
జగదేవ్‌పూర్, జనవరి 16 : పచ్చని పంట పొలాలు.. ఎత్తైన నల్లసరం కొండలు.. ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన కొండపోచమ్మ దేవాలయం జాతర ఉత్సవాలకు ముస్తాబైంది. ‘కొమువెల్లి మల్లన్నకు కోటి దం డాలు.. కొండపోచమ్మకు ముక్కోటి దండాలు.. కరుణించి కాపాడే తల్లి పోచమ్మకు శతకోటి దండాలు’ అంటూ భక్తు లు అమ్మవారిని ఇష్టంగా కొలుచుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు తరలిరానున్నారు. నేటి (సోమవారం) నుంచి ప్రారంభమై 3 నెలలపాటు జాతర కొనసాగనుంది. తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన కొండపోచమ్మ దేవాలయం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్‌నర్సాపూర్ గ్రామంలో దాదాపు 60 ఏండ్ల క్రితం చిన్నగా వెలిసిన అమ్మవారు దినదినాభివృద్ధి చెంది భక్తుల ఇలవేల్పుగా మారి, ఆరాధ్య దైవంగా అవతరించింది.
ఆకట్టుకునే బోనాలు.. నృత్యాలు..
కొండపోచమ్మ జాతరకు వచ్చే భక్తులు ముం దుగా ఆలయం ముందున్న చెరువులో స్నానం ఆచరించి ఆలయ పరిసరాల్లో అమ్మవారికి నైవే ద్యం వండి రంగురంగులు పూలతో అలంకరించిన ఎత్తైన బోనాలతో డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, యువతీ యువకుల నృత్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోసి నైవేద్యం సమర్పిస్తారు. హైదరాబాద్ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తొట్టెలను అమ్మవారి ప్రతిమలను అందంగా అలంకరించి ధూంధాంగా సందడి చేస్తూ వచ్చి ఆలయ ప్రాంగణంలో చెట్టుకు ముడుపులు కడుతారు. ఈ జాతరలో జోగిని శ్యామల వారి బృందం ఎత్తైన బోనం ఎత్తుకొని చేసే నృత్యాలు ఆకట్టుకుంటాయి.
భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు…
కొవిడ్ నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఈవో మోహన్‌రెడ్డి, సర్పంచ్ రజితారమేశ్, చైర్మన్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ ఉత్సవాలకు మంత్రిహరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లకు, జడ్పీ చైర్‌పర్సన్‌కు ఆహ్వాన పత్రిక అందించామన్నారు. జాతరకు కుషాయిగూడ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, పోలీస్ శాఖ వారు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు.