బీబీపేట్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారనున్నాయి. ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా మారనున్నది. మంత్రి కేటీఆర్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు మహర్దశ పట్టనున్నది. పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ నాయనమ్మ గ్రామమైన కోనాపూర్‌లో పాఠశాలను పునర్నిర్మించనున్నారు. ఇందులోభాగంగా ఈ నెల 10వ తేదీన మంత్రి కేటీఆర్ కోనాపూర్ గ్రామానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
-కామారెడ్డి/ బీబీపేట్, మే 8
కోనాపూర్ (పోసానిపల్లె) గ్రామం సీఎం కేసీఆర్ తల్లి వెంకటమ్మ పుట్టిన ఊరు. ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్‌రెడ్డి తన సొంత డబ్బులు రూ. 6 కోట్లతో బీబీపేట మండల కేంద్రంలో బాలుర పాఠశాల భవనాన్ని నిర్మించగా, ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆధునికహంగులతో నిర్మించిన పాఠశాలను ప్రారంభించి, తన నాయనమ్మ ఊరైన కోనాపూర్‌ను గుర్తుచేసుకున్నారు. తాను కూడా కోనాపూర్‌ను దత్తత తీసుకొని కార్పొరేట్ తరహాలో పాఠశాలను నిర్మిస్తానని ప్రకటించారు.
దీంతో కోనాపూర్ గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి కేటీఆర్ ఈనెల 10న కోనాపూర్ గ్రామానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపనకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని పొక్లెయినర్ సహాయంతో కూలగొట్టారు. అదే స్థలంలో సుమారు రూ. 4కోట్లతో అన్ని సౌకర్యాలతో పాఠశాల భవనం నిర్మించనున్నారు.
ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో ఏడు గదులు, ఫస్ట్ ఫ్లోర్లో ఏడు గదులు మొత్తం 14 గదులను నిర్మించనున్నారు. అలాగే గ్రామంలోని పాత పంచాయతీ భవనాన్ని కూలగొట్టి అదే స్థలంలో పార్కును ఏర్పాటు చేయనున్నారు. రూ.2.50 కోట్లతో సీసీ రోడ్లు, గ్రామశివారులో వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. వీటన్నింటినీ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా గ్రామం లో అభివృద్ధి పనులు జోరందుకోగా, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి రాక నేపథ్యంలో ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇప్పటికే పరిశీలించారు.
మారనున్న పాఠశాల రూపురేఖలు
కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సరైనా సౌకర్యలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. 2021-22లో 85మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. కేటీఆర్ పాఠశాలను దత్తత తీసుకొని కార్పొరేట్ స్థాయిలో నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. నూతన భవనంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయి.
-సోలేటి వెంకటేశ్, హెచ్ఎం, కోనాపూర్ పాఠశాల
వస్తనని చెప్పిండు.. అన్నట్లనే వస్తుండు..
కోనాపూర్ గ్రామానికి వచ్చి స్కూల్ బాగు చేస్తానని బీబీపేట మీటింగ్‌లో చెప్పిండు. గ్రామస్తులందరం కలిసినప్పుడు కూడా నిధులు ఇస్తానని, సొంతంగా బాగు చేయిస్తా అన్నడు. మా ఊరికి సీఎం కేసీఆర్ కొడుకు రావడం సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం స్కూల్‌ను కొత్తగా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
– మెడుదుల రాజాగౌడ్, మాజీ సర్పంచ్
కేటీఆర్ రావడం మా అదృష్టం
కేటీఆర్ మా గ్రామానికి రావడం మా అదృష్టం. మా ఊరి అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే సీసీ రోడ్ల కోసం రూ.75 లక్షలు మంజూరు చేశా రు. రూ.4 కోట్లతో ప్రభు త్వ పాఠశాలను నూతన హంగులతో నిర్మించనున్నారు. గ్రామ శివారులో రహదారిపై ఉన్నవాగుపై వంతెన నిర్మాణానికి దాదాపు రూ. 2.50 కోట్లు వెచ్చించనున్నారు. కేటీఆర్ మా ఊరిని అభివృద్ధి చేయాలని నిర్ణయించడం ఆనందంగా ఉంది.
-స్వామి, ఉప సర్పంచ్, కోనాపూర్