సంగారెడ్డి, ఫిబ్రవరి 2, (నమస్తే తెలంగాణ): “ప్రజలకు, కార్యకర్తలకు, పార్టీ అధిష్టానానికి వారధిగా పనిచేస్తా. ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, నేతలతో మమేకమై ఎలాంటి సమస్యలను ఉన్నా జిల్లా మంతి హరీశ్‌రావు, ఎమ్మెల్యేల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తా” అని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులకు సుపరిచితుడైన రాజకీయ నేత చింతాప్రభాకర్. వివాదరహితుడిగా ఎంతో మంచి పేరున్న నాయకుడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను ఇటీవల టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత తొలిసారిగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
చింతా ప్రభాకర్: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు అప్పగించటం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వల్ల పదవి దక్కింది. నాపై వారు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా. సామాన్య కార్యకర్తలతో మమేకమై జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. పార్టీ నాయకులు, అధిష్టానానికి మధ్య వారధిగా పనిచేస్తాం. కార్యకర్తలకు ఎలాంటి సమస్య ఉన్నా మంత్రి హరీశ్‌రావు, జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తా.
సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ ఎంతో బలంగా ఉన్నది. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు చురుగ్గా ఉన్నారు. కార్యకర్తలు మొదలు నాయకులు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అందరినీ సమన్వయం చేసుకుని పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేస్తాను. త్వరలోనే జిల్లా మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి ఇతర ముఖ్య నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలుపై చర్చిస్తాం. నాయకుల, కార్యకర్తలకు అండగా ఉండటంతోపాటు నిరంతరం అందుబాటులో ఉంటూ జిల్లా అధ్యక్ష పదవికి వన్నె తీసుకువస్తా. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ పటిష్టత కోసం నాతో కలిసి రావాలని కోరుతున్నా.
టీఆర్ఎస్ పార్టీలో యువత, మహిళలకు పెద్దపీట వేస్తాం. టీఆర్ఎస్ మొదటి నుంచి యువతకు ప్రాధాన్యత ఇస్తున్నది. సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరేలా చర్యలు తీసుకుంటాం. పార్టీ కార్యక్రమాల్లో యువతకు భాగస్వామ్యాన్ని కల్పిస్తాం. మహిళలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. టీఆర్ఎస్లో చేరేందుకు మహిళలు ముందుకు రావాలని కోరుతున్నాం. పార్టీ అనుబంధ కమిటీల బలోపేతానికి చర్యలు తీసుకుంటాం.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు?
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రైతుల క్షేమానికి రైతుబంధు, ఉచిత కరెంటు, రైతుబీమా తదితర పథకాలను అమలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇటీవలే సంగారెడ్డికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలప పథకాలను రూ.5 వేల కోట్లతో నిర్మించనున్నారు. రెండు పథకాలు పూర్తయితే సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తాం. సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు, ప్రజల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాల గురించి మొదట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వివరిస్తాం. ఆ తర్వాత టీఆర్ఎస్ శ్రేణుల సహకాంతో ప్రజలకు వివరించేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలకు తెలిసేలా ప్రచారం చేస్తాం.
కాంగ్రెస్, బీజేపీలను ఎలా ఎదుర్కొంటారు?
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలపై ప్రజల్లో విశ్వసనీయత లేదు. సంగారెడ్డి జిల్లా ప్రజలు ఆ రెండు పార్టీలనూ నమ్మరు. అందుకే జిల్లాలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను తిరస్కరిస్తూ తీర్పు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు జిల్లాలో సరైన ప్రాతినిధ్యం లేక ప్రజల్లో పట్టుకోల్పోతుంది. ఆ పార్టీ నాయకులు అంతర్గత విభేదాలతో కుమ్ములాడుకుంటున్నారు. ఇక బీజేపీకి సంగారెడ్డి జిల్లాలో సరైన బలం లేదు. రాష్ట్రస్థాయి మొదలు జిల్లా స్థాయి బీజేపీ నాయకుల మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సహా అందరూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా రాష్ర్టానికి, జిల్లాకు ఆపార్టీ నాయకులు చేసింది ఏమీ లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీపై విమర్శలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శలు, దుర్బాషలాడితే ఇకపై సహించేదిలేదు. వారికి వస్తే ధీటైన సమాధానం ఇస్తాం. అలాగే, సోషల్ మీడియాలో విష ప్రచారానికి పాల్పడితే కఠినంగా స్పందిస్తాం. టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా టీఆర్ఎస్పై విషప్రచారానికి పూనుకుంటే తగిన బుద్ధి చెబుతాం.
జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభం ఎప్పుడు?
సంగారెడ్డిలో పార్టీ జిల్లా కార్యాలయం నూతన భవనం అన్ని సౌకర్యాలతో నిర్మించాం. త్వరలోనే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా సంగారెడ్డిలోనే నేను పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిరంతర అందుబాటులో ఉంటా. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు వెంటనే సమాచారం చేరవేసేందుకు ఏర్పాటు చేస్తున్నాం. పార్టీ ఆదేశాలను అనుగుణంగా క్రమం తప్పకుండా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తాం.