చార్మినార్ : సోదరితో ఏర్పడిన చిన్న ఘర్షణతో బయటకు వెళ్లిన ఓ బాలిక మృగాళ్ల చేతికి చిక్కి ప్రత్యక్ష నరకాన్ని అనుభవించింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులకు ఇన్స్టాగ్రామ్ ద్వార వచ్చిన సందేశంతో బహదూర్‌పుర పోలీసులు కేసును చేధించారు.
భర్త దూరమైన ఓ మహిళ తన ఇద్దకు కూతుళ్లు, ఓ కుమారునితో కలిసి నివసిస్తూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తుంది. గతఏడాది నవంబర్ 20 న రాత్రి ఆమె కూతుర్లైనా అక్క చెల్లెళ్లు చిన్న విషయంలో ఘర్షణ పడ్డారు. దీంతో బాధిత బాలిక (15) తల్లి దగ్గరకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లింది.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిష్ బిల్డింగ్ సమీపంలో కొంతమంది యువకులు వెంటపడగా అక్కడి ఆటో స్టాండ్ లో ఉన్న ఆటో డ్రైవర్లు సమీర్, హఫీజ్‌లకు తెలిపింది. వారు బాలికను వెంబడించిన యువకులను అడ్డుకుని హెచ్చ రించి పంపించివేశారు. ఆ తర్వాత ఉప్పర్‌పల్లిలోని తమ నివాసానికి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు.
నెల రోజుల పాటు ఆమెను బంధించి ఈ దారుణం సాగించారు. ఆ తర్వాత బాలికను మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్‌కు మార్చారు. అక్కడ బాధిత బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దించారు. వీరికి సమీర్ తన భార్య బుషేరా సుల్తానా అలియాస్ సనాతో పాటు అయేషాబేగం అలియాస్ ఆషా సహకరిస్తూ అక్రమార్జనకు పాల్పడ్డారు.
ఇంటిలో బందీగా ఉన్న బాలిక తన పరిస్థితిని తన సోదరి ఇన్‌స్టాగ్రామ్‌కు చేరవేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బహదూర్‌పుర పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు భాదితురాలిని బంధించిన నివాసాన్ని గుర్తించి బాలికను రెస్క్యూ చేశారు.
బాలికను తీసుకెళ్లిన ప్రధాన నిందితులైన సమీర్, హఫీజ్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, సహకరించిన మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరిస్తున్నామని ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు.