సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 12 : యాసంగి పంట సాగు చేసుకునేందుకు రైతులకు మార్గం సుగమమైంది. అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కావడంతో సీఎం కేసీఆర్ను తలుచుకోనివారు లేరు. ఎదురు చూసుడు లేకుండా సార్ పైసలు ఇచ్చిండని రైతులు మురుస్తుండ్రు. సంగారెడ్డి జిల్లాలో రూ.2 వేల 453 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలో 8 విడుతలుగా ఈ నిధులను రైతులకు అందించారు. 8 విడుతల్లో 2,71,756 మంది రైతుల ఖాతాల్లో రూ.2,453 కోట్లు 48 లక్షల 26వేల 654 రైతుల ఖాతాల్లో జమ చేశారు. తొలి విడుతలో రూ.280 కోట్ల 50 లక్షల 35 వేల 800 జమ చేయగా, రెండో విడుతలో రూ.268 కోట్ల 8 లక్షల 87 వేల 450, మూడో విడుతలో రూ.297 కోట్ల 78 లక్షల 21 వేల 640, నాల్గో విడుతలో రూ.216 కోట్ల 45 లక్షల 76 వేల 58 జమ చేశారు. ఐదో విడుతలో రూ.366 కోట్ల 71 లక్షల 8 వేల 450, ఆరో విడుతలో రూ.368 కోట్ల 70లక్షల 28 వేల 425, ఏడో విడుతలో రూ.366 కోట్ల 86 లక్షల 47 వేల 211, ఎనిమిదో విడుతలో రూ.288 కోట్ల 40 లక్షల 7 వేల 100 ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేసింది.
నియోజకవర్గాల వారీగా..
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల వారీగా ఈ నెల 12 వ తేదీ నాటికి విడుదలైన రైతుబంధు నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. అందోల్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 64,657 మంది రైతుల ఖాతాల్లో రూ.574.47 కోట్లు జమ అయ్యాయి. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి 64,958 మంది రైతుల ఖాతాల్లో రూ.657.02 కోట్లు, పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి 21,497 మంది రైతుల ఖాతాల్లో రూ.140.98 కోట్లు, సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి 44,149 మంది రైతుల ఖాతాల్లో రూ.341.04 కోట్లు, జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 59,692 మంది రైతులకు రూ.622.48 కోట్లు, నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలానికి సంబంధించి 15,802 మంది రైతుల ఖాతాల్లో రూ.117.33 కోట్లు జమ చేశారు. జిల్లాలోని అత్యధికంగా నారాయణఖేడ్ నియోజకవర్గం రైతులు లబ్ధి పొందారు.
పెద్ద మొత్తంలో పెట్టుబడి సాయం
రైతుబంధు పథకం ద్వారా తెలంగాణలో మొత్తం రూ.50వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కేవలం నాలుగేండ్లలో రైతులకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి సాయం అందజేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతులు పంట సాగు చేసుకునేందుకు ప్రభుత్వం సకాలంలో డబ్బులు అందిస్తున్నది. రైతులు ఆయా డబ్బులను తమ పంటల సాగుకోసమే వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలి.