
రైతుల అభ్యున్నతి కోసం రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ‘రైతుబంధు’కు అన్నదాతలు, ఆడబిడ్డలు, ఒగ్గుడోలు కళాకారులు బోనమెత్తి పబ్బతి పట్టారు. ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో రూ.50వేల కోట్లు జమైన సందర్భాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో గురువారం అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించారు. ట్రాక్టర్లతో తరలివచ్చిన వేలాది మంది రైతులు భారీ ర్యాలీ తీయగా వేడుకల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొని ఉత్సాహం నింపారు.
బచ్చన్నపేట, జనవరి 13 : గ్రామాల్లో రైతుబంధు ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన వేడుకలు జాతరను తలపించాయి. మండలంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ట్రాక్టర్లకు అరటి ఆకులు, తోరణాలు, గులాబీ జెండాలను అలంకరించుకుని పండుగ వాతావరణంలో భారీ ర్యాలీ తీశారు. స్థానిక దుర్గమ్మ ఆలయం నుంచి ఎస్వీ గార్డెన్ దాకా ఒగ్గుడోలు విన్యాసాలు, బోనాలతో ఊరేగింపు తీయగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వారితో కలిసి నృత్యం చేసి అలరించారు. ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రంగాల్లో దగాపడ్డ తెలంగాణను విముక్తి చేసిన కేసీఆర్, దశల వారీగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే కొందరు ప్రతిపక్ష నేతలు జీర్ణించుకోలేక అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని స్పష్టం చేశారు. రైతురాజ్య స్థాపనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, రైతును రాజుగా చేయడమే ఆయన ఆశయమని చెప్పారు.