజూరు చేస్తారు. మీటర్ నిర్మాణానికి రూ.710 లను ప్రభుత్వం చెల్లిస్తుంది.
మినీ ట్రాక్టర్ కొనుగోలుకు రూ.75 వేల ఆర్థిక సాయం
ట్రాక్టర్ మోటర్ పిచికారీ యంత్రం కొనుగోలుపై 50 శాతం రాయితీ
గడ్డి కోత మిషన్ కొనుగోలుపై 50 శాతం రాయితీ
కూరగాయల పందిరి నిర్మాణానికి 50 శాతం రాయితీ
స్ప్రింక్లర్ పరికరాలపై 75 శాతం రాయితీ
కోల్డు స్టోరేజీ, కోల్డ్ రూం, ప్యాక్ హౌస్ వంటి నిర్మాణాలకు దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సాయం చేసేందుకు పరిశీలిస్తారు.
ప్రభుత్వ సాయాన్ని పొందాలి
ఉద్యానవన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. పండ్ల తోటలు, ఇతర వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు ఉద్యానవన పథకాలను పొందితే వారికి కొంత ఆసరాగా నిలుస్తాయి. పంటల సాగు, విస్తీర్ణంపై అవగాహన పెరుగుతుంది. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని రైతు మరింత బాగుపడాలి. పథకాలతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రకాల పంటలపై అవగాహన కల్పిస్తున్నాం.