కామారెడ్డి, మే 3 : రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు విస్తృతంగా ప్రోత్సాహం కల్పిస్తున్నది. యువ పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. పరిశ్రమల ఏర్పాటు విషయంలో నెల వ్యవధిలోనే అనుమతులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మరింత మంది ముందుకు వస్తున్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు సులభంగా అనుమతులు ఇస్తున్నారు. ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉంటే నెలరోజల్లోనే అనుమతులు వచ్చేలా టీఎస్-ఐపాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో పారిశ్రామికవేత్తలకు దళారుల నుంచి వి ముక్తి లభించింది. అనుమతుల కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. అంతేకాదు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. దీంతో అనేక మంది యువ పారిశ్రామిక వేత్తలు, స్వశక్తితో పైకి ఎదగాలనే ఆలోచన కలిగిన యువతకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. ఏడేండ్లలో రాష్ట్రంలో లక్షలాది కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చాయి. అనేకమంది యూనిట్లను నెలకొల్పి ఆర్థికంగా ఎదగడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో యువ పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలకు అనుమతులను పరిశ్రమల శాఖ మంజూరు చేసింది. గతేడాది యూనిట్ల ఏర్పాటుతో సుమారు 1500మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి,
కామారెడ్డి జిల్లాలో ఏడేండ్లుగా పరిశ్రమలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులను మంజూరు చేసింది. 876 వివిధ రకాల యూనిట్లకు గాను 729 యూనిట్లకు పరిపాలనా అనుమతులు లభించాయి. పొల్యూషన్ కం ట్రోల్ బోర్డు నుంచి 83 యూనిట్లకు, కమర్షియల్ ట్యాక్స్ 8, టీఎస్ఐఐసీ 1, పంచాయతీ రాజ్ 22, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్ 23, టీఎస్ఎన్పీడీసీఎల్ 323, ఫ్యాక్టరీస్ 97, టౌన్ ప్లానింగ్ 112, ఫైర్1, గ్రౌండ్ వాటర్ 19, డీఐసీ 1, లేబర్ డిపార్ట్మెంట్ 1, నాలా కన్వర్షన్ 37 వాటికి పూర్తిస్థాయి లో అనుమతులు లభించాయి. 147 యూనిట్ల విషయంలో దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి. పారిశ్రామిక వేత్తలుగా రాణించాలనే ఉత్సాహం ఉన్నవారికి సకాలంలో రుణాలు మంజూరు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నది. పేపర్ ప్లేట్స్, అట్టల తయారీ, టైలరింగ్, రైస్‌మిల్లు, ఎర్త్ మూవింగ్, ప్యాకింగ్ కంపెనీ, వాషింగ్ పౌడర్, సిమెంట్ బ్రిక్స్ తదితర పరిశ్రమల స్థాపనకు గత ఏడాది అనేకమంది దరఖాస్తులు చేసుకున్నారు.
యువతకోసం పారిశ్రామికరంగంలో సైతం రిజర్వేషన్ల ప్రాతిపదికన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ ఇండస్ట్రిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైన్యూర్ అడ్వాన్స్మెంట్ ఇన్సెంటివ్ స్కీం (టీ-ఐడియా), తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్సెంటివ్ స్కీం (టీ-ప్రైడ్) లాంటి పథకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగల వారికి పారిశ్రామిక ప్రోత్సాహక రాయితీలను అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉత్సాహం ఉన్నవారిని వెన్నుతట్టి ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీ-ప్రైడ్,టీ-ఐడియా పథకాల ద్వారా పరిశ్రమలు, వాహనాలు, సేవా రంగంలో 310 యూనిట్లకు రూ.15 కోట్ల సబ్సిడీని ఇవ్వగా 500మంది పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు. ప్ర ధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) ద్వారా 28 యూనిట్లు మంజురు చేయగా 1100 మంది ఉపాధి పొందుతున్నారు.
పరిశ్రమలను నెలకొల్పానుకునేవారు అన్ని రకాల అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువపత్రాలను పరిశీలించి ఆయా కార్యాలయాలకు పంపుతాం. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే నెలరోజుల్లో అనుమతులు వస్తాయి. గత ఏడాది జిల్లాలో ఆశించిన స్థాయిలో అనుమతులు వచ్చాయి. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. పరిశ్రమల శాఖ ద్వారా అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకొని ఆయా రంగాల్లో రాణించాలి.
– లాల్నాయక్, పరిశ్రమల శాఖ జీఎం, కామారెడ్డి జిల్లా