తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష, అమలు చేస్తున్న విద్వేషపు ఎజెండాపై రైతులు భగ్గుమన్నారు. యాసంగి ధాన్యం కొనాల్సిందేనని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అన్నదాతలు ఇండ్లపై నల్ల జెండాలను ప్రదర్శించి ఆందోళనలను ఉధృతం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ బైక్ ర్యాలీలు, బీజేపీ సర్కార్ దిష్టిబొమ్మల దహనాలతో పల్లెలు, పట్టణాలు హోరెత్తాయి. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, కోట్‌పల్లిలో పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఆందోళనల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని మాట్లాడారు. కేంద్రం వడ్లు కొనేదాకా పోరాటం ఆపేదిలేదని తేల్చి చెప్పారు. పంజాబ్ తరహాలోనే తెలంగాణలోనూ ధాన్యాన్ని సేకరించాలన్నారు. రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్రానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
రంగారెడ్డి, ఏప్రిల్ 8, (నమస్తే తెలంగాణ) : కేంద్రానికి వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా గ్రామగ్రామాన నిరసనలు హోరెత్తాయి. ఊరూరా రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండాలతో పెద్దఎత్తున కదలివచ్చారు. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లావ్యాప్తంగా పల్లెల్లో రైతులు ఇండ్లపై నల్ల జెండాలను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అంతటా రైతుల ఇండ్లపై నల్ల జెండాలను ప్రదర్శించి కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వరకూ పోరాటం ఆపమని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో రైతుల ఇండ్లపై నల్ల జెండాల ప్రదర్శనలో, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో నిర్వహించిన బైక్‌ర్యాలీలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, శంకర్పల్లి మండల కేంద్రంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాద్‌నగర్ పట్టణంలో నిర్వహించిన బైక్‌ర్యాలీలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్‌కు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయమా అంటూ, పంజాబ్, హర్యానా తరహాలోనే తెలంగాణలోనూ ధాన్యాన్ని సేకరించాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కొర్రీలు పెట్టడం సరికాదని, కేంద్రం ఆహారభద్రత చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదని కేంద్రాన్ని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు నల్లజెండాలను ప్రదర్శించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పరిగి, ఏప్రిల్ 8 : రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించిన వడ్లు కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు తమ ఇంటిపై నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నిరసనల సందర్భంగా తాండూరు మండలం చెన్గేష్పూర్లో ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, కోట్‌పల్లిలో జరిగిన నిరసనల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, తాండూరు, కోట్‌పల్లిలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, పరిగి, కాళ్లాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, కొడంగల్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొని నిరసనలు తెలిపారు. తాండూరు, కొడంగల్ పట్టణాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోటార్‌సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగిలో రైతులు పండించిన వడ్లు కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేయించే వరకు టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి.