
మెదక్, జనవరి 14: పల్లె లోగిళ్లు పండుగ కాంతులు వెల్లివిరుస్తున్నాయి. రంగురంగుల ముగ్గులతో వాకిళ్లు కళకళలాడుతున్నాయి. బంధువుల రాకతో ఇండ్లన్నీ సందడితో నిండిపోయాయి. సంవత్సరంలో తొలిపంట చేతికొచ్చిన రైతన్న ముఖంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. రంగురంగుల గాలిపటాలతో చిన్నారులు సంబురాలు జరుపుకునే పండుగ. నింగికి నిచ్చెన వేసినట్టుగా గాలిపటాలను ఎగరేస్తూ చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మార్కెట్ల్లో రంగురంగుల పతంగులు సందడి చేస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ ముత్యాల ముగ్గులు, ఘుమఘుమలాడే పిండివంటలు, బంధుమిత్రులతో ప్రతి ఇంట్లో జరిగే వేడుకలు ఒక ఎత్తయితే, చిన్నారుల అందరూ ఎంతో ఇష్టంగా ఎగిరేసే గాలిపటాల సందడి మరో ఎత్తు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా మార్కెట్లో కూడా విభిన్న రకాల గాలిపటాలు దర్శనమిచ్చాయి.
తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి.. ఈ పండుగకు ప్రతీ ఇల్లు ధాన్యపు రాశులతో కళకళలాడుతాయి. ఉదయాన్నే హరిదాసుల కీర్తనలు.. డూడూ బసవన్నలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. మా ఇంటికి రండి అని ఆహ్వానించే గొబ్బెమ్మలు.. ముంగిట్లో ఇంద్రధనస్సును తలపించేలా రంగవల్లులు.. భోగి మంటలు.. బొమ్మల కొలువులు.. చిరునవ్వులు చిందుతూ భోగి పండ్లు పోసుకునే చిన్నారులు.. గాలి పటాల రెపరెపలు.. కొత్త అల్లుళ్ల రాకతో పల్లెలన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భోగిపండుగను ప్రజలు జరుపుకొన్నారు. నేడు సంక్రాంతి, రేపు కనుమ పండుగలు తెలుగు లోగిళ్లలో ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
భోగి పండుగ ముగియడంతో నేడు, రేపు సంక్రాంతి, కనుమ పండుగలు రెండు రోజుల పాటు తెలుగు లోగిళ్లలో ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఇంటింటా పిండి వంటల ఘుమఘుమలు, వాకిళ్లలో ముత్యాల ముగ్గులు, కొత్త అల్లుళ్ల రాకలతో పల్లెలన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి. ఇంటి ముంగిట ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, పిల్లల గాలిపటాల ఎగురవేతలతో పల్లెల్లో సందడి నెలకొంది. ఆడపడుచులు తమ వాకిళ్లను ముత్యాల ముగ్గులతో అలంకరించనున్నారు. మూడు రోజులు నిర్వహించుకునే పండుగ సంక్రాంతి. మొదటి రోజు శుక్రవారం భోగి పండుగ జరుపుకొన్న ప్రజలు, శనివారం మకర సంక్రాంతి, ఆదివారం కనుమ పండుగను నిర్వహించుకోవడానికి సిద్ధమయ్యారు.
సంబురాల్లో మెతుకు సీమ లోగిళ్లు..
సంప్రదాయానికి పెట్టింది పేరైన సంక్రాంతి పండుగ మెదక్ జిల్లాలో సంబురాలు ఘనంగా జరుగనున్నాయి. భోగి సందర్భంగా మహిళలు ఉదయాన్నే ఇండ్ల ముందు రకరకాల ముగ్గులు వేశారు. అందులో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెట్టారు. వాటిలో బంతిపూలు, గరక, రేగు పళ్లను పెట్టి సుందరంగా అలంకరించారు. సంక్రాంతి, కనుక పండుగల సందర్భంగా గ్రామాల్లో బసవన్నలతో గంగిరెద్దుల వాళ్లు ఇంటింటికీ తిరుగుతూ అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారిని ఆశీర్వదించు అంటూ పాటలతో సందడి చేస్తున్నారు.
జోరుగా గాలిపటాల కొనుగోళ్లు..
మెదక్ జిల్లా కేంద్రంలో పతంగులను కొనుగోలు చేసేందుకు జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో రూపాయి నుంచి రూ.200 వరకు గాలిపటాల ధరలు ఉన్నాయి. అయినప్పటికీ చిన్నారులు, పెద్దలు గాలిపటాలను జోరుగా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. కరోనా వైరస్ ఉన్న సమయంలో కూడా ప్రజలు సంక్రాంతి సంబురాలను, గాలిపటాలను ఎగరేస్తూ ఉత్సాహంగా జరుపుకొంటున్నారు.
గాలిపటాలు ఎగరేస్తూ పండుగ సంబురాలు..
మెదక్ జిల్లాలో కరోనా కేసులు పెరిగినప్పటికీ ఈసారి పండుగ సంబురాలు జరుపుకోవడంలో మాత్రం జిల్లా ప్రజలు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. పండుగ సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో గాలిపటాల విక్రేతలు సంక్రాంతి పండగకు ముందు మార్కెట్లోకి వచ్చిన రంగురంగుల గాలిపటాలను విక్రయించడం ద్వారా ఈ సంవత్సరం వ్యాపారాలు బాగానే ఉన్నాయని చెబుతున్నారు.
వీధివీధిలో స్వాగతించిన రంగువల్లులు…
ఏ వీధి చూసిన తీరొక్క రంగులతో రంగుగవల్లులు స్వాగతించాయి. ఉదయమే ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి భోగి పండుగకు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం సిద్దిపేటలో చిన్నారులకు కుటుంబ సమేతంగా భోగిపళ్లు పోశారు. డాబాలు, మైదానాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు పతంగులు ఎగురవేస్తూ సంక్రాంతి పండుగను తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటున్నారు. సిద్దిపేటలోని పలు ప్రాంతాల్లో మహిళలు ముగ్గులు వేస్తుండగా, పలువురు చిన్నారులు పతంగులు సంతోషంగా కొనుగోలు చేశారు.