సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్, జనవరి 12 : 18 ఏండ్లు నిండి ఓటరుగా నమోదైన వారందరికీ ఫొటో గుర్తింపు కార్డులు అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరికీ ఎపిక్ కార్డులు అందజేయాలన్నారు. జాతీయ ఓట రు దినోత్సవం జనవరి 25న నూతనంగా ఓటు హక్కు పొందిన యువతకు తమ ఓటరు ఐడీ కార్డును అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫొటో సిమిలర్ ఎంట్రీస్ సాఫ్ట్వేర్ ఇచ్చామని, పోలింగ్ స్టేషన్ వారీగా సార్టౌట్ చేసి బీఎల్వోలకు ఇవ్వాలని సూచించారు. బీఎల్వోలు తప్పనిసరిగా ఇండ్లకు వెళ్లి చెక్ చేయాలన్నారు. ఏకరీతి ఫొటోలు ఉన్న జాబితాను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వీప్ యాక్టివిటీ నిర్వహించి ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు.
25న 1974 మందికి కార్డులు
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో నూతన ఓటర్లుగా నమోదైన 1974 మందికి జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఫొటో గుర్తింపు ఓటరు కార్డులను అందజేస్తామని ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.
మెదక్ జిల్లాలో 4,11,270 మంది ఓటర్లు
మేడ్చల్ నుంచి అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మెదక్ కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కొత్తగా 4,769 మంది ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్నారని తెలిపారు. డూప్లికేట్, మరణించినవి, నియోజకవర్గాలు మారిన తదితర 7,019 మంది ఓటర్ల పేర్లు తుది జాబితాల్లో తొలిగించామన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 4,11,270 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న 18-19 ఏండ్ల వయస్సు గల 1,750 మంది యువత తమ ఓటరు ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో మెదక్ ఆర్డీవో సాయిరాం, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్లు ఉమర్ పాషా, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.