భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 12: (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం: ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడ్డాయి. ఖమ్మం నగరంలో భారీ వర్షం కురవడంతో పలు వీధులు జలమయమయ్యాయి. జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అర్ధరాత్రి వేళ చెదరుమదురు జల్లులు కురిశాయి. తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమైంది. ఆ తరువాత మొదలైన వాన మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసింది. సంక్రాంతి సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవులు ప్రకటించినప్పటికీ మిర్చియార్డులో మాత్రం క్రయవిక్రయాలు యథావిధిగా జరిగాయి. ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో పంటను కాపాడుకునేందకు రైతులు పరుగులు పెట్టారు. వర్షం వచ్చే సమయానికి యార్డులో కాంటాల ప్రక్రియ ముగియడం, తోలకాలు చివరిదశకు చేరుకోవడంతో అధికారులు, రైతులు ఊపిరిపీల్చుకున్నారు. మార్కెట్ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, సెక్రటరీ మల్లేశం యార్డులోని క్రయవిక్రయాలను సమీక్షించారు. నగరంలోని పలు వీధులు జలమయం కావడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారుల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. కల్లాల్లో ఉన్న మిర్చిపంటను కాపాడుకునేందకు రైతులు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం తరువాత వర్షం తగ్గడంతో వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంది. భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం, గుండాల మండలాల్లో 1.2 మిల్లీమీటర్లు, జిల్లా వ్యాప్తంగా 7.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల తీసేదశలో ఉన్న పత్తి ఈ వర్షానికి తడిసింది. టేకులపల్లి మండలం రోళ్లపాడు అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో ఇల్లెందు ఆరోమైలుతండా మార్గంలో రోడ్డు మీద నుంచి వర్షపు నీరు ప్రవహించింది. దీంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.