భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం, జనవరి 13: ఉపరితల ఆవర్తన ప్రభావం ఉమ్మడి జిల్లాలో రెండో రోజూ కొనసాగింది. ఖమ్మం నగరంతో పాటు పలు మండలాల్లో ఉదయం నుంచే దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. కారేపల్లి, వైరా, కామేపల్లి, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, కొణిజర్ల, బోనకల్లు, చింతకాని, కూసుమంచి మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. జల్లులు మొదలు కావడంతో ఆరబెట్టిన మిర్చిపంటను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. అయినప్పటికీ అక్కడక్కడా పంటలు తడిశాయి. గడిచిన 24గంటల్లో (బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు) ఖమ్మం జిల్లాలో19.9, భద్రాద్రి జిల్లాలో 23.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెనుబల్లి మండలంలో 50 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నాలుగు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ 4 – 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. భద్రాద్రి జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. అక్కడక్కడా మిర్చి తోటల్లో వర్షపు నీళ్లు నిలిచాయి. టేకులపల్లిలోని కల్లాల్లో ఉన్న మిర్చి కుప్పలు తడిసిపోయాయి. రానున్న ఒకటి రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.