ఇబ్రహీంపట్నం, ఆగస్టు 31 : గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని… మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని స్థాపించాలన్న ధ్యేయంతో ఓ సంఘసేవకుడు తాను పుట్టిన గ్రామాన్ని ముప్పై ఏండ్ల్లక్రితమే దత్తత తీసుకున్నాడు. రంగారెడ్డిజిల్లా పోల్కంపల్లి గ్రామానికి మారంరాజు రాఘవరావు శ్రీమంతుడు. దత్తత తీసుకోవడమంటే నామమాత్రంగా ప్రభుత్వం ఇచ్చే నిధులను ఖర్చుచేయడం కోసం ఏర్పాటు చేసుకునే నోడల్ అధికారి పాత్రకాదని, సొంత ఆస్తులను అమ్మి గ్రామాభివృద్ధి కోసం నడుం బిగించి గ్రామమంటే ఇలా ఉండాలని తీర్చిదిద్దాడు. ముప్పై ఏండ్లుగా ఆయన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు.
పుట్టిన ఊరు రుణం తీర్చుకోవడం కోసం..
రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో మారంరాజు వేంకటేశ్వరావు వసుధాదేవి దంపతుల కుమారుడు మారంరాజు రాఘవరావు. ఈయన పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలని గట్టి సంకల్పంతో ముప్పై ఏండ్లక్రితమే పోల్కంపల్లిని దత్తత గ్రామంగా తీసుకున్నాడు. 1977సంవత్సరంలో గ్రామాభివృద్ధి పనులకు శంఖారావం పూరించిన ఆయన నేటికీ గ్రామంలో సేవాకార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు.
బడి, గుడితో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు..
ఈ గ్రామపంచాయతీ పరిధిలో ఏన్గల్గూడ, మాన్యగూడ, జాజోనిబావి అనుబంధ గ్రామాలున్నాయి. ఈ గ్రామంలో పదో తరగతి చదువుకోవడానికి పాఠశాల భవనం లేకపోవడంతో పదో తరగతి చదవాలంటే రాయపోల్ లేదా ఇబ్రహీంపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈ పరిస్థితిలో 1994లో ఆయన సొంత భూమి మూడు ఎకరాలను పాఠశాల కోసం ఉచితంగా అందజేశారు. ఆ స్థలంలో ఆయనే సుమారు రూ.30లక్షల వ్యయంతో రెండంతస్తుల భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి అందజేశారు. దీంతో చుట్టుముట్టు గ్రామాల ప్రజలు ఈ గ్రామంలో చదువుతున్నారు. పాఠశాల ప్రారంభం అయినప్పటికీ ఉపాధ్యాయుల కొరత ఉండటంతో ఐదారు సంవత్సరాల పాటు తాత్కాలిక ఉపాధ్యాయులను ఏర్పాటుచేసి వారికి ఆయనే వేతనాలు ఇచ్చారు. దీంతో ప్రస్తుతం గ్రామంలో మూడెకరాల విశాలమైన ప్రదేశంలో రెండుభవంతుల్లో పదో తరగతి వరకు పాఠశాల కొనసాగుతున్నది. అలాగే, పోల్కంపల్లి, నాగన్‌పల్లి గ్రామాల్లో కూడా ఆయన అత్యాధునిక వసతులతో బస్టాండులను ఏర్పాటుచేశారు. అప్పట్లోనే సుమారు రూ.20లక్షలతో ఈ రెండు బస్టాండ్లను నిర్మించారు. పాలరాతితో నిర్మించిన బస్టాండులు రెండు గ్రామాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చర్లగుట్టపై వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలను నిర్మించారు. వీటితో పాటు ఎల్లమ్మ, మైసమ్మ, పోల్కమ్మ గ్రామదేవతల ఆలయాలను కూడా లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించారు.
సీసీరోడ్లు, వీధిదీపాలు..
పోల్కంపల్లి గ్రామంతో పాటు అనుబంధ గ్రామాల్లో ముప్పై ఏండ్లక్రితమే సీసీరోడ్లను నిర్మించారు. రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. రోడ్డు వెడల్పులో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి ఆయన సొంత నిధులతో ఇండ్లను నిర్మించారు. ప్రతి వీధిలోనూ సీసీరోడ్లు ఏర్పాటు చేయడంతో పాటువీధిదీపాలను కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో స్విమ్మింగ్‌ఫూల్‌ను కూడా నిర్మించారు. తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా బోరుబావులను వేయించారు. అత్యాధునిక వసతులతో దవాఖాన నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు.
సొంత భూముల ధారాదత్తం
గ్రామంలో తనకున్న 150ఎకరాల భూములను అమ్మేసి గ్రామాభివృద్ధికి ఖర్చుచేశారు. నేటికీ ఆయన 40మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సొంత నిధుల నుంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
గ్రామానికి చుట్టూ ముఖద్వారాలు..
పోల్కంపల్లి గ్రామానికి వచ్చే అన్ని ప్రధానదారుల్లో ముఖద్వారాలను నిర్మించారు. ప్రతి స్తంభానికి రోప్లైట్లను ఏర్పాటుచేశారు.
సేవ చేయడం ఆనందంగా ఉంది
ఆస్తులు కరిగిపోయినా బాధలేదు, పుట్టిన గ్రామం రుణం తీర్చుకోవడం నాకు సంతోషంగా ఉంది. 150ఎకరాల భూమి పోయినప్పటికీ, 30ఏండ్లుగా గ్రామాభివృద్ధి కోసం సేవచేస్తున్నా. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా ఎంపిక కావాలన్నదే నా లక్ష్యం. పాఠశాల, ఆలయాలను నిర్మించాను. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తా.